తరలిపోతున్న గుట్టలు
ప్రభుత్వ ఆదాయానికి గండి
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
కొండాపూర్: ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కొందరు అక్రమార్కులు భూములను కొల్లగొట్టుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పగలు,రాత్రీ తేడా లేకుండా జేసీబీ,ఇటాచీల సహాయంతో గుట్టలను కరిగిస్తూ తద్వారా వాటి ఉండి లభించే రాయి, మట్టిలను మండల పరిధిలోని పరిశ్రమలకు యథేచ్ఛగా అమ్ముకుంటునా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామ శివారులో కొన్ని నూతన పరిశ్రమలు నిర్మాణ దశలో వున్నాయి.వీటి నిర్మాణానికి ఉపయోగపడే రాళ్లు, మట్టిలను కొందరు అక్రమార్కులు గొల్లపల్లి, మాందాపూర్, గుంతపల్లి తదితర గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లోని గుట్టలను కరిగిస్తూ అమ్ముకుంటున్నారు.
సుమారు 25 ట్రాక్టర్ల ద్వారా ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ ప్రతీరోజు యథేచ్ఛగా రాయి దందాను కొనసాగిస్తున్నారు.దీని ద్వారా ఒక్కొక్క ట్రిప్పుకు సుమారు 1500 నుండి రెండువేల రూపాయల వరకు తీసుకుంటూ భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.
ఇది నిలువరించాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం మాముళ్ల మత్తులో పడి కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.