breaking news
Hands Free
-
చేతిసైగలతో కదిలే డ్రోన్
గాల్లో ఎగిరే వస్తువులను చూసి చాలా ఆనందపడతారు పిల్లలు. ఇక ఆ ఎగిరే వస్తువు వాళ్లు చెప్పినట్లు ఎగిరితే ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఆ పని చేస్తుంది ఈ ‘స్కూట్ డ్రోన్’. చేతి సైగలతో కోరుకున్న రీతిలో ఈ డ్రోన్‌ను ఎగురవేస్తూ ఆటలాడుకోవచ్చు. ఎగిరేటప్పుడు పల్టీలు కొట్టడం వంటి విన్యాసాలు కూడా చేస్తుంది.ఆరుబయటి మైదానాల్లోనే కాకుండా, జనావాసాల్లో కూడా దీనిని సురక్షితంగా ఎగరేయవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు ఎదురుగా ఉన్న అవరోధాలను గుర్తించగలవు. కాబట్టి, ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఈ డ్రోన్‌ను ఎగరేస్తూ ఆటలాడుకోవచ్చు. ధర రూ. 4,569. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. -
ఇలా డ్రైవింగ్ చేసినా ప్రమాదమే!
లండన్: డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడడం ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. అయితే చాలామంది బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వంటివి పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇది మరింత ప్రమాదకరమంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని ఏదో ఊరికే చెప్పేయకుండా రెండు రకాల వీడియో ఆధారిత పరిశోధనల ద్వారా రుజువు చేశాడు లండన్‌కు చెందిన గ్రాహం హోల్. హ్యాండ్ ఫ్రీ పరికరాలు ఉపయోగించి ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు అయోమయ స్థితిలోకి వెళ్లిపోవడం, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి మొదటి పరిశోధన ద్వారా నిరూపించగా..., ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారి మెదడుపై తీవ్ర ఒత్తిడి పెరిగి, అప్పుడు కాకపోయినా ఆ తదుపరి ప్రమాదాలబారిన పడడం రెండో పరిశోధన ద్వారా రుజువు చేశాడు.