ఎంసెట్-2 లీకేజీలో మరో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీఐడీ శనివారం మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేసింది. హరియాణాకు చెందిన ఇక్బాల్ ఖాన్ అలియాస్ ఇక్బాల్, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన గుమ్మడి వెంకటేశ్‌లను అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హరియాణాకు చెందిన ఇక్బాల్ బెంగళూరు, ఢిల్లీ కేంద్రాలుగా విద్యాసంస్థల కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్-2 బ్రోకర్లతో సంబంధాలు పెట్టుకొని 20 మంది విద్యార్థులను కోల్‌కతా కేంద్రంగా ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. అదే విధంగా గుంటూరుకు చెందిన వెంకటేశ్ హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో విద్యాసంస్థను నిర్వహిస్తున్నాడు. వెంకటేశ్‌కు విజయవాడకు చెందిన మరోవ్యక్తి సహకరించినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. వెంకటేశ్ కూడా ఏడు మంది విద్యార్థులను కోల్‌కతాలోని ప్రత్యేక కేంద్రానికి తరలించి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వెంకటేశ్ నుంచి రూ.16.45 లక్షలు రికవరీ చేసినట్లు సీఐడీ పేర్కొంది.