breaking news
higher salary
-
ఇంజినీరింగ్ కంటే ఎంబీఏనే మిన్న!
సాక్షి, అమరావతి: సాధారణంగా ఇంజినీరింగ్ చదివిన వారికి అత్యధిక వేతనాలు ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఎంబీఏ చదివిన వారికీ అత్యధిక వేతనాలు అందుతున్నాయి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(ఎంబీఏ) కోర్సు మణిహారంలా మారింది. దీనిని పూర్తిచేసిన విద్యార్థులకు కంపెనీలు బెస్టు శాలరీ ప్యాకేజ్ అందిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ల ట్రెండ్ చూసినా ఇదే విషయం స్పష్టమవుతోంది. పైగా ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే కూడా ఎంబీఏ విద్యార్థులు ఎక్కువ శాలరీ ప్యాకేజీ సాధించడం విశేషం.గత ఐదేళ్లుగా ఇదే తీరు ఉన్నా.. గత మూడేళ్లుగా దేశంలోని టాప్ 10 ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ల తీరును పరిశీలిస్తే ఈ విషయం మరింత ప్రస్ఫుటమవుతోంది. ఇదే విషయాన్ని ఆగస్టు 27న విడుదలైన డెలాయిట్ ఇండియా వర్క్‌ఫోర్స్–2026 నివేదిక కూడా వెల్లడించింది.జాతీయ ర్యాంకింగ్‌ల ఆధారంగా దేశంలోని అగ్రస్థానంలో ఉన్న విద్యా సంస్థలతోపాటు, క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహించే ప్రధానమైన 250 రిక్రూటర్లు(సంస్థలు)ను సర్వే చేసి డెలాయిట్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. 2026–27లో నిర్వహించబోయే క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఇంజినీరింగ్ కోర్సుల కంటే ఎంబీఏ కోర్సులకు అధిక ప్రాధాన్యముంటుందని ఆ సంస్థలు వెల్లడించినట్టు ఆ నివేదిక పేర్కొంది. డెలాయిట్ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..⇒ దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థుల శాలరీ ప్యాకేజీ కంటే అగ్రస్థానంలో ఉన్న ఎంబీఏ విద్యార్థులకు మెరుగైన శాలరీ ప్యాకేజీ లభిస్తోంది.⇒ 2025లో ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే ఎంబీఏ విద్యార్థులకు సగటున 47 శాతం అధిక శాలరీ ప్యాకేజీతో క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఉద్యోగాలు పొందారు. ⇒ 2026లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే ఎంబీఏ విద్యార్థులు సగటున 59శాతం అధిక శాలరీ ప్యాకేజీతో ప్లేస్మెంట్లు సాధించారు. ఈ ఏడాది నిర్వహించనున్న మిగిలిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఇదే తీరు కొనసాగనుంది. ⇒ ఇక 2027 క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ ఎంబీఏ విద్యార్థులు మరింత అధిక ప్యాకేజీ సాధిస్తారని అంచనా. ⇒ 2025లో దేశంలో టాప్–10 బిజినెస్ స్కూళ్లలోని విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.27.4 లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్లు లభించాయి. కాగా చిన్న నగరాల్లోని టయర్–3 బిజినెస్ స్కూళ్ల విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.8.4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయి. అయితే దేశంలో టాప్–10 ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.18.7లక్షల ప్యాకేజీతో ప్లేస్మెంట్లు లభించాయి. చిన్న నగరాల్లో టయర్–3 ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.5.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయి.⇒ 2026లో ఇప్పటివరకు దేశంలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.27.03 లక్షల శాలరీ ప్యాకేజీ లభించింది. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులకు సగటున ఏడాదికి రూ.17 లక్షల శాలరీ ప్యాకేజీ మాత్రమే దక్కింది. ⇒ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల నిర్వహణ బడ్జెట్‌ను 19 శాతం పెంచాయి. ⇒ ఇంజినీరింగ్, ఎంబీఏ ప్లేస్మెంట్లలో అత్యధికుల ప్రధాన ఎంపిక బెంగళూరుగా ఉంది. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణె ఉన్నాయి. ⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) క్యాంపస్ రిక్రూట్మెంట్లను ప్రస్ఫుటంగా ప్రభావితం చేస్తోంది. 2025లో క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఏఐ పరిజ్ఞానం ఆధారంగా 21శాతం ప్లేస్మెంట్లు కేటాయించారు. కాగా 2026లో ఆ ప్లేస్మెంట్లు 35 శాతానికి పెరిగాయి. -
ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినా ‘అధిక పెన్షన్’!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ అధిక పెన్షన్ పథకానికి పెట్టిన కఠిన నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. 2014 సెపె్టంబర్ నాటికే అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుని, 26(6) నిబంధన ప్రకారం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినవారికే వర్తింపజేస్తామన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఉమ్మడి ఆప్షన్, దరఖాస్తులను సమర్పించినా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అపరాజిత జగ్గి ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ పీఎఫ్ కమిషనర్లు, ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజనల్ పీఎఫ్ కమిషనర్లకు తగిన సూచనలు చేశారు. అధిక పెన్షన్ కోసం వచ్చి న దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఎలాంటి పత్రాలను పరిగణించి పరిశీలించాలి? ఏయే పత్రాల ఆధారంగా అధిక పెన్షన్ మంజూరు చేయాలి? ఇప్పటివరకు ఉన్న నిబంధనల్లో మినహాయింపు వేటిపై అనే అంశాలపై స్పష్టత ఇచ్చారు. అధిక వేతనంపై అధిక పెన్షన్.. ఎంప్లాయీస్ పెన్షన్ పథకం (ఈపీఎస్) నిబంధనల ప్రకారం ఉద్యోగుల వేతనంపై పరిమితులున్నాయి. 2014 సెప్టెంబర్‌కు ముందు గరిష్ట వేతన పరిమితి రూ.6,500గా ఉంది. తర్వాత దానిని రూ.15 వేలకు పెంచారు. ఉద్యోగి వేతనం ఎంత ఉన్నా.. ఈ పరిమితి మేరకే పథకాన్ని వర్తింపజేస్తూ, దానికి తగినట్టే పెన్షన్ అందేలా నిబంధన పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గరిష్ట వేతన పరిమితి కంటే ఎక్కువ వేతనాలను పొందుతున్న వారికి అధిక పెన్షన్ పొందేందుకు ఈపీఎఫ్ఓ ఇటీ వల అవకాశం కల్పించింది. సదరు అధిక వేతనానికి అనుగుణంగా ఉద్యోగులు, యాజమాన్యం వాటాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 2014 సెప్టెంబర్ 1 నాటికి అధిక పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చుకుని, 26(6) నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారికే అధిక పెన్షన్‌ను వర్తింపజేస్తామని కొర్రీ పెట్టింది. అయితే లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు తాజాగా దీనిని సడలించింది. ఇప్పుడు కొత్తగా ఉమ్మడి ఆప్షన్ ఇస్తూ, 26(6) నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏమేం పత్రాలు సమర్పించాల్సి ఉంటుందనే దానిపై స్పష్టత ఇచ్చింది. ఆయా పత్రాలకు సంబంధించిన ప్రొఫార్మాలను ఈపీఎఫ్ఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూరించవచ్చని తెలిపింది. ఏమేం పత్రాలు కావాలి? ♦ పేరా 6, పేరా 7లకు సంబంధించి ఈపీఎస్ కింద యాజమాన్యం ధ్రువీకరించిన జాయింట్ ఆప్షన్ ఆధారాన్ని సమర్పించాలి. ♦ తర్వాత 26 (6) అనుమతి పత్రాన్ని జత చేయాలి. ♦ యాజమాన్యంతో ఉద్యోగి అండర్‌టేకింగ్ పత్రాన్ని పూరించి.. యాజమాన్యం నుంచి ధ్రువీకరణ చేయించాలి. ♦ ఉద్యోగి తన పేస్లిప్‌ను లేదా యాజమాన్యం జారీ చేసిన అధికారిక వేతన పత్రాన్ని సమర్పించాలి. ♦ యాజమాన్యం ఇస్తున్న వేతన వివరాలతోపాటు దరఖాస్తు, ఉమ్మడి ఆప్షన్, ఇతర పత్రాలను జత చేసి అందజేయాలి. ♦ అధిక వేతనానికి సంబంధించి 2022 నవంబర్ 4కు ముందు పీఎఫ్ కార్యాలయం నుంచి జారీచేసిన పత్రాన్ని జత చేయాలి ♦ అండర్‌టేకింగ్ పత్రాన్ని ఇప్పుడు లేదా క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అయినా సమర్పించవచ్చు. -
గగన వీధిలో విహరించే కెరీర్‌కు ఎయిర్ హోస్టెస్!
ఆకాశయానం, అధిక వేతనం.. వీటికి అవకాశం కల్పించే గ్లామరస్ కెరీర్ ఎయిర్ హోస్టెస్. విమానాల్లో ప్రయాణికులకు స్వాగతం పలికి, వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే గగన సఖిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నవారెందరో ఉంటారు. ప్రపంచ దేశాలను సందర్శించే అవకాశం, ఉన్నత స్థాయి జీవనం దీనిద్వారా సాధ్యమవుతుంది. మనదేశంలోకి నూతన ఎయిర్ లైన్స్ సంస్థల ఆగమనంతో ఎయిర్ హోస్టెస్‌లకు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో ఉద్యోగాలు వీరికి అందుబాటులో ఉన్నాయి. హోదాను బట్టి వేతనం ఎయిర్ హోస్టెస్‌లకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. తాము పనిచేస్తున్న విమానాల్లో ప్రయాణికులకు అవసరమైన సూచనలు ఇవ్వాలి. భోజన వసతి కల్పించాలి. వారు క్షేమంగా ప్రయాణించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ప్రథమ చికిత్స అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి భద్రంగా బయటపడేలా సహాయపడాలి. ఈ పనులన్నీ చేయడానికి శిక్షణ పొందాలి. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భారత్‌లో విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతున్నాయి. విమాన ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సంస్థలు నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. దీంతో ఎయిర్ హోస్టెస్‌లకు ఉద్యోగావకాశాలు రెట్టింపవుతున్నాయి. కెరీర్‌ను ప్రారంభించిన రెండు మూడేళ్లలో సీనియర్ కేబిన్ అటెండెంట్ స్థాయికి చేరుకోవచ్చు. హోదాను బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. అనుభవం ఆధారంగా అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ విభాగంలోకి ప్రవేశించొచ్చు. ఆసక్తి ఉంటే టెక్నికల్, కస్టమర్ సర్వీసెస్ ట్రైనర్‌గా కూడా పనిచేయొచ్చు. ఈ వృత్తిలో ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. సోషల్ లైఫ్‌ను కోల్పోతున్నామనే భావన అప్పుడప్పుడు కలుగుతుంది. సవాళ్లను ఎదుర్కోగల గుండె నిబ్బరం ఉన్నవారికి ఇది సరైన కెరీర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ హోస్టెస్ అంటే మహిళలే గుర్తుకొస్తారు. కానీ, ఇటీవలి కాలంలో పురుషులు కూడా ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీరికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిన నైపుణ్యాలు: ఎయిర్ హోస్టెస్‌లకు విధుల్లో ఎన్ని ఒత్తిళ్లనైనా ఎదుర్కొని ప్రశాంతంగా పనిచేయగల ఓర్పు, సహనం తప్పనిసరిగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కంటిచూపు మెరుగ్గా ఉండడం అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు ఉండాలి. సంక్లిష్ట పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం కావాలి. నిత్యం ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకూడదు. వేతనాలు: ఎయిర్ హోస్టెస్‌లకు తమ అనుభవం, పనిచేస్తున్న సంస్థ, విధులను నిర్వర్తించిన సమయాన్ని బట్టి వేతనం అందుతుంది. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ ఆదాయం ఉంటుంది. ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. సీనియారిటీ ఆధారంగా ఇందులో పెరుగుదల ఉంటుంది. హెడ్ ఫ్లైట్ అటెండెంట్ నెలకు రూ.60 వేలు సంపాదించుకోవచ్చు. కొన్ని అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఎయిర్ హోస్టెస్‌లకు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా వేతనాలు చెల్లిస్తున్నాయి. అర్హతలు ఎయిర్ హోస్టెస్‌గా మారాలనుకుంటే కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ హోస్టెస్ అకాడమీలో చేరి తగిన శిక్షణ పొందిన తర్వాత విధుల్లో చేరొచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అభ్యసించినవారు కూడా ఇందులోకి అడుగుపెడుతున్నారు. స్థానిక భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా పరిజ్ఞానం ఉంటే మంచి అవకాశాలను దక్కించుకోవచ్చు. ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీలు విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఫ్రాంక్ఫిన్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీ-హైదరాబాద్ వెబ్సైట్: www.frankfinn.com అప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ వెబ్సైట్: www.aptechaviationacademy.com సృష్టీస్ ఏవియేషన్ వెబ్సైట్: www.sristysaviation.com ఐఐ ఫ్లై ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ వెబ్సైట్: http://iifly.in/ మాస్టర్ ఏవియేషన్ అకాడమీ వెబ్సైట్: www.masteraviationacademy.com ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ వెబ్సైట్: www.flyairaviationacademy.in


