బెజవాడలో భారీ పేలుడు
* ముగ్గురు మృతి
* ఏడుగురికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి విషమం
విజయవాడ: విజయవాడలో మంగళవారం భారీ విస్ఫోటం సంభవించింది. స్థానిక రాజీవ్ శర్మ కాలనీలోని అంబేద్కర్‌వాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సంభవించిన భవనం ధ్వంసమవగా మరో మూడు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారి మరుపిళ్ల బాలరాజుకు చెందిన మూడంతస్తుల భవనంలో ఈ పేలుడు జరిగిం ది. భవనం కింది భాగంలో నాలుగు పోర్షన్లలో వేర్వేరు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. వీటిలో కొత్తపల్లి శివలోకేశ్వరి (35) నివాసంలో పేలుడు సంభవించింది. ఆమెతో పాటు ఆమె పిల్లలు కీర్తి (10), నిఖిల్ (8), కొండేటి శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. పక్క పోర్షన్లో ఉంటున్న కూరాడ రాంబాబు అలియాస్ రమణ (45), అతని భార్య నిర్మల (35) అక్కడికక్కడే చనిపోయారు. పక్క భవనంలో ఉం టున్న రమణమ్మ (60) కూడా అక్కడికక్కడే మృతిచెందింది. పక్క భవనాల్లో ఉండే కార్తీక్ (14), స్వరూప్ (13), షేక్ బాజీ (55) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బాజీ, లోకేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు.
గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, డిప్యూటీ పోలీసు కమిషనర్ జి.వి.జి.అశోక్‌కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, ఏసీపీ రాఘవరావు తదితరులు ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్, బాంబు నిపుణుల బృందం ఆధారాలు సేకరించాయి. జరిగిన ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ చెప్పారు. ప్రమాద స్థలాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమ, వల్లభనేని వంశీ, మేయర్ కోనేరు శ్రీధర్ బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. గాయపడిన వారికి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద వైద్యం అందిస్తామని చెప్పారు.
ఘటనపై అనుమానాలు
ఈ ఘటన పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. అక్కడి పరిస్థితి భిన్నంగా ఉంది. ఘటన జరిగిన భవనంలోని కింది మూడు పోర్షన్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. అక్కడ పేలిన గ్యాస్ సిలిండర్లు లేవు. భవనంలో మంటలు, పొగచూరిన ఆనవాళ్లు లేవు. దీనిపై పోలీసులకూ అనుమానాలు రావడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. లోతైన అధ్యయనం కోసం ప్రత్యేకంగా కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదం కాదని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై తాము ఎలాంటి నిర్ధారణకు రాలేదని సబ్ కలెక్టర్ నాగలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. పూర్తి విచారణ తర్వాత అన్ని విషయాలూ వెల్లడిస్తామని తెలిపారు.