breaking news
IIMC
-
‘మీడియా చెప్పిందల్లా నిజం కాదు’
న్యూఢిల్లీ : భారత్‌లో మహిళల భద్రత గురించి మీడియా క్రియేట్ చేసిన ఒపినియన్ వల్లే మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం ఏర్పడిందంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(ఐఐఎమ్‌సీ) 51వ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. న్యూస్ పేపర్లు, టీవీ చానెళ్లు పార్లమెంట్లో జరిగే నిరసనలు కవర్ చేయడానికి ఉత్సాహం చూపిస్తాయి.. కానీ సమాజానికి ఉపయోగపడే అంశాల గురించి నడిచే డిబేట్లను ప్రసారం చేయవంటూ విమర్శించారు. ఇక్కడ మహిళలు రోడ్ల మీద తిరగరు.. అంత మాత్రం చేత భారత్‌లో ఉన్న మహిళలు సురక్షితంగా లేరని చెప్పలేం కదా అన్నారు. అంతేకాక నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది మేడం.. మీ దేశం ఇప్పటికి కూడా సురక్షితం కాదా అంటూ అక్కడి జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు అని తెలిపారు. అప్పుడు నేను గత 75 ఏళ్లుగా నేను ఇండియాలో ఉంటున్నాను.. నాకేం కాలేదు.. నా కూతురికి గాని.. కోడలికి గాని ఏం కాలేదు. మీరనుకుంటున్నట్లు ఏం లేదు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మా దేశంలోను.. మీ దేశంలోను.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ప్రజలు నేరాలు చేస్తుంటారు. అంటే ఆ దేశంలో నేరాలు మాత్రమే జరుగుతాయా.. వేరే ఏం జరగవా అని వారిని అడుగుతాను అని తెలిపారు. అలానే రాజకీయాల్లో ఎప్పుడు అసభ్య పదజాలమే వాడము కదా.. కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడతాము. కానీ వాటి గురించి మీడియా పట్టించుకోదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సమాజానికి ఏం అవసరముంది.. కానీ మనం ఎలాంటి వార్తలు ప్రచురిస్తున్నాం అనే విషయం గురించి మీడియా సంస్థలు ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్‌కు పరిస్థితిని విశ్లేషించే సామర్ధ్యం కలిగి ఉండటం చాలా ప్రధానం అని తెలిపారు. -
వారెవ్వా.. సోషల్ వెబ్ సైట్లు!
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమాల్లో సామాజిక వెబ్సైట్ల పాత్ర రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్ర ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం నుంచి భారత్‌లో ఊపందుకున్న ఈ వెబ్సైట్ల పాత్ర అప్రతిహతంగా ముందుకెళుతోంది. కేంద్రంలోని యూపీఏ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కిందకు దింపి మోదీ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించడంలో, ఢిల్లీ పీఠాన్ని ‘ఆమ్ ఆద్మీ’కి అప్పగించడంలో సామాజిక వెబ్సైట్ల పాత్ర అంతా ఇంతా కాదు. కోల్‌కతా నుంచి జోధ్‌పూర్‌కు, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనకు ఇప్పుడు అండగా నిలుస్తున్నది నిస్సందేహంగా సామాజిక వెబ్సైట్లే. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో రాజకీయ పార్టీల్లో విలువలు అణగారిపోతున్న నేపథ్యంలో ప్రజలకు అండగా తాముంటామంటూ ముందుకొస్తున్న ఈ వెబ్సైట్ల పాత్ర ప్రశంసనీయం. ఊసుబోని కబుర్లకు, కాలక్షేప కాకమ్మ కథలకు, పార్టీల చిట్‌చాట్‌లకు, ప్రేమ కలాపాలకు, సెల్ఫీలకే తాము పరిమితం కాలేదంటూ నిరూపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమాలను పాలక, ప్రతిపక్షాలే కాకుండా సామాజిక బాధ్యతను భుజానేసుకొని తిరిగే మీడియా కూడా పట్టించుకోకపోతే...వారి ఆందోళనకు లక్షలాది గొంతులను కలిపి విశేష ప్రాచుర్యం కల్పించిన ఘనత కూడా సామాజిక వెబ్సైట్లదే...అందుకు కొన్ని ఉదాహరణలు... జోధ్‌పూర్ ఐఐటీ విద్యార్థుల ఆందోళన ఎన్నో సమస్యలున్న జోధపూర్ ఐఐటీ కాలేజీ గురించి రాజకీయ నాయకుల ముందుగానీ, మీడియా ముందుగానీ మాట్లాడకూడదంటూ ‘విద్యార్థుల ప్రవర్తనా నియమావళి’ పేరిట ఐఐటీ డెరైక్టర్ సీవీర్ మూర్తి గత జనవరితో హుకుం జారీ చేశారు. దీనిపై విద్యార్థల ఆందోళను చేస్తున్న ఎవరూ పట్టించుకోలేదు. వారి ఆందోళనకు పెద్దగా ఎవరికి తెలియని ‘కోరా డాట్ కామ్’ అనే బ్లాగ్ పట్టించుకొని ప్రాచుర్యం కల్పించింది. దాంతో నేషనల్ మీడియాలోనూ విద్యార్థుల ఆందోళనకు ఎంతో ప్రచారం లభించింది. రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులు మార్చి 29వ తేదీన ఓ ఉత్తుత్తి సమాధి రాయిని ఏర్పాటుచేసి ‘ఉత్తుత్తి నివాళి’ పేరిట నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి నేషనల్ మీడియా కదిలొచ్చి దేశవ్యాప్త ప్రచారాన్ని కల్పించింది. సెప్ట్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు అహ్మదాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ’ (సీఈపీటీ) కళాశాలలో సమస్యలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సామాజిక వెబ్సైట్లు ప్రాచుర్యం కల్పించడం వల్ల కళాశాల యాజమాన్యం దిగొచ్చింది. ఐఐఎంసీ విద్యార్థులకు చేయూత డిల్లీలోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్’ (ఐఐఎంసీ) కోర్సులను సరిగ్గా నిర్వహించడం లేదని, ఫాకల్టీకి టీచర్లు సరిగ్గా రావడం లేదని విద్యార్థులు సామాజిక వెబసైట్ల ద్వారా ఉద్యమాన్ని నడిపారు. ఈ ఆందోళనలో ఫేస్బుక్ వారికి ఎంతో దోహదపడింది. ఇలా ఎన్నో సామాజిక ఉద్యమాలకు సామాజిక వెబ్సైట్లు ఊపరిపోస్తున్నాయి. వీటి వల్ల సామాజిక ప్రయోజనాలతోపాటు హానికరమైన పరిణామాలు కూడా ఉన్నాయని సంగతి తెల్సిందే. వాస్తవాలను బేరేజు వేసుకోకుండా, వివేచనతో, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ‘నాగాలాండ్‌లో రేపిస్టు పేరిట ప్రజల చేతుల్లో జరిగిన హత్య’ లాంటి దారుణాలు పునారావృతం అవుతాయి. -నరేందర్ రెడ్డి (సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం)