ఎలాన్ మస్క్ మరో సంచలనం
ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు. వికీపీడియాకు పోటీగా.. గ్రోకిపీడియా(Grokipedia)ను తీసుకొచ్చారు. ఇది ఏఐ ఆధారితంగా పని చేస్తుందని.. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్ అంటూ ప్రకటించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI గ్రోకిపీడియా(Grokipedia version 0.1) ప్లాట్‌ఫారమ్‌ను ఇవాళ(అక్టోబర్ 28న) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని.. శరవేగంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాచారం అందించడం దీని ఉద్దేశమని మస్క్ అంటున్నారు. అయితే.. ఇది ప్రారంభమైన కాసేపటికే భారీ ట్రాఫిక్ కారణంగా క్రాష్ అయ్యింది. దీంతో కాసేపటికి సేవల్ని పునరుద్ధరించారు. అంతేకాదు.. కొంత మంది ఇది వికీపీడియాతో పోలిస్తే కొత్తగా ఏం లేదని పెదవి విరుస్తున్నారు. పైగా ప్రాథమిక సమాచారాన్ని వికీపీడియా నుంచే తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. వికీపీడియాను జిమ్మీ వేల్స్ (Jimmy Wales), ల్యారీ సాంగర్ (Larry Sanger) కలిసి 2001 జనవరి 15న స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార వేదికలలో ఒకటి. ఇది ఒక ఫ్రీ ప్లాట్‌ఫారమ్. ఇందులో ఎవరైనా సమాచారాన్ని పొందుపరచవచ్చు.. లాగిన్ అయ్యి ఎడిట్ కూడా చేయొచ్చు. ఇది వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే.. వికీపీడియాకు పోటీగా, నిజమైన సమాచారం కోసం కొత్త వేదికలు అవసరం అంటూ మస్క్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. వికీపీడియాలోని సమాచారం విషయంలో స్పష్టత కొరవడింది. పూర్తిగా పక్షపాత ధోరణి కనిపిస్తోంది. అదే ఏఐతో అయితే అందుకు ఆస్కారం ఉండదని చెబుతూ ఇప్పుడు మస్క్ Grokipedia తీసుకొచ్చారు.