ఐఎస్ కొత్త రూటు!
లండన్: పలు దేశాల ప్రభుత్వాలు, సోషల్ మీడియా సంస్థలు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది కొత్త రూపాల్లో విస్తరిస్తోంది. తాజాగా స్మార్ట్ ఫోన్ యాప్ ను ప్రారంభించింది. ఐఎస్ ప్రచార విభాగం 'లైబ్రరీ ఆఫ్ జీల్' ఈ యాప్ ను రూపొంచింది. 'హరూఫ్' పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా పిల్లలకు జిహాదీ పాఠాలు బోధించనుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.
అరబిక్ అక్షరాలతో పాటు, మారణాయుధాలను ఎలా ఉపయోగించాలని అనే విషయాలను ఈ యాప్ ద్వారా పిల్లలకు నేర్పుతారని 'లాంగ్ వార్ జర్నల్' వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) టెలిగ్రాఫ్ చానల్స్, ఇతర వెబ్ సైట్ల ద్వారా ఈ యాప్ ను విడుదల చేసినట్టు తెలిపింది. పిల్లలు సులువుగా నేర్చుకునేలా గేమ్స్ రూపంలో ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తయారు చేశారు. అరబిక్ అక్షరాలు ఎలా రాయాలో ఇందులో చూపిస్తారు. జిహాదీ పదాలతో ఇస్లామిక్ పాటలు కూడా ఇందులో పెట్టారు. పిల్లల కోసం ప్రత్యేకంగా యాప్ ప్రారంభించడం ఇదే మొదటిసారి అని నివేదికలు తెల్పుతున్నాయి.
తమకు సంబంధించిన ప్రకటనలు, వీడియోల ప్రసారం కోసం ఇటీవలే తాలిబాన్ 'అలెమరాష్' పేరుతో ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేసింది. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని తొలగించారు.