breaking news
Homeopathy course
-
తమిళనాడుకు హదియా
న్యూఢిల్లీ: ఇస్లాం మతం స్వీకరించి ముస్లిం యువకుడు షఫీన్ జహాన్‌ను పెళ్లాడిన కేరళ యువతి హదియాను సుప్రీంకోర్టు తమిళనాడులోని సేలం జిల్లాకు పంపింది. ఆమె తన హోమియోపతి చదువును పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ‘లవ్‌జిహాద్’ కేసుకు సంబంధించి సోమవారం హదియా కోర్టుకు హాజరైంది. తన భర్త షఫీన్ జహాన్‌తోనే ఉంటానని కోర్టుకు హదియా స్పష్టం చేసింది. హదియా, జహాన్‌ల పెళ్లిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించిన కేరళ హైకోర్టు.. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులను సవాలు చేస్తూ జహాన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. హదియా చదువుతున్న కాలేజీ డీన్‌ను ఆమెకు సంరక్షకుడిగా నియమించిన అత్యున్నత ధర్మాసనం.. ఏదైనా సమస్య ఎదురైతే తమను సంప్రదించే స్వేచ్ఛను డీన్‌కు ఇచ్చింది. హదియాకు మళ్లీ అడ్మిషన్ ఇవ్వాలని, హాస్టల్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత కాలేజీ, వర్సిటీని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. భార్య చరాస్తి కాదు.. హదియా చదువు, అలవాట్లు, ఆమె జీవితాశయం గురించి ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సేలంలో తన సంరక్షకుడిగా ఉండేందుకు ఎవరైనా బంధువులు లేదా పరిచయస్తుల పేర్లు తెలపాల్సిందిగా ధర్మాసనం కోరగా.. తన భర్త షఫీన్ సంరక్షకుడిగా ఉంటారని ఆమె జవాబిచ్చింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఓ భర్త తన భార్యకు సంరక్షకుడిగా ఉండలేడు. భార్య చరాస్తి కాదు. ఆమెకు వ్యక్తిగత గుర్తింపు, జీవితం ఉంటాయి. నేను కూడా నా భార్యకు సంరక్షకుడిని కాదు’ అని వ్యాఖ్యానించారు. -
ఆయుష్ సీటు రూ.50 లక్షలు
సీ కేటగిరీ సీటు వార్షిక ఫీజు రూ.10 లక్షలు - బీ కేటగిరీ రూ. 5 లక్షలు.. ఏ కేటగిరీ రూ. 40 వేలు - నీట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ - మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం - గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన ఫీజులు సాక్షి, హైదరాబాద్: ఆయుష్ డిగ్రీ సీట్ల ప్రవేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఫీజులను భారీగా పెంచింది. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి–యోగిక్ సీట్ల భర్తీకి అనుసరించే మార్గదర్శకాలను ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోమియోపతి కోర్సుల సీ కేటగిరీ వార్షిక ఫీజును రూ.10 లక్షలుగా (ఐదేళ్లకు రూ.50 లక్షలు) ఖరారు చేసింది. ఇదే కోర్సు బీ కేటగిరీ సీటుకు రూ.5 లక్షలు, ఏ కేటగిరీ సీటుకు ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఫీజులు భా రీగా పెరిగాయి. గతేడాది ఇవే కోర్సుల వార్షిక ఫీజులు సీ కేటగిరీకి రూ.1.25 లక్షలు, బీ కేటగిరీకి రూ. 50 వేలు, ఏ కేటగిరీకి రూ.21 వేలుగా ఉన్నాయి. ప్ర భుత్వ కాలేజీల్లోని ఏ కేటగిరీ సీట్లకు ఫీజు తక్కువగానే ఉంటుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఈ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. ఈ నోటిఫికేషన్లో ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 9 కాలేజీలు.. 655 సీట్లు రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి–యోగిక్ కోర్సులను నిర్వహించే కాలేజీలు తొమ్మిది ఉన్నాయి. మొత్తం 655 సీట్లు ఉండగా.. అందులో మూడు ప్రైవేటు కాలేజీల్లో 250 సీట్లు ఉన్నాయి. నేచురోపతి–యోగిక్ కోర్సును అందించే కాలేజీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి ఒకటే ఉంది. ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఏ కేటగిరీ కింద ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లతోపాటు ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని 50 సీట్లు ఉంటాయి. ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని మరో 35 శాతం సీట్లు బీ కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఉంటాయి. ఆయుష్ విభాగంలోని అన్ని సీట్లను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు.