breaking news
house hold intensive survey
-
రాష్ట్రాన్ని నిర్బంధించి సర్వే చేశారు
-
రాష్ట్రాన్ని నిర్బంధించి సర్వే చేశారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సకల జనుల సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందర్నీ నిర్బంధించి సమగ్ర సర్వే చేశారని, సర్వే పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించి ఈ సర్వే చేశారని ఆయన అన్నారు. సర్వే రోజు బస్సులను బంద్ చేసి, బార్లను తెరిచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సర్వే కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సొంత గ్రామాలకు రప్పించారన్నారు. అయితే వలస వెళ్లిన చాలామంది సర్వేలో పాల్గొనలేకపోయారన్నారు. సమగ్ర సర్వే రోజు తాను ఇంట్లోనే ఉన్నానని, అయితే తమ ఇంటికి ఎవరూ రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు సర్వేనే ఆధారమన్న ప్రభుత్వం...ఆధార్ కార్డుల నమోదుకు ఎలా కార్యాలయాలు ఏర్పాటు చేశారో ... ఈ సమగ్ర సర్వే నమోదు కోసం కూడా మండల కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఫించన్ల కోసం మళ్లీ సర్వేలు చేయటం ఎంత వరకూ సబబు అని అన్నారు. సర్వే సందర్భంగా వితంతువులను మళ్లీ పెళ్లి చూసుకున్నారా అని అడగటం సమంజసమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమగ్ర సర్వేలో నిజామాబాద్ ఎంపీకి రెండుచోట్ల వివరాలు నమోదు చేశారని ఆయన ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. రెండుచోట్ల వివరాలు నమోదు చేసుకున్నవారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. -
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు
-
సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై హైకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు కోసం ఆ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా సమగ్ర సర్వేపై రామ్మోహన్ చౌదరి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వే వివరాల డేటా ఎంట్రీ పనులను ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించారని, దీనివల్ల వ్యక్తిగత సమాచారం బయట వ్యక్తులకు వెళుతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.