ముద్రగడ ఆరోగ్యం క్షీణించింది : బంధువులు
రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని ఆయన బంధువులు తెలిపారు. సోమవారం కిర్లంపూడి నుంచి వచ్చిన 30 మంది విడతల వారీగా ముద్రగడను పరామర్శించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ముద్రగడ కనీసం లేవలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన సతీమణి, కోడలు వాంతులు చేసుకుంటున్నారని చెప్పారు.
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం: వైద్యులు
ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం తెలిపింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన ఆరోగ్య సమాచారాన్ని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తాము ప్రతి రెండు గంటలకోసారి ముద్రగడను పర్యవేక్షిస్తున్నామని, తాము వెళ్లిన ప్రతిసారీ అభివాదం చేయడం, కూర్చోవడం చేస్తున్నారని తెలిపారు. వైద్య పరీక్షలు చేయిచుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారని, మంచినీరు తీసుకుంటున్నారని తెలిపారు. పైకి మాత్రం ఆరోగ్యంగా కనిపిస్తున్నా వైద్య పరీక్షలు చేయందే ఏమీ చెప్పలేమన్నారు.
ముద్రగడ సతీమణి ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమెకు ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నామన్నారు. కోడలు, చిన్నకుమారుడుకి కూడా ప్లూయిడ్స్ పెట్టామని వివరించారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ కార్యదర్శి మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నామని జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, వైద్య సేవల సమన్వయాధికారి టి.రమేష్ కిశోర్ తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు.