breaking news
HR managers
-
HR మేనేజర్‌ను ముక్కలు చేసి, గోనె సంచిలో కుక్కి ; తలకోసం గాలింపు
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాల్ని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసిన వైనం కలకలం రేపింది. అనుమానంతోనే ఈ హత్యకు తెగబడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఆగ్రాలో యమునా నదిపై ఉన్న వంతెన సమీపంలో 32 ఏళ్ల హెచ్ఆర్ మేనేజర్‌ను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి, తల నరికి, ఆ తర్వాత ఒక గోనె సంచిలో కుక్కి పడేశాడని పోలీసులు సోమవారం తెలిపారు. వినయ్‌సింగ్ (30) ఆగ్రాలోని తేధి బగియా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ (32) గత రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో నిందితుడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత ఆరు నెలలుగా మింకీ మరో వ్యక్తితో సంబంధంలో ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే వారి మధ్య తరచుగా గొడవలకు దారి తీసింది. పోలీసుల ప్రకారం, జనవరి 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మింకీ తన కార్యాలయానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయలు దేరింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. జనవరి 24 తెల్లవారుజామున, ఎత్మదుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ వంతెనపై ఒక గోనె సంచి పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సంచిని తెరిచి చూడగా, అందులో తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, గోనె సంచిని లాక్కెళ్లడం, ఆ తర్వాత స్కూటర్‌పై జవహర్ వంతెన వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. మారుతి ప్లాజా, ఎంజీ రోడ్, హైవేతో సహా పలు ప్రాంతాల నుండి సేకరించిన ఫుటేజ్ ఆధారంగా, బాధితురాలి స్కూటర్‌ను నడుపుతున్నట్లు కనిపించిన వినయ్ సింగ్‌ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించి విచారించారు. దీంతో సింగ్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?జనవరి 23న వినయ్, మింకీని కార్యాలయానికి పిలిచాడు. ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన అతను కత్తితో పదేపదే దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి, ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి, తలను ఒక బ్యాక్‌ప్యాక్‌లో పెట్టాడు. మింకీ స్కూటర్‌పైనే ఆమె మృతదేహాన్ని జవహర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి యమునా నదిలో పడేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బరువైన సంచిని ఎత్తలేక, అటుగా వెళ్తున్న వారిని గమనించి, అతను దానిని వంతెన సమీపంలో వదిలి పారిపోయాడు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. అందులో మొండెం, బాధితురాలి బట్టలు, మొబైల్ ఫోన్, బ్యాగ్‌ను ఒక మురుగు కాలువ సమీపంలో పారవేసి, స్కూటర్‌ను ఒక నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయాడని పోలీసులు తెలిపారు.నేరానికి ఉపయోగించిన స్కూటర్, కత్తి, బాధితురాలి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింగ్, శర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమె నిరాకరించచడంతోనే హత్య చేశాడని డీసీపీ అబ్బాస్ తెలిపారు. మృతురాలి తల, నేరానికి సంబంధించిన ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.ఇదీ చదవండి: యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్ -
కొలువు వేటకు వీడియో బాసట!
ఉద్యోగ ప్రయత్నం సఫలం కావాలంటే.. అర్హతలు, అనుభవం ఉండగానే సరిపోదు. వాటిని సరైన రీతిలో రిక్రూటర్ల దృష్టికి తీసుకెళ్లగలగాలి. కొలువుకు వందలు, వేలాది మంది అర్హులైన అభ్యర్థులు పోటీపడుతుంటారు. వారందరినీ దాటుకొని వెళ్లి ముం దంజలో నిలవాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇటీవలి కాలంలో దరఖాస్తుల విషయంలో రెజ్యూమెలాగే వీడియో కూడా తప్పనిసరిగా మారుతోంది. ఆందుకే అభ్యర్థులు దీనిగురించి తెలుసుకోవాలి. కొలువు వేట ప్రారంభించినవారితోపాటు ప్రారంభించనివారు కూడా ఈ వీడియో ఇంటర్వ్యూలు, రెజ్యూమెల గురించి తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. సమయం, డబ్బు ఆదా ఆధునిక కాలంలో హైరింగ్ మేనేజర్లు జాబ్ ఇంటర్వ్యూల కోసం వీడియోపైనే ఆధారపడుతున్నారు. దూర ప్రాంతాల్లోని అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. దీనివల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. తమ కంపెనీల్లో జాబ్ ఇంటర్వ్యూలను వీడియో ద్వారానే కొనసాగిస్తున్నట్లు 63 శాతం హెచ్ఆర్ మేనేజర్లు చెప్పారు. వీడియో పాపులారిటీ నానాటికీ పెరుగుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో రిక్రూటర్లు అభ్యర్థులను ఆన్లైన్లో ప్రశ్నిస్తారు. వీడియో ఇంటర్వ్యూయింగ్ టూల్స్ కూడా అమల్లో ఉన్నాయి. ఇందులో ముందే రికార్డు చేసిన ప్రశ్నలకు వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రిక్రూటర్లు కనిపించరు. అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఫార్మాట్ ఏదైనప్పటికీ వీడియో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే తగిన విధంగా ప్రిపేర్ కావాలి. సాంకేతికాంశాలు యూజర్ ఫ్రెండ్లీ వీడియో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్, వీడియో కెమెరాను ఆపరేట్ చేయగలిగితే చాలు.. వీడియో ఇంటర్వ్యూను ఎదుర్కోవచ్చు. సౌకర్యవంతమైన ఎక్విప్మెంట్ను ఎంచుకోవాలి. దాన్ని ముందే పరీక్షించి చూసుకోవాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే సరిచేసుకోవాలి. సాంకేతికాంశాలు మీ ఉద్యోగావకాశాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. చక్కటి వెలుతురు, నిశ్శబ్ద వాతావరణం ఉన్నచోటును ఇంటర్వ్యూ కోసం ఎంచుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో పుస్తకాలు, వస్తువులు లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే.. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు రిక్రూటర్ల దృష్టిని అవి పక్కదారి పట్టిస్తాయి. కొన్ని దుస్తులు, రంగులు వీడియోలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. మీరు తెల్ల దుస్తులు వేసుకొని, తెలుపురంగు గోడ ముందుకు కూర్చుంటే వీడియోలో అస్పష్టంగా కనిపిస్తారు. కాబట్టి సరిగ్గా కనిపించే రంగులను ఎంచుకోవాలి. అదేసమయంలో మీ వస్త్రధారణ పూర్తి ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంటర్వ్యూకు సంసిద్ధమయ్యే క్రమంలో స్నేహితులు, సహచరులతో కలిసి ముందే సాధన చేయడం మంచిది. దీంతో బెరుకు మాయమవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వీడియోలో మిమ్మల్ని మీరు చిత్రీకరించుకొని చూసుకోండి. మాటతీరు, హావభావాల్లో మార్పులుచేర్పులు చేసుకోండి. బయోడేటా వీడియో అనేది ఇంటర్వ్యూలకే పరిమితం కాదు బయోడేటాకు కూడా ఉపయోగిస్తున్నారు. ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోలో అభ్యర్థులు తమ గురించి తాము చెప్పుకోవాలి. పరిచయం, విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం వంటివాటిని క్లుప్తంగా వివరించాలి. దరఖాస్తుతోపాటు ఈ వీడియోను సంస్థకు పంపించాలి. అంతేకాకుండా యూట్యూబ్, లింక్డ్ఇన్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్టు చేయాలి. రిక్రూటర్లు వీటిని పరిశీలిస్తారు. తమకు కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. కమ్యూనికేషన్స్ హైరింగ్ మేనేజర్‌తో కమ్యూనికేషన్స్‌కు కూడా వీడియోను వినియోగించుకోవచ్చు. మౌఖిక పరీక్ష పూర్తయిన తర్వాత రిక్రూటర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియోను రూపొందించుకొని వారికి ఈ-మెయిల్ ద్వారా పంపించండి. దీనివల్ల వారికి మీపై సానుకూలమైన అభిప్రాయం కలుగుతుంది. వీడియో అనగానే అది ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకోవద్దు. నాణ్యమైన వీడియోతోనే ఆశించిన ఫలితం లభిస్తుంది.


