breaking news
head transplantation
-
శవం తల ఇంకో మొండేనికి అమర్చారు
-
సంచలనం: తల తీసి అతికించారు
సాక్షి నాలెడ్జ్ సెంటర్: సెర్గి కానవేరో పేరు ఎప్పుడైనా విన్నారా? ఏడాది క్రితం వార్తా పత్రికల పతాక శీర్షికలకు ఎక్కారీయన. ఒక వ్యక్తి తలను ఇంకో వ్యక్తి మొండేనికి అతికిస్తానని ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా సెర్గి ఇంకో రికార్డు సృష్టించారు. ఒకరి తలను ఇంకొకరికి అమర్చడం సాధ్యమేనని నిరూపించేందుకు ఆయన బృందంలోని డాక్టర్ ఒకరు చైనాలో ఒక శవంపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. డాక్టర్ షియావ్‌పింగ్ రెన్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగిందని.. వెన్నెముకతోపాటు నాడులు, రక్తనాళాలు అన్నింటినీ ఇంకో మొండేనికి అతికించగలిగామని కానవేరో వెల్లడించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘పుట్టు.. పెరుగు.. చావు అంటూ ఇంతకాలం మనమెలా బతకాలో ప్రకృతి నేర్పించింది. మనిషి పరిణమించే క్రమంలో కోట్ల మంది చనిపోయారు. ఇది భారీ స్థాయిలో జరిగిన మారణకాండ అని నేనంటాను. అయితే ఇకపై ఇలా జరగదు. మన భవిష్యత్తు ఏదో మనమే నిర్ణయించుకునే సమయం వచ్చేసింది’ అని కానవేరో ప్రకటించారు. తలల మార్పిడి ప్రక్రియ విజయవంతమైతే ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. ఇటీవల చైనాలో దాదాపు 18 గంటలపాటు శస్త్ర చికిత్స జరిపి ఒక శవం తలను ఇంకో మొండేనికి మళ్లీ అతికించగలిగామని ప్రకటించారు. శస్త్రచికిత్స వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తర్వాతి ప్రయోగాల్లో భాగంగా త్వరలోనే బ్రెయిన్ డెడ్ అయిన వారి తలలు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. చిట్టచివరిగా బతికున్న వ్యక్తి తలను ఇంకో మొండేనికి అతికించేందుకు ప్రయత్నిస్తామని, ఇది అనివార్యమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి మనిషి ఆయుష్షును పెంచే సాధనంగా కాకుండా.. వైద్యపరమైన సమస్యలు ఎదుర్కొనే వారికి ఒక పరిష్కారంగా మాత్రమే ఈ తలల మార్పిడిని చేపడతామని స్పష్టం చేశారు. పెదవి విరిచిన శాస్త్రవేత్తలు కానవేరో ప్రయోగాలపై అప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైద్య శాస్త్రానికైనా ఈ ప్రయోగం తాలూకు ప్రయోజనం శూన్యమని, కానవేరో చేస్తున్నది నైతికంగా చాలా తప్పని యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ సౌత్ మాంచెస్టర్‌కు చెందిన డాక్టర్ జేమ్స్ ఫైల్డ్ వ్యాఖ్యానించారు. తల మార్పిడి ద్వారా ఓ భారీ సైజు జీవి జీవన ప్రమాణాన్ని ఎంతో కొంత మెరుగుపరచగలరన్నది నిరూపణ అయ్యేంత వరకూ.. తగిన సాక్ష్యాలు వీరు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. మరిన్ని ప్రయోగాలకు సిద్ధం రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ వాలరె స్పిరిడినోవ్ తలను ఇంకో మొండేనికి అతికిస్తానని కానవేరో ప్రకటించినప్పటి నుంచి ఈ అంశంపై ఎన్నో చర్చలు మొదలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ప్రయోగానికి అంగీకరించిన స్పిరిడినోవ్ ప్రస్తుతం తనకు ఆరోగ్యవంతమైన శరీరం లభించడం కష్టమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కానవేరో చైనాలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చిన్న స్థాయి జంతువుల తలలు మార్చిన ఈయన బృందం వాటిలో విజయం సాధించింది. వీరు ఒక ఎలుకకు అదనంగా ఇంకో తలను జోడించి దాన్ని 36 గంటలపాటు జీవించి ఉండేలా చేయగలిగారు. -
ఇక తలలు మార్చేస్తాం..!
మనిషి తల తీసి ఏనుగు తల పెట్టడం మనం పురాణాల్లోనే చూశాం. ఇప్పుడు అచ్చం అలాగే.. మనిషి తల తీసి.. మరో మనిషి మొండానికి అమర్చే అత్యద్భుతమైన ఆపరేషన్‌కు ప్రపంచంలోనే తొలిసారిగా రంగం సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అత్యాధునికమైన ల్యాబ్‌లో 36 గంటలపాటు 150 మంది డాక్టర్లు, నర్సుల సహాయంతో ఇటలీకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సెర్గీ కానవెరో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియకు దాదాపు రూ. 70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మాస్కో నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లదిమీర్ పట్టణంలో స్పిరిడొనోవ్ అనే 30 ఏళ్ల కంప్యూటర్ సైంటిస్ట్ 'వెర్డినిగ్ హాఫ్మన్ మజిల్ వేస్టింగ్' అనే జబ్బుతో బాధ పడుతున్నారు. ఈ జబ్బుతో బాధపడేవారి శరీరంలో క్రమంగా కండరాలన్నీ పని చేయకుండాపోయి, అవయవాలు చచ్చుపడి చివరకు మృత్యువాత పడతారు. స్పిరిడొనోవ్ ప్రస్తుత పరిస్థితి కూడా అంతే. కండరాల జబ్బు కారణంగా కాళ్లు, చేతులు పనిచేయకుండా పోవడంతో ఆయన ప్రస్తుతం వీల్ చైరుకే అతుక్కుపోయారు. తన ఈ పరిస్థితికి ముక్తి దొరికే మార్గం లేదా అని ఇంటర్నెట్లో వైద్య విజ్ఞానాన్ని శోధించారు. చివరకు తన తలను తీసి బ్రెయిన్ డెడ్ అయిన మరో వ్యక్తి మొండానికి అతికించడం ఒక్కటే మార్గమనే అభిప్రాయానికి వచ్చారు. అంతే అందుకు యోగ్యుడైన సర్జన్ ఎవరని మళ్లీ వెతికారు. చివరకు ఇటలీకి చెందిన ప్రముఖ వివాదాస్పద సర్జన్ డాక్టర్ కానవెరో ఇందుకు యోగ్యుడని భావించారు. రెండేళ్ల క్రితమే అతనితో మాట్లాడారు. ఆపరేషన్ చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. 2016 మొదట్లోనే ఈ ఆపరేషన్ జరుగుతుందని ఆయన తెలిపారు. 45 ఏళ్ల క్రితమే ఓ కోతి తలను తీసి మరో కోతి తలకు అమర్చినప్పుడు, ఇటీవల చైనాలో ఓ ఎలుకకు ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు మానవులకు మాత్రం ఎందుకు చేయలేమని డాక్టర్ కానవెరో ప్రశ్నిస్తున్నారు. తాను ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేసి నిరూపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ బ్రెయిన్ డెడయిన డోనర్ బాడీ కావాలని చెప్పారు. ఆపరేషన్‌కు సంబంధించిన స్కెచ్‌ను తాను ఇప్పటికే వేసుకున్నానని, ఈ ఆపరేషన్‌లో తనకు సహకరించేందుకు 150 మంది డాక్టర్లు, నర్సులు అవసరం అవుతారని, ఆపరేషన్ పూర్తి చేసేందుకు 36 గంటల పట్టవచ్చని ఆయన తెలిపారు. ఆపరేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియజేయాలంటూ ఇప్పటికే తనకు వేలాది మెయిల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. 'నేను అపరేషన్‌కు భయపడుతున్నానా! కొంత నిజమే. మరీ అంత భయం లేదు. భయం కన్నా ఉత్సాహం, కుతూహలమే నాలో ఎక్కువ ఉంది. నాకు ఆపరేషన్‌కు సిద్ధమవడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఇందుకు మా ఇంటిల్లిపాదీ అంగీకరించారు కూడా. చచ్చుపడిన అవయవాలతో జీవితాంతం బాధపడే కన్నా భవిష్యత్‌పై ఆశతో ఓ సాహసానికి సిద్ధమవడమే మంచిదని భావిస్తున్నా. సాధారణంగా నాకొచ్చిన లాంటి జబ్బు వచ్చిన వారు 20 ఏళ్లకే చనిపోతారట. ఇప్పటికే నా జీవితానికి పదేళ్ల బోనస్' అని ఆపరేషన్‌కు సిద్ధపడిన ఇంజనీర్ స్పిరిడొనోవ్ వ్యాఖ్యానించారు. 1970లో డాక్టర్ రాబర్ట్‌వైట్ ఓ కోతి తలకాయను మరో కోతి తలకాయకు అమర్చారు. అయితే 8 రోజుల్లోనే ఆ కోతి చనిపోయింది. ఆ ఆపరేషన్‌లో కోతి వెన్నుపూసతో తలను అనుసంధానం చేయలేదని అందువల్లనే కోతి చనిపోయే పరిస్థితి ఏర్పడిందని డాక్టర్ కానవెరో వివరించారు. ఇప్పుడు మానవుల తలలను మార్చే సాంకేతిక, వైద్య విజ్ఞానం పూర్తిగా అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. ఫిక్షన్ నవల్లో డాక్టర్ ఫ్రాంకేస్టైన్ ఇలాంటి ఎన్నో ఆపరేషన్లు చేసిన విషయం మనకు తెలిసిందే కదా!