breaking news
Implementing Agencies
-
బువ్వ బిల్లు.. అందక ఘొల్లు
మధ్యాహ్న భోజన పథకం సదుపాయకర్తలకు రూ.37.94 కోట్లు బకాయి సొమ్ము అందకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మహిళలు ఏలూరు సిటీ : సర్కారు బడుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. భోజనం నాణ్యతపై మాత్రమే దృష్టిసారిస్తున్న అధికారులు సదుపాయకర్తలకు (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు) బిల్లులు చెల్లించే విషయంలో శ్రద్ధ చూపటం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో సదుపాయకర్తలకు నాలుగు నెలలు, ఉన్నత పాఠశాలల్లో పథకాన్ని అమలు చేస్తున్న నిర్వాహకులకు ఐదు నెలల నుంచి బిల్లులు విడుదల చేయకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో లక్షలాది రూపాయల మేర అప్పుతెచ్చి మరీ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. పాత బకాయిలకు సంబంధించి మంజూరైన రూ.34.28 కోట్ల నిధుల్లో రూ.18.20 కోట్లను మాత్రమే సదుపాయకర్తలకు చెల్లిం చారు. మిగిలిన రూ.16.08 కోట్లు సదుపాయకర్తలకు అందలేదు. దీంతోపాటు రూ.21.86 కోట్ల కొత్త బకాయితో కలిపి మొత్తం రూ.37.94 కోట్ల మేర పేరుకుపోయాయి. ఖజానా నుంచి నిధులు విడుదల చేసే విషయమై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మంజూరైన నిధులు సైతం విడుదల కావడం లేదు. జీతాలూ ఇవ్వట్లేదు ఏలూరు వన్‌టౌన్‌లోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో 860 మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. రోజూ 600 నుంచి 700మంది ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుంటారు. ఇక్కడి సదుపాయకర్తలకు నెలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోంది. ఐదు నెలలుగా వీరికి బిల్లులు చెల్లించలేదు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి మరీ భోజనం పెట్టాల్సి వస్తోందని సదుపాయకర్తలు బావురుమంటున్నారు. ఆర్‌ఆర్‌పేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రోజూ సుమారుగా 350నుంచి 400మంది పిల్లలు భోజనం చేస్తారు. పథకం నిర్వాహకులకు నెలకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకూ ఖర్చవుతోంది. ఇక్కడి వారికీ ఐదు నెలలుగా బిల్లులు రాలేదు. ఆదివారపుపేటలోని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ ఉన్నత పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులున్నారు. నిత్యం 350మందికి పైగా పిల్లలు భోజనం చేస్తారు. ఇక్కడా బిల్లులు చెల్లించకపోవటంతో సదుపాయకర్తలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం వంట పనివారికి చెల్లించాల్సిన జీతం కూడా ఇవ్వటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. నెలంతా పనిచేస్తే వారికిచ్చేది రూ.వెయ్యి మాత్రమే. అదికూడా విడుదల చేయటం లేదు. 3,350 స్కూళ్లు.. రూ.37.94 కోట్ల బకాయిలు జిల్లాలోని 2,637 ప్రాథమిక పాఠశాలల్లో 1,30,508 మంది, 276 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 76,304 మంది, 437 ఉన్నత పాఠశాలల్లో 46,354 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో భోజనం వండి వడ్డించే బాధ్యతను స్వయం సహా యక మహిళా సంఘాలకు అప్పగించారు. ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి రూ.6.38 చొప్పున, ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.4.60 చొప్పున చెల్లిస్తారు. వారానికి రెండుసార్లు కోడిగుడ్డు వేయాల్సి ఉంటుంది. ఒక్కో గుడ్డు ధర మార్కెట్లో రూ.4 ఉంది. విద్యార్థులకు ఇచ్చే కొద్దిమొత్తంలో కోడిగుడ్లు ఎలా కొనాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఏడాదికి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జిల్లాకు సుమారు రూ.61 కోట్లు వరకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.34.28 కోట్లు నిధులు మంజూరు చేశారు. కానీ నిర్వాహకులకు మాత్రం ఆ సొమ్ములో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.18.20 కోట్లు చెల్లించగా, మిగిలిన రూ.16.08 కోట్లు ఇప్పటికీ అందలేదు. దీంతోపాటు సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఐదు నెలలకు బిల్లులు చెల్లించలేదని చెబుతున్నారు. ఖజానాలో నిధుల్లేక పోవటంతో పేరుకు మంజూరైనా ఉపయోగం లేకుండా పోయింది. మరో రూ.21.86 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. నిర్వాహకులు వేతనాలుగా రూ.4.86 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
వెచ్చాల్లేకుండా వండిపెట్టేదెలా?
* మధ్యాహ్న భోజన పథకంపై సర్కారు నిర్లక్ష్యం * రెండు నెలలుగా విడుదల కాని నిధులు * అప్పులతో నెట్టుకొస్తున్న ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అమలాపురం : బియ్యం, నీళ్లు ఇవ్వకుండా వట్టి కుండ, కట్టెలు ఇచ్చి, అన్నం వండమన్నట్టుంది సర్కారు తీరు. మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు రెండు, మూడు నెలులగా నిధులు విడుదల కాక, మూడు నెలలుగా సిబ్బందికి జీతాలందక పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అక్టోబరు, నవంబరు నెలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రావాల్సిన సొమ్ములు అందలేదు. కొన్ని పాఠశాలలకైతే సెప్టెంబరులో రావాల్సిన సొమ్ములు కూడా చేతికందలేదు. మధ్యాహ్న భోజనానికి పౌరసరపరాల శాఖ ద్వారా బియ్యం అందుతుండగా, వారికి అన్నంతోపాటు అందించే పప్పు, కాయగూరలు, ఇతర నిత్యావసర వస్తువులకుగాను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు నిధులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.3.78 కోట్ల వరకు అందించాల్సి ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. వారానికి రెండుసార్లు అందించాల్సిన కోడిగుడ్డు ధర కూడా మండిపడడం వారికి మరీ భారమవుతోంది. ఈ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. చాలా ఏజెన్సీలు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోంది.