breaking news
Homeloan
-
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: సుమారు నాలుగుకోట్లమంది పీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఇకనుంచి ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతా నుంచే నెలవారీ ఈఎంఐ చెల్లించుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) అందుబాటులోకి తెస్తోంది. అంతేకాదు ఈ ఖాతా నుంచే ప్రాథమిక చెల్లింపు(డౌన్ పేమెంట్)కోసం 90శాతం పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మేరకు ఇపిఎఫ్ఓ 1952 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఇపిఎఫ్) పథకాన్ని సవరించింది. సవరణ ద్వారా కొత్త పేరా - 68 బిడి చేర్చి ఈ పథకాన్ని అందుబాటులోకి తేనుంది. క్రొత్త నిబంధన ప్రకారం, ఒక ఈపీఎఫ్ చందాదారుడు సహకార లేదా హౌసింగ్ సొసైటీలో సభ్యులు కనీసం 10 మంది తమ ఖాతా నిధుల నుంచి 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. నివాస గృహం లేదా ఫ్లాట్ లేదా నివాస గృహ నిర్మాణం కోసం ఈ విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతోపాటుగా ప్రభుత్వం, హౌసింగ్ ఏజెన్సీ, ప్రాధమిక రుణసంస్థలు, బ్యాంకులకి సంబంధించిన రుణాలు, రుణాలపై ఇతర పెండింగ్ వడ్డీలను నెలవారీ వాయిదాలుగా చెల్లించేందుకు అనుమతినిస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనలకు లోబడి ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ సదుపాయాలను పొందాలంటే పీఎఫ్ ఖాతాలో కనీసం మూడేళ్లు కొనసాగాలి. అలాగే ఈ సదుపాయం అతనికి లేదా ఆమెకి జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం. జీవిత భాగస్వాములతో కలిసి ఉన్న వారి పీఎఫ్ ఖాతాలలో రూ. 20వేల కనీస నిల్వ ఉండాలి. -
10.4 శాతం వడ్డీకే 20 ఏళ్ల గృహ రుణం
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్తగా 10.40 శాతం స్థిర వడ్డీ రేటుతో 20 ఏళ్ల గృహ రుణ పథకాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. రూ. 50 లక్షల దాకా రుణాలకు ఇది వర్తిస్తుంది. అందుబాటు ధర గృహాల కొనుగోలుకు ఉపకరించేలా ఈ పరిమిత కాలం ఆఫర్ను అందిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ (రిటైల్ రుణాల విభాగం) జైరామ్ శ్రీధరన్ చెప్పారు. బేస్ రేటు కన్నా ఈ వడ్డీ రేటు పావు శాతం అధికంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం బేస్ రేటు 10.15 శాతంగా ఉంది. బ్యాంకు ఖాతాదారులు కావాలనుకుంటే స్థిర వడ్డీ రేటు పథకం నుంచి చలన వడ్డీ రేటు పథకానికి మారొచ్చని శ్రీధరన్ పేర్కొన్నారు. ఇందుకోసం కొంత మొత్తం రుసుములైనా కట్టాలని, లేదా బాకీ ఉన్న అసలు మొత్తంపై 2% ఫోర్క్లోజర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.