breaking news
Holi colors
-
ఇక్కడ పురుషులు హోలీ ఆడరు...
హోలీ.. రంగుల పండుగ. దేశమంతా ఉత్సాహంగా జరుపుకొనే ఈ వేడుకకు మార్కెట్లు రంగులతో కళకళలాడతాయి. వీధులన్నీ రంగులద్దుకుంటాయి. హోలీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంప్రదాయం ఉండగా.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో పురుషులు మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంటారు. స్త్రీలు స్వేచ్ఛగా హోలీ ఆడుకుంటారు. ఈ ఆసక్తికర ఆచారం 500 ఏళ్లుగా కొనసాగుతోంది. ధిక్కరిస్తే బహిష్కరణే... ఈ సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. 500 ఏళ్లుగా గ్రామస్తులు ఆచారాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. మహిళలు బయట తిరగకుండా ఉంచిన పర్దా వ్యవస్థ నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు చెబతారు. పురుషులు ఉండరు కాబట్టి మహిళలు స్వేచ్ఛగా వేడుకలు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ధిక్కరించి పురుషులు గ్రామంలో ఉండిపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. వారిని వెంటనే గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇక పురుషులకు హోలీ పండుగే ఉండదా అంటే.. ఉంటుంది. కాకపోతే తరువాతి రోజు పురుషులు, స్త్రీలు కలిసి ఈ వేడుకలు జరుపుకొంటారు. కేవలం రంగులు జల్లుకోవడం కాదు.. పురుషులను స్త్రీలు కొరడాలతో కొట్టడంతో పుండుగ ముగుస్తుంది. పురుషులు ఆలయానికి.. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నాగర్ గ్రామంలో ఈ అసాధారణ సంప్రదాయం ఉంది. హోలీ రోజున ఉదయం 10 గంటలు కాగానే.. నాగర్‌కు చెందిన ఐదేళ్లు దాటిన పురుషులంతా గ్రామాన్ని వదిలి శివార్లలో ఉన్న చాముండేశ్వరీ దేవీ ఆలయానికి వెళ్తారు. అక్కడ జాతర చేసుకుంటారు. భక్తిగీతాలు వింటూ రోజంతా భక్తిశ్రద్ధలతో గడుపుతారు. పురుషుల వేషధారణలో స్త్రీలు.. ఇంకేముంది ఊరంతా మహిళలదే. రోజంతా పండుగే. గ్రామాన్నంతా అలంకరించి రంగులు జల్లుకుంటూ శోభాయమానంగా మారుస్తారు. వయసుతో తేడా లేకుండా మహిళలంతా ఆనందోత్సహాల్లో మునిగిపోతారు. ప్రత్యేక ఆచారం కావడంతో అంతగా ఇష్టపడనివారు సైతం కచి్చతంగా హోలీ ఆడతారు. కొందరు స్త్రీలు పురుషుల వేషధారణతో వేడుకల్లో పాల్గొంటారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపు. చల్లే కళ్లాపి ఆకుపచ్చ. గడపకు రాయాల్సింది పసుపు. నాన్నకు పెట్టాలి గోధుమ రంగు టీ. బాబు షూస్ పాలిష్ చేయాలి కదా నల్లగా. పాపాయికి కట్టాలి ఎర్ర రిబ్బన్. బట్టల సబ్బు రంగు నీలం. వంట గది నిండా మెటాలిక్ కలర్ పాత్రలే. కాటుక, తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే. లోకానికి ఒకటే హోలి. అమ్మకు నిత్యం హోలి. నేడు అమ్మకే చెప్పాలి రంగు రంగుల కృతజ్ఞత.ప్రతి ఒక్కరి జీవితంలో రంగు రంగుల కలలు ఉంటాయి. అయితే స్త్రీలు ఆ రంగుల కలలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒకదశలో రాజీ పడాలి. అయితే భారతీయ స్త్రీ ఆ రాజీని ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికి ఇచ్చేస్తుంది. భర్త, పిల్లల సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కేరింగ్ కోసం రోజూ అంతులేని శ్రమ చేస్తుంది. ఆ పనుల్లోనే ఆమెకు రంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంటుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించండి.అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి. ముగ్గు వేయాలి. పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లటి పౌడర్ రాయాలి. వెన్న కంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రే పిండి గ్రైండర్లో వేసుకోవాలి. తెల్ల యూనిఫామ్ ఉతికి సిద్ధం చేయాలి. తెల్లటి ఉప్పు, పంచదార తాకకుండా ఆమెకు జీవితం గడవదు. మునివేళ్ళకు ఆ తెల్లరంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఎండలో వడియాలూ? టెంకాయ తెచ్చి పగులగొట్టి కొబ్బరి తీయడం ఆమెకు గాక ఇంటిలో ఎవరికీ రాదు. రాత్రిళ్లు అత్తామామలకు పుల్కాల కోసం ఆశీర్వాద్ ఆటాతో చేతులు తెల్లగా చేసుకోవాలి. ఆమే అన్నపూర్ణ. తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యం. ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంటుంది. కూరగాయలన్నీ ఆ రంగువే. ఇంట్లో మొక్కలకు ఆమే నీరు పోయాలి. ఆకుపచ్చ డిష్ వాషర్‌ను అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకోవాలి. హెల్త్ కాన్షియస్నెస్ ఉన్న భర్త రోజూ ఆకుకూరలు ఉండాల్సిందే అంటాడుగాని పొన్నగంటి కూరో, కొయ్య తోటకూరో ఆకులు తుంచి కవర్లో వేయమంటే వేయడు. చేస్తే తప్ప ఆ పని ఎంత పనో తెలియదు.ఎరుపు రంగు అమ్మ పనిలో భాగం. ఇంటికి ఆమె ఎర్రటి జాజుపూతను అలుకుతూ ఉంటే వాకిలి నిండా మోదుగుపూలు రాలినట్లు అనిపిస్తుంది. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలికొసతో అందుకొని, నుదుటి మీద దిద్దుకొని, దీపం వెలిగించాకే దేవుడు ఆవులిస్తూ నిద్రలేచేది. అమ్మ మునివేళ్ల మహిమకు సూర్యుడు కూడా ఆమె పాపిట్లో సిందూరమై ఒదిగిపోతాడు. ఎర్రటి ఆవకాయలు, పచ్చళ్లు చేతులను మంట పుట్టించినా అమ్మ చిర్నవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టొమాటోలు ఎన్ని వేలో కదా.అయితే అమ్మకు తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. గోరింట పండితే వచ్చే ఎరుపు ఇష్టం.. మల్లెల తెలుపు ఇష్టం... తన ఒంటిపై మెరిసే నగల బంగారు వర్ణం ఇష్టం, మట్టి గాజుల రంగులు ఇష్టం, పట్టీల వెండి వర్ణం ఇష్టం, గోర్ల రంగులు ఇష్టం, కురుల నల్ల రంగు ఇష్టం, తాంబూలపు ఎరుపు ఇష్టం, కొద్దిగా మొహమాట పడినా లిప్‌స్టిక్ రంగులూ ఇష్టమే. పసుపు ఇంటికీ, అమ్మకూ శుభకరం. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా తీసుకుని అమ్మ పరిగెడుతుంది. తీరిక ఉన్నప్పుడు గడపలకు రాస్తుంది. తను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలలో కలిపి ఇస్తుంది. ఇక బ్లూ కలర్ అమ్మకే అంకితం. గ్యాస్ స్టవ్ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇక జీవితాంతం బట్టల సబ్బు, సర్ఫ్‌ను వాడుతూ బట్టలు శుభ్రం చేయడమో చేయించడమో చేస్తూనే ఉండాలి. కనీసం హార్పిక్ వేసి టాయిలెట్లు కడగరు ఇంటి సభ్యులు. అదీ అమ్మ చాకిరే. నీలి మందు వేసి తెల్లవి తళతళలాడించడం, ఇస్త్రీ చేయించడం ఆమెకు తప్పదు. బట్టల హోమ్‌వర్క్‌లు చేయిస్తే బాల్‌పాయింట్ పెన్నుల నీలి గుర్తులు ఆమె చేతుల మీద కనిపిస్తాయి. ఇక నలుపు ఆమెకు ఏం తక్కువ. బూజు నుంచి అంట్ల మసి వరకు ఆమెకు ఎదురుపడుతూనే ఉంటుంది.ఇవాళ హోలి. కనీసం ఇవాళ అయినా అమ్మకు విశ్రాంతినిచ్చి ఆమెకు ఇష్టమైన రంగుల్లో ఇష్టమైన బహుమతులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి. -
మాదాపూర్ వేదికగా హోలినేషన్ 2025 వేడుకలో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Hyderabad Holi Photos 2024: హైదరాబాద్‌లో హోలీ వేడుకలు..(ఫొటోలు)
-
ఈ హోలీ రంగులను హాయిగా తినవచ్చు!
ముంబైకి చెందిన ఇద్దరు సోదరుల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గౌరంగ్, సౌరభ్ అనే సోదరులు ‘మాంక్స్ బూఫీ’ బ్రాండ్‌పై ‘అబీర్ హోలి కలర్స్’ పేరుతో సహజ రంగులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. పువ్వులు, మొక్కజొన్న పిండి... మొదలైన వాటితో భిల్ తెగ గిరిజనులు తయారు చేసిన ఈ రంగులను తినవచ్చు కూడా! -
Holy 2023: రంగులు త్వరగా పోవాలంటే..
హోలీ ఆడడం ఒక ఎత్తు అయితే.. ఆ మరకలను వదిలించుకునేందుకు పడే శ్రమ మరో ఎత్తు. పైగా హోలీ ఆడేప్పుడు రంగులే కాదు.. అడ్డమైనవన్నీ పూసేసుకుంటారు కొందరు. మరకలు త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. అయితే.. హోలీ ఆడిన తర్వాత త్వరగా రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్‌కి బాదం నూనె కలిపి పేస్ట్‌లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ► ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్‌ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా.. హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్‌గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్‌లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్‌లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
Holi 2023: రంగు వెనక రహస్యం
హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. హోలీలో వాడే ప్రధాన రంగుల గురించి పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉంది. ఎరుపు: ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి ‘హోలీ’ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గులాబీ: ప్రేమను తెలియజేసే రంగు ఇది. లేత గులాబి రంగుతో ఆనందం వెల్లివిరిస్తుంది. మనిషికి మధురమైన భావనలను కలిగిస్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు. పసుపు: ఆధ్యాత్మిక ధోరణిలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. కాషాయం: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. నీలం: దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని పెద్దలు చెప్తారు. ఆకుపచ్చ: ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక. అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఊదా: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం. నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. నలుపు: రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగు మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు. -
Holi 2022 Special : రాగాల హొలీ
-
Holi 2022: పూల రంగులతో హోలీ సంబురం
Make Organic Holi Colours with Flowers: హోలీ 2022 సంబురం వచ్చేసింది. ఈ రంగులకేళిలో రసాయన రంగుల్ని వాడటం ‘ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు... కాదంటూ’ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే కృత్రిమ రంగులతో పోలిస్తే ఆర్గానిక్ కలర్ పౌడర్లకే మార్కెట్లో రేటు ఎక్కువ. పైగా అవి నిజంగానే ఆర్గానిక్‌వేనా అనేది మనకు తెలీదు. కాబట్టి కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఎవరికి వాళ్లు సహజరంగుల్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగూ.. ఎర్రటి ఎండలు దండి కొడుతున్నాయ్ కదా! రెడ్/ఎరుపు మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ఆ పువ్వులను మెత్తని పొడిగా నూరుకోవాలి. అంతే.. ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఈ మిశ్రమానికి కొంచెం బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది. మందారతో పాటు ఎర్ర చందనం పౌడర్‌తో కూడా రెడ్ కలర్‌ను తయారుచేసుకోవచ్చు. పైగా ఎర్ర చందనం శరీరానికి మంచి రంగును ఇస్తుంది. దీనిని తడి, పొడి రంగుగా వాడుకోవచ్చు. లీటర్ నీటిలో రెండు చెంచాల ఎర్ర చందనం పౌడర్ని కలపి దగ్గరికి అయ్యేదాకా మరగనివ్వాలి. చల్లారక కొన్ని నీళ్లు కలిపితే తడి రంగు తయారవుతుంది. ఆరెంజ్/కాషాయం మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెట్టినా సరిపోతుంది. పసుపు–కాషాయం రంగుల మిశ్రమంతో రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. మైదాకు(గోరింటాకు)ను నీటిలో కలిపి ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికల్లా కాషాయం రంగు తయారవుతుంది. కాకపోతే కొంచెం ఇది కాస్ట్లీ వ్యవహారం. యెల్లో/పసుపు ఈ రంగును తయారు చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. పొద్దుతిరుగుడు పువ్వులు(యాభై గ్రాములు), నారింజ తొక్కల పొఇ(ఇరవై గ్రాములు), చేమ గడ్డ పొడి(రెండొందల గ్రాములు), పసుపు(వంద గ్రాములు), నిమ్మ రసం(ఇరవై చుక్కలు).. ఈ మొత్తాన్ని ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే మెత్తని పసుపు రంగు తయారవుతుంది. బ్లూ/నీలం సూర్య కాంతిలో ఇసుక నేలల్లో ఎక్కువగా పెరిగే చెట్లు జకరండ(నీలి గుల్మహార్). వీటి పువ్వులు నీలి, ఊదా రంగుల్లో ఉంటాయి. వీటిని ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. కేరళ ప్రాంతంలో అయితే నీలి మందారం మొక్కల నుంచి సహజసిద్ధమైన రంగుల్ని తయారుచేస్తారు. తడి రంగు కోసం నీలిమందు చెట్ల కాయల్ని(బెర్రీలు) పొడి చేసి నీళ్లలో కలపాలి. కొన్ని జాతుల నీలిమందు చెట్ల ఆకులు కూడా నీలం రంగుల్లోనే ఉంటాయి. వాటిని కూడా నీటితో కలిపి బ్లూ రంగు తయారుచేసుకోవచ్చు. గ్రీన్/ఆకుపచ్చ గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్యప్పిండి కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా చేయాలి. పై పై నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా వాడుకోవచ్చు. పింక్/గులాబీ పసుపు రంగు మందార పువ్వులు, బీట్రూట్ ద్వారా ఆర్గానికి పింక్ రంగును తయారు చేయొచ్చు. బీట్రూట్ను పేస్ట్‌గా నూరి.. ఆ మిశ్రమాన్ని ఎండలో నానబెట్టాలి. ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే ఆ పొడికి కొంచెం శెనగ లేదా గోధుమ పిండిని కలపాలి. తడి రంగు కోసం బీట్రూట్ ముక్కలను నీటిలో మరగబెట్టి.. చల్లార్చాలి. బ్రౌన్/గోధుమ గోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పాళ్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్యప్పిండిని కలిపితే చాలు. ఆయుర్వేదంలో హోలీ హోలీ వెనుక పురాణకథనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలోనూ ఈ పండుగ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. చలి కాలం వెళ్లిపోయి.. వేసవి వచ్చేప్పుడు గాలిమార్పు కారణంగా జ్వరాలు, జలుబూ వచ్చే అవకాశం ఎక్కువ. అవేమీ రాకుండా ఉండేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడిలను నీళ్లలో కలిపి చల్లుకునేందుకే ఈ వేడుక పుట్టిందని చెప్తారు. ముఖ్యంగా మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరిస్తే, హోలీ పండుగ పూట చలువచేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరిచేరవని అంటారు. :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
Holi 2021: ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్..
రంగుల పండుగ హోలీలో కలర్స్ చల్లుకోవడమే పెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ కానిది ఏది లేదు. ఆకర్షణీయమైన రంగులు కూడా కల్తీ అవుతున్నాయి. రకరకాల హానికారక రసాయనాలతో తయారుచేసిన హోలీ రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిలో కార్సినోజెన్స్ ఉంటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో.. వివిధ రకాల మూలికలతో తయారు చేసిన రంగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే గుల్లాస్‌కు (ఆకర్షణీయమైన రంగు) దేశంలోనే గాక విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. యూపీలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మోదుగ పూలతో తయారు చేసే గుల్లాస్ రంగులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పల్లాష్ పువ్వు (బుటియా మోనోస్పెర్మ–శాస్త్రీయ నామం) గా పిలిచే మోదుగ పూలను హోలీ రంగుల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. యూపీలోని వివిధ జిల్లాల్లోని మహిళలు మోదుగ పూల నుంచి రంగులు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ప్రోత్సాహంతో నడిచే ఈ గ్రూపులు గుల్లాస్‌ను తయారు చేస్తున్నాయి. సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, వారణాసి, చిత్రకూట్ జిల్లాల్లో మోదుగ పూలను సేకరించి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులను తయారు చేస్తున్నారు. ఈ రంగులకు యూపీలోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.సోన్‌భద్ర భీమా ప్రేరణ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుకు చెందిన సభ్యురాలు కాంచన్ మాట్లాడుతూ..‘‘ మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాము. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాము. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాము. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్ తయారవుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ హెర్బల్ గులాల్ తయారు చేయడానికి మాకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్.. ఈ పొడిని మార్కెట్లో రూ.150 నుంచి 200 వరకు విక్రయించడం ద్వారా మంచి లాభం వస్తుంది. మా గ్రూపులో నాతోపాటు మరో 11మంది మహిళలు పనిచేస్తున్నారు. మేమంతా కలిసి మూడు క్వింటాళ్ల రంగును తయారు చేసి సోన్‌భద్రా జిల్లాలో విక్రయిస్తాం’’అని కాంచన్ తెలిపారు.యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ డైరెక్టర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మేము వంద శాతం రసాయనాలు కలపని రంగులు తయారు చేస్తున్నాం. ఇందుకోసం మోదుగపూలు బాగా ఉపయోగపడుతున్నాయి. సోన్‌భద్రా, మీర్జాపూర్ జిల్లాలోని సెల్ప్‌హెల్ప్ గ్రూపు మహిళలు ఎంతో నిబద్దతతో ఈ రంగులను తయారు చేస్తున్నారు. 32 జిల్లాలోని 4,058 మహిళలు మూలికలతో ఐదు వేల కిలోల రంగును తయారు చేస్తున్నారు. ఈ రంగును రూ.7లక్షలకు విక్రయించారు. రంగులతోపాటు చిప్స్, అప్పడాలు, కజ్జికాయలు వంటి వాటిని కూడా తయారు చేస్తున్నారు’’ అని తెలిపారు. సోన్‌భద్రా రంగులు కావాలని లండన్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ఉత్పత్తులను కోట్ల రూపాయల టర్నోవర్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. కాగా మోదుగ పూలతో తయారు చేసిన రంగులకు మంచి డిమాండ్ వస్తుండడంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ పూల మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మోదుగ పూలు మన చర్మానికి ఎటువంటి హానీ చేయవు. ఫంగల్ ఇన్పెక్షన్స్ నుంచి రక్షించడంతోపాటు కాలుష్యాన్నీ కూడా తగ్గిస్తాయి. అంతేగాక ఉదర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మోదుగ పూలతో రంగులు తయారు చేసి హెర్బల్ హోలీ ఆడండి. -
Holi 2021: కలర్‌ఫుల్ కలర్స్
ఒక్కరు ఆడరు. మనుషులు గుంపులు. రంగులు బోలెడు. మీసం రంగు మారుతుంది. గాజులు వేరే రంగుకొస్తాయి. ఆట ఒక రంగు. పాట ఒక రంగు. వయసులో ఉన్న కుర్రదీ కుర్రాడూ ఒక రంగు. హోలీ వెలిసిన క్షణాలను దూరంగా విసిరేస్తుంది. ఉత్సాహ కణాలను దేహంలో నింపుతుంది. ఈ పండుగను పెద్ద తెర పండుగ చేసుకుంది. హిందీ సినిమాల్లో హోలీది మహాకేళీ. అందరికీ రంగుల చెమేలీ పూలు. హోలీలో ఎన్ని రంగులు ఉంటాయి? అన్నీ. హిందీ సినిమాల్లో హోలీని అడ్డు పెట్టుకుని ఎన్ని సీన్లు ఉంటాయి? అన్నే. వెండితెర అంటేనే కలర్ఫుల్గా ఉంటుందని కదా... మరి ఆ కలర్‌ఫుల్ తెరకే రంగులు అద్దితే ఎలా ఉంటుంది? చూద్దాం.. ‘మదర్ ఇండియా’ను మొదట చెప్పుకోవాలి. కలర్లో పాత్రలు హోలీ ఆడింది ఆ సినిమాలోనే. ఆడించినవాడు దర్శకుడు మెహబూబ్ ఖాన్. ‘హోలీ ఆయిరే కన్హాయి హోలీ ఆయిరే’ పాట అందులోదే. వితుంతువైన తల్లి నర్గిస్ తన ఇద్దరు కొడుకులు సునీల్ దత్, రాజేంద్ర కుమార్ గ్రామస్తులతో కలిసి పాడుతూ ఉంటే పులకించి భర్త రాజ్‌కుమార్‌తో తాను హోలి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటుంది. కొడుకుల జీవితం, భవిష్యత్తు రంగులమయం కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాని వారిలో ఒక కొడుకు చెడ్డ రంగును, ద్రోహపు రంగును, ఊరికి చేయదగ్గ అపకారపు రంగును పులుముకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగును కడిగి మురిక్కాలువలో పారేస్తుంది. ‘మదర్ ఇండియా’లో నర్గిస్ అదే చేస్తుంది. బందిపోటుగా మారిన కొడుకు సునీల్‌దత్‌ను ఊరి అమ్మాయిని ఎత్తుకుని పోతూ ఉంటే కాల్చి పడేస్తుంది. దేశం గురించి సంఘం గురించి ఆలోచించేవారు ఆ పనే చేస్తారు. సొంత కొడుక్కి తల్లి కావడం ఎవరైనా చేస్తారు. దేశానికి తల్లి కాగలగాలి. మదర్ ఇండియా చెప్పేది అదే. ‘కటీ పతంగ్’ రాజేష్ ఖన్నా 1969–71ల మధ్య ఇచ్చిన వరుస 17 హిట్స్‌లో ఒకటి. ఆ కథ ఒక ‘వితంతువు’ ఆశా పరేఖ్‌కు కొత్త జీవితం ప్రసాదించడం గురించి. నిజానికి ఆశాపరేఖ్ వితంతువు కాదు. మరణించిన స్నేహితురాలి కోసం వితంతువుగా మారింది. ఆమెను రాజేష్ ఖన్నా ప్రేమిస్తాడు. వైధవ్యం పాపం, శాపం కాదని అంటాడు. హోలి వస్తుంది. ‘ఆజ్ న ఛోడేంగే బస్ హమ్ జోలి’అని రాజేష్ ఖన్నా పాట అందుకుంటాడు. కాని తెల్లబట్టల్లో ఉన్న ఆశా పరేఖ్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు హోలి ఆడకూడదు. వారికి ఇక శాశ్వతంగా మిగిలేది తెల్లరంగే. కాని రాజేష్ ఖన్నా ఇందుకు అంగీకరించడు. పాట చివరలో రంగుల్లోకి లాక్కువస్తాడు. క్లయిమాక్స్‌లో ఆమెకు రంగుల జీవితం ఇస్తాడు. భర్త చనిపోవడంతో జీవితపు రంగులు ఆగిపోవడం ఒక వాస్తవం కావచ్చు. కాని జీవితం ముందు ఉంది. కొత్త రంగును తొడుక్కుంటే అది తప్పక మన్నిస్తుంది. ‘షోలే’లో గబ్బర్ సింగ్ మనుషుల్ని ఠాకూర్ సంజీవ్ కుమార్ ఆదేశం మేరకు అమితాబ్, ధర్మేంద్రలు తన్ని తగలేస్తారు. మరి గబ్బర్ సింగ్ ఊరుకుంటాడా? రామ్‌గఢ్‌పై దాడి చేయాలనుకుంటాడు. ‘కబ్ హై హోలి.. హోలి కబ్ హై’ అని అడుగుతాడు. ఈ సంగతి తెలియని రామ్‌గఢ్ వాసులు హోలీ వేడుకల్లో మునిగి ‘హోలికె దిన్ రంగ్ మిల్ జాయేంగే’ అని పాడుకుంటూ ఉంటారు. హటాత్తుగా గబ్బర్ ఊడిపడతాడు. ఊరంతా అల్లకల్లోలం. అగ్నిగుండం. అమితాబ్ దొరికిపోతాడు. ధర్మేంద్ర కూడా దొరక్క తప్పదు. ‘నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే వదిలేస్తాను’ అంటాడు గబ్బర్ వాళ్లతో. అమితాబ్ బయలుదేరుతాడు. ఏం జరుగుతుందా అని అందరిలోనూ ఉత్కంఠ. గబ్బర్ కాళ్ల దగ్గరకు నమస్కారం పెట్టడానికన్నట్టు వొంగిన అమితాబ్ అక్కడ కింద ఉన్న రంగులు తీసి తటాలున గబ్బర్ కళ్లల్లో కొడతాడు. చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఈ సీన్ హోలి సీన్లన్నింటిలో తలమానికం. గబ్బర్ భరతం పట్టిన సీన్ అది. ‘సిల్సిలా’లో అమితాబ్ రేఖా ప్రేమించుకుంటారు. కాని అమితాబ్ జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖ సంజీవ్ కుమార్‌ను. రెండు జంటలూ తమ జీవితాలు గడుపుతూ ఉండగా అమితాబ్, రేఖ తిరిగి తారసపడతారు. తమలో ఇంకా ప్రేమ ఉందనుకుంటారు. తమ పెళ్లిళ్లు అర్థం లేనివని భావిస్తారు. తమ తమ భాగస్వాముల మధ్య ఆ సంగతి సూచనగా చెప్పడానికి హోలిని ఎంచుకుంటారు. ‘రంగ్ బర్సే’ పాటను అమితాబ్ పాడుతూ పరాయివ్యక్తి భార్య అని కూడా తలవకుండా రేఖ వొడిలో తల పెట్టుకుని కేరింతలు కొడతాడు. కాని పెళ్లయ్యాక ఈ దేశంలో గతన్నంతా బావిలో పారేయాల్సి ఉంటుంది. పెళ్లికే విలువ. దాని పట్లే స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. చివరిలో ఆ సంగతి అర్థమయ్యి అమితాబ్, రేఖ తమ తమ పెళ్లిళ్లకు నిబద్ధులవుతారు. కాని ఈలోపు వారి వివాహేతర ప్రేమను చూపే పద్ధతిలో ట్రీట్మెంట్ దెబ్బ తిని సినిమా కుదేలైంది. ఇదో చేదురంగు. ‘దామిని’లో హోలీ క్రూర రంగులను చూపిస్తుంది. అందులో మీనాక్షి శేషాద్రి పెద్దింటి కోడలు. కాని మరిది ఆ ఇంట్లో హోలీ రోజున ఆ గోలలో పని మనిషిపై అత్యాచారం చేస్తాడు. మీనాక్షి శేషాద్రి ఆ దుర్మార్గాన్ని చూస్తుంది. దారుణంగా బాధను అనుభవించిన పని మనిషికి న్యాయం చేయడానికి మీనాక్షి శేషాద్రి తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని నిలబడుతుంది. ఆమె మీద ఎన్నో దాడులు. కాని దాడులు నిండినదే లోకం అయితే లోకం ఉంటుందా? ఎవరో ఒకరు తోడు నిలుస్తారు. మీనాక్షి శేషాద్రికి తోడుగా సన్ని డియోల్ నిలుస్తాడు. పోరాడతాడు. న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం గెలిచినప్పుడు ఆ రంగులకు వచ్చే తేజం గొప్పది. ‘డర్’ సినిమా దౌర్జన్యప్రేమను చూపిస్తుంది. అసలు ‘నో’ అనే హక్కు, స్వేచ్ఛ స్త్రీలకు ఉందని కూడా కొందరు మూర్ఖప్రేమికులకు తెలియదు. ఉన్మత్తంగా ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ గొప్పది అయిపోదు. ‘డర్’లో జూహీ చావ్లాను ప్రేమించిన షారూక్ ఖాన్ ఆమె వివాహం అయ్యాక కూడా వెంటపడతాడు. ఆమె ఇంట్లో హోలీ చేసుకుంటూ ఉంటే ముఖాన రంగులు పూసుకుని ప్రత్యక్షమవుతాడు. భయభ్రాంతం చేస్తాడు. ఎంత హింస అది. రంగు ముఖానికి పూసుకుంటే బాగుంటుంది. కళ్లల్లో పడితే బాగుంటుందా? కళ్లల్లో పడే రంగును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చివరకు ఆ రంగు సముద్రంలో కలిసిపోతుంది. రంగులు అన్నీ మంచివే. కాని కొన్ని రంగులు కొందరికి నచ్చవు. అలాగే కొన్ని జీవన సందర్భాలు కూడా నచ్చవు. కాని నచ్చని రంగులు ఉన్నప్పుడే నచ్చే రంగులకు విలువ. నచ్చని జీవన సందర్భాలు ఉన్నప్పుడే నచ్చే జీవన సందర్భాలకు విలువ. పాడు రంగులనూ పాత గాయాలనూ వదిలి కొత్త రంగుల్లోకి కొత్త ఉత్సాహాల్లోకి ఈ హోలి అందరినీ తీసుకెళ్లాలని కోరుకుందాం. హ్యాపీ హోలీ. – సాక్షి ఫ్యామిలీ -
రికార్డుల హోలీ..
హోలీ రంగులు, పువ్వులతో రూపొందించిన ఈ కార్పెట్ ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. దీన్ని గురువారం గ్వాటెమలా దేశ రాజధాని గ్వాటెమలా సిటీలో 5 వేల మంది స్థానిక మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు కలిసి రూపొందించారు. మొత్తం 6,601 అడుగుల పొడవున్న ఈ రంగుల కార్పెట్‌ను పరిశీలించిన గిన్నిస్ అధికారులు దీన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించారు. గత రికార్డు 4,593 అడుగులట. దీన్ని రూపొందించడానికి దాదాపు 54 వేల కిలోల రంగులను వాడారు.