breaking news
Hanumangarhi temple
-
శ్రీరామ నవమికి అయోధ్య వెళ్తున్నారా?.. వీటినీ సందర్శించండి!
అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమయ్యాక భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. దేశవిదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరాముని జన్మస్థలికి తరలివస్తున్నారు. ఏప్రిల్ 17న అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో నూతన రామాలయంతో పాటు తప్పక సందర్శించాల్సిన మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. హనుమాన్‌గర్హి అయోధ్యలో పురాతన సిద్ధపీఠం హనుమాన్‌గర్హి ఆలయం ఉంది. రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు హనుమాన్‌గర్హికి వెళ్లాలని స్థానికులు చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు హనుమాన్గర్హిని సందర్శిస్తారు. 2. కనక్ భవన్ త్రేతా యుగంలో పట్టపు రాణి కైకేయి.. సీతామాతకు ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చారని చెబుతారు. కనక్భవన్లో శ్రీరామునితో పాటు సీతామాత, శ్రీరాముని నలుగురు సోదరుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సీతారాముల దర్శనం, పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కనక్ భవన్‌కు తరలివస్తుంటారు. 3. దశరథ్ మహల్ దశరథ్ మహల్ కూడా అత్యంత పురాతనమైనది. త్రేతా యుగానికి చెందినదని చెబుతారు. దశరథ మహారాజు ఈ రాజభవనంలో ఉండేవాడట. దరశరథుని కుటుంబమంతా ఈ ప్యాలెస్‌లో కనిపిస్తుంది. 4. నాగేశ్వర్ నాథ్ ఆలయం శ్రీరాముని కుమారుడైన కుశుడు నిర్మించిన నాగేశ్వర్ నాథ్ ఆలయం రామ్ కి పాడిలో ఉంది. శ్రావణమాసంలోను, శివరాత్రి సందర్భంగానూ లక్షలాది మంది భక్తులు నాగేశ్వర్ నాథ్ ఆలయానికి తరలివస్తుంటారు. 5. బహు బేగం సమాధి బహు బేగం సమాధి కూడా అయోధ్యలోనే ఉంది. పర్యాటకులు కుటుంబ సమేతంగా ఇక్కడి అందమైన పూల తోటకు వచ్చి సేద తీరుతారు. 6. సూర్య కుండ్ త్రేతా యుగంలో శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యవాసులతో పాటు దేవతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా ఒక నెలరోజుల పాటు అయోధ్యలో ఉన్నాడట. దీనికి గుర్తుగానే సూర్యకుండ్ నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దర్శన్ నగర్లో ఉంది. లేజర్ షో ద్వారా శ్రీరాముని కథను ఇక్కడ ప్రదర్శిస్తారు. 7. రామ్ కి పాడి రామ్ కి పాడిని అయోధ్యకు కేంద్ర బిందువుగా చెబుతారు. ఇక్కడ రామాయణాన్ని లేజర్ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో దీపాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రామ్ కి పాడికి తరలివస్తారు. ఇక్కడి సరయూమాతను పూజిస్తారు. 8. సరయూ తీరం పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ తీరాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. సరయూ నది ఒడ్డున స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు. 9. గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ కూడా సరయూ నది ఒడ్డున ఉంది. ఈ ఘాట్ మీదుగానే శ్రీ రాముడు తన నివాసానికి వెళ్లేవాడని చెబుతుంటారు. గుప్తర్ ఘాట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
అయోధ్యలో వెల్లివిరిసిన మతసామరస్యం
అయోధ్య: మత సామరస్యానికి అద్దం పెట్టే ఉదంతమింది. తమ స్థలంలో సొంత ఖర్చుతో ముస్లింల కోసం మసీదు కట్టేందుకు ఉత్తరప్రదేశ్ లోని హిందూ దేవాలయం ముందుకు వచ్చింది. వివాదస్పద అయోధ్య స్థలంకు కొద్ది దూరంలో ఉన్న ప్రాంతంలో హనుమాన్‌గార్హి ఆలయం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. తమ స్థలంలో ఉన్న ఆలంగిరి మసీదును పునర్ నిర్మించేందుకు దేవాలయ బోర్డు అంగీకరించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించాడు. 1765లో నవాబ్ షుజౌద్దల్లా.. మసీదు ఉన్న ఈ స్థలాన్ని హనుమాన్‌గార్హి ఆలయంకు దానం చేశాడు. నమాజ్ కొనసాగించేందుకు అనుమతించాలన్న షరతుతో ఈ స్థలాన్ని అప్పగించాడు. నిర్వహణ సరిగా లేకపోవడంతో తర్వాతి కాలంలో మసీదు క్షీణ దశకు చేరింది. దీంతో ముస్లింలు ప్రార్థనలు చేయడానికి వీలు లేకుండా పోయింది. మసీదు కూలిపోయే దశలో ఉందని అయోధ్య మున్సిపల్ అధికారులు ఇటీవల హెచ్చరిక నోటీసులు అతికించారు. మసీదును మరమ్మతు చేయడానికి అనుమతించాలని స్థానిక ముస్లింలు హనుమాన్‌గార్హి ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ జ్ఞాన్ దాస్ ను కలిశారు. తమ సొంత ఖర్చుతో మసీదును పునర్ నిర్మిస్తామని, ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి వీలుగా అనుమతి పత్రం కూడా ఇస్తామని మహంత్ హామీయిచ్చారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు కూడా ఇస్తుంటారు.