breaking news
Govt Hospital doctor
-
సర్కారు ఆస్పత్రిలో నిర్లక్ష్యపు ‘మత్తు’!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఓ నిండు చూలాలుకు వైద్యులు ప్రసవం చేయకుండా నిరాకరించారు. మత్తుడాక్టర్ అందుబాటులో లేడనేసాకుతో కరీంనగర్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. మీడియా రంగప్రవేశం చేయడంతో, నిర్లక్ష్యం వీడిన వైద్యులు సదరు గర్భిణిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి ప్రసవం నిర్వహించారు. మత్తుడాక్టర్ లేడని.. గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన బొల్లు రమ్య భర్తతో కలిసి కర్నాటక రాష్ట్రంలో ఉంటున్నారు. రెండోకాన్పు కోసం కర్నాటక నుంచి రమ్య పుట్టింటికి వచ్చింది.శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు పెరగడంతో ఆస్పత్రికి తల్లి తీసుకొచ్చింది. సాయంత్రం వరకు ప్రసవం జరిపిస్తామని చెప్పిన వైద్యులు, సబ్బు నీళ్లుకూడా తాగించారు. చివరికి అనస్థీషియా డాక్టర్ అందుబాటులోలేరని, కరీంనగర్‌కు రెఫర్ చేశారు. మీడియా ప్రవేశంతో ఉలిక్కిపాటు... రమ్యను కరీంనగర్ తీసుకెళ్లడానికి ఆమె భర్త అందుబాటులో లేరని, తండ్రి కూడా ఊరెళ్లాడని ఒక్కదాన్ని అంత దూరం వెళ్లలేనని, ఇక్కడే ప్రసవం జరిపించాలని తల్లి విమల ఆవేదన వ్యక్తం చేసింది. అనస్థీషియా లేకుంటే తామేమీ చేయలేమని వైద్యసిబ్బంది చేతులెత్తేశారు. అప్పటికే ఒక గర్భిణీకి ప్రసవం చేసిన వైద్యులు, రమ్యకు ప్రసవం చేపట్టకుండా వెళ్లిపోయారని గర్భిణి తల్లి ఆరోపించింది. చివరికి మీడియా ప్రతినిధులు బాధితురాలి సమస్యపై వివరాలు సేకరిస్తుండడంతో, అప్పటి వరకు ప్రసవం చేయలేమని చెప్పిన వైద్యులు, హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయారు. వైద్యులు ఆపరేషన్ చేయడంతో రమ్య బాబుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు. వీడని వైద్యుల నిర్లక్ష్యం... ఆస్పత్రిలో ముగ్గురు అనస్థీషియా వైద్యులు, ముగ్గురు గైనకాలజిస్టులు ఆస్పత్రిలో సేవలందిస్తున్నప్పటికీ, రమ్యకు ప్రసవం చేయడానికి నిరాకరించడం నిర్లక్ష్యమేనని ఆరోపణలు వస్తున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే ఒక్క గర్భిణిని కూడా బయటకు రెఫర్ చేయవద్దని, గతనెల 19న ఆస్పత్రిలో తనిఖీ చేయడానికి వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు సంచాలకులు డాక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వాస్పత్రిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ కూడా పని చేయడం లేదని, వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదని ఈ సంఘటనతో తేటతెల్లడైంది. వైద్యుల నిర్లక్ష్యం లేదు గర్భిణీకి ప్రసవం చేయకుండా వైద్యులు నిరాకరించలేదు. వైద్యులు, సిబ్బందికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. అందుకే ప్రసవం చేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. నాకు విషయం తెలియడంతోనే వెంటనే వైద్యులతో చర్చించాను. వైద్యులు కూడా స్పందించి రమ్యకు ఆపరేషన్ ద్వారా ప్రసవం జరిపించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. – డాక్టర్ రమాకాంత్, సూపరింటెండెంట్ -
ఆయిల్‌కు అడ్వాన్స్ ఇస్తానని మోసం
కొత్తపేట : ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకుని, ఆస్పత్రి వాహనాలకు ఆయిల్ సరఫరా చేయాలంటూ ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ వద్ద నుంచి రూ.40 వేలు కాజేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఈవని రామచంద్రా పెట్రోలియం ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ (హెచ్‌పీ పెట్రోల్ బంక్) వద్దకు శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. మేనేజర్ వీవీఎస్ఎన్ బంగార్రావును కలిసి తాను స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆస్పత్రి వాహనానికి రెగ్యులర్‌గా డీజిల్, ఇంజన్ ఆయిల్ పోయాలని, సొమ్ము ఒకేసారి ఇస్తామని చెప్పాడు. బంక్‌లో అరువు ఇవ్వమని బంగార్రావు చెప్పడంతో, ఆస్పత్రికి వస్తే అడ్వాన్స్ ఇస్తానని అతడు నమ్మించాడు. బంక్ యజమాని ఈవని సూర్యనారాయణ మూర్తి అనుమతితో బంగార్రావు అతడితో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఎమర్జెన్సీ విభాగం వద్ద కూర్చోమని చెప్పి అతడు లోపలికి వెళ్లాడు. ఓ కాగితం తెచ్చి.. రూ.60 వేలు ఇస్తున్నట్టు రాసివ్వమన్నాడు. అనంతరం 25 నిమిషాల్లో తేరుకుని చూసుకునేసరికి చేతిలో కాగితం ఉంది. ప్యాంట్ జేబులో పెట్టిన కలెక్షన్ సొమ్ము రూ.40 వేలు అదృశ్యమయ్యాయి. దీంతో ఆస్పత్రి డాక్టర్లను, సిబ్బందిని ఆరా తీయగా, తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. కాగితం ఇచ్చిన సమయంలో ముఖంపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని బంగార్రావు తెలిపాడు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఎస్సై ఎ.బాలాజీ దర్యాప్తు చేస్తున్నారు.