breaking news
Imperial Garden
-
‘అమితా’నందం!
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ ైెహ దరాబాద్‌లో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు గురువారం బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో సన్మాన, అభినందన సభ ఘనంగా జరిగింది. సభా వేదికైన సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ జనసంద్రమైంది. ‘భారత్ మాతాకీ జై... వందేమాతరం, జై తెలంగాణ’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు సభా ప్రాంగణంలో హోరెత్తాయి. అమిత్ షాను సన్మానించేందుకు నాయకులు వరుస కట్టడంతో ఒక దశలో వేదికపై తొక్కిసలాట జరిగింది. సభ కు పెద్దసంఖ్యలో జనాలు తరలిరావడం పార్టీ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. సభా ప్రాంగణంలో కిక్కిరిసిన జనాన్ని చూసిన అమిత్ షా మొహంలో ఉత్సాహం తొణికిసలాడింది. తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆయన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నగరంలో మళ్లీ బీజేపీ పట్టు సాధిస్తుందన్న విశ్వాసం ఆయన మాటల్లో ప్రస్ఫుటమైంది. స్థానిక నాయకులు తమ ప్రసంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని తూర్పారబట్టుతూనే... ఎంఐఎం ఎత్తుగ డలను కీలకంగా ప్రస్తావించడం సభికుల ను ఆకట్టుకుంది. కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికల్లో పార్టీ విజయ కేతనం ఎగురవేసి అధికార పగ్గాలను చేపట్టాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు. నేతలు ప్రసంగిస్తున్నంత సేపు భారత్ మాతాకీ జై అన్న నినాదాలు మిన్నుముట్టాయి. బీజేపీని బలోపేతం చేద్దాం: డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని ముందుకొచ్చే నాయకులకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీనాయకత్వంలో ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కరతాళధ్వనుల మధ్య మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతులమీదుగా పార్టీ కండువా క ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌నూ కమలం కండువాను కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎల్పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు దిలీప్ కుమార్ ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, శంకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకనపల్లి సుజాత, కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ సురేందర్, పీఆర్పీ స్టేట్ మాజీ సెక్రటరీ జి.లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శంకర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజేంద్రనగర్ అభ్యర్థి ఉండవల్లి ప్రమీల, శంషాబాద్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ శివరాం నాయక్, మాజీ కార్పొరేటర్ అమర్నాథ్, అఖిల భారత ఎల్ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకుడు షేక్ షాజహాన్ తదితరలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. -
నగరం కాషాయమయం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాకను పురస్కరించుకుని నగరం కాషాయ మయమైంది. ప్రధాన మార్గాలు, కూడళ్లలో బీజేపీ జెండాలు, నాయకుల ఫ్లెక్సీలతో నిండిపోయింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నగర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సమాయత్త మయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నగర బీజేపీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 2.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు సాదర స్వాగతం పలికి అటునుంచి నేరుగా బేగంపేటలోని టూరిజం గెస్ట్‌హౌస్‌కు తరలనున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో అమిత్ షాకు అభినందన సభ నిర్వహించేం దుకు నేతలు ఏర్పాట్లు చేశారు. బలోపేతమే ప్రధాన వ్యూహం కేంద్రంలో అధికారంలో ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలం పుంజుకోవాలన్న వ్యూహంతో బీజేపీ కదులుతోంది. కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వంపై నమ్మకం కుదరడంతో రాష్ట్రంలో పలువురు నేతలు అటు వైపే దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తొలిసారిగా నగరానికి వస్తుండటంతో గ్రేటర్ బీజేపీలో కొత్త ఊపు వచ్చింది. త్వరలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు అమిత్ షా రాకను సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి భావిస్తున్నారు. దేశ, నగర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్, మజ్లిస్ల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు గ్రేటర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. బీజేపీలో చేరనున్న నేతలు! పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా భారీగా చేరికలకు నగర శాఖ గేట్లు తెరిచింది. అమిత్ షా అభినందన సభలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు బేగంపేట కార్పొరేటర్ శంకర్ యాదవ్ (కాంగ్రెస్), బర్కత్‌పురా కార్పొరేటర్ దిడ్డి రాంబాబు (కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్), జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మామిడి లక్ష్మీబాయి భర్త మామిడి నర్సింగరావు పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం.