హంద్రీ-నీవా కాలువ అనుసంధానానికి పోరాటం
-ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి
నిమ్మనపల్లె: బాహుదాలోకి హంద్రీ-నీవా అనుసంధానం చేసేందుకు తనవంతు పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని ముష్ఠూరు వద్దగల బాహుదా ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ఎక్కడ చూసినా వాగులు, వంకలు ప్రవహిస్తూ వరదలు ముంచెత్తుతుతంటే బాహుదా ప్రాజెక్టులోకి నీరు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాల్మీకిపురం, మదనపల్లెను పాలించిన పాలకుల పాపమే బాహుదాకు నీరు చేరడం లేదని తెలి పారు. దాదాపు 3200 మంది నిమ్మనపల్లె, వాల్మీకిపురం మండలాల రైతులు ఈ ప్రాజెక్టు వలన ఫలితం పొందేవారన్నారు.
370 ఎకరాలలో విస్తరించి ఉన్న బాహుదా 385 ఎంసీఎఫ్‌టీలు నీటి సామర్థ్యం కలిగి ఉందన్నారు. 2,883 ఎకరాలకు నీరందించాల్సి ఉందని, అయితే ప్రాజెక్టులోకి కేవలం 50 ఎంసీఎఫ్‌టీ నీరు చేరడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి బాహుదాకు హంద్రీ-నీవా అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాహుదాలోకి 15ఏళ్లుగా నీరుచేరకపోవడంతో వ్యవసాయానికి స్వస్తి పలికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూలి పనులకు వెళ్లడం బాధాకరమన్నారు. ఇరిగేషన్ ఏఈ మన్నన్, బాహుదా ఏఈ స్వర్ణలతతో బాహుదాకు సంబంధించి పలు విషయాలపై ఆరా తీశారు. మండలంలో ఆగిన మోడల్ స్కూల్ నిర్మాణానికి కృషి చేసి పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లప్ప, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ సదాశివారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎర్రయ్య, ఈశ్వర, వెంకటరమణారెడ్డి, నవాజ్, రైతులు పాల్గొన్నారు.