breaking news
govt Compensation
-
లైంగిక సుఖానికి దూరమయ్యా... రూ.10,006 కోట్లివ్వండి
రత్లాం: గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం నష్ట పరిహారంగా రూ.10,006.2 కోట్ల చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కాడు. మధ్యప్రదేశ్లోని రత్లాం పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనుడైన కాంతూ ఆలియాస్ కాంతీలాల్ భీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. స్థానిక కోర్టు 2022 అక్టోబర్ 20న అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతరం కాంతీలాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్నప్పుడు భార్యతో లైంగిక సుఖానికి దూరమయ్యానని, దేవుడిచ్చిన వరం వృథా అయ్యిందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రూ.10,006.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో రూ.10,000 కోట్లు మానసిక క్షోభ అనుభవించినందుకు మిగతా రూ.6.02 కోట్ల ఇతర ఖర్చుల కోసమని విన్నవించాడు. -
సగం మిర్చికే రాయితీ
► ఇప్పటి వరకు ఈ పథకం వర్తించింది 5.25 లక్షల క్వింటాళ్లకే.. ► ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్లకుపైగా సరుకు ► కోల్డ్స్టోరేజీల్లో మిర్చికి వర్తించని రాయితీ పథకం మిర్చి..ఈ పేరు వింటేనే రైతుల కళ్లలో సుడులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు రైతు లోగిలిలో బంగారు సిరులు కురిపించిన పంట..గతేడాది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల పతనంతో కుదేలైంది. ప్రతి ఇంటా అప్పుల కుంపటి రగిలించి రైతు గుండెల్లో ఆరని మంటలు మిగిల్చింది. పైపూతగా ప్రభుత్వం రాయితీ ప్రకటించినా..అదీ సగం సరుకుకు మాత్రమే అమలైంది. చివరకు మిర్చి రైతులను అప్పుల ఉరికొయ్యకు వేలాడదీసింది. సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. మిర్చి రైతులను ఆదుకొంటామని, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కోనుగోలు చేస్తామని ప్రభుత్వం మొదట్లో మభ్య పెట్టింది. చివరకు క్వింటాకు రూ.1500 రాయితీ ఇస్తామని ప్రకటించింది. అదీ 30 క్వింటాళ్ల వరకు మాత్రమే అంటూ పరిమితి విధించింది. దీనిని నమ్ముకొని గుంటూరు మార్కెట్ యార్డుకు మిర్చిని తీసుకొచ్చిన రైతులు నిలువునా మునిగిపోయారు. రాయితీ ప«థకం ప్రకటించాక మూడు రెట్లకుపైగా ధరలు పతనమయ్యాయి. సరుకు పెద్ద ఎత్తున యార్డుకు రావడంతో అమ్ముకోవటానికి రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత ధర్నాతో.. మిర్చి రైతుల అవస్థలు చూసి చలించిపోయిన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేశారు. వెల్దుర్తి మండలంలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో హడావుడిగా మంత్రులు గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి యార్డుకు సెలవులు రద్దు చేస్తున్నామని, రైతుల నుంచి మిర్చి కోనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే అక్కడ హమాలీలు, వేమెన్, వ్యాపారులు, దిగుమతిదారులు మార్కెట్ యార్డు పాలకవర్గానికి సహకరించకపోవడంతో కొనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. సగం సరుకు రైతుల వద్దే.. ప్రస్తుతం ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్ల సరుకు ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మార్కెట్ యార్డుకు సరుకు రాక తగ్గింది. ప్రస్తుతం యార్డులో మిర్చి బస్తాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాయితీ సొమ్ము చెల్లింపులో జాప్యం.. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాక..ఆ బ్యాంకు జిరాక్స్ కాపీ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఇవ్వాలి. అప్పుడు మార్కెటింగ్ శాఖ రాయితీ సొమ్ము రూ.1500(క్వింటాకు) రైతుల ఖాతాకు జమ చేస్తుంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రైతులకు వచ్చే కొద్దీగొప్పా మొత్తం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధర ప్రకటన చూసి మోసపోతున్నాం మార్కెటింగ్ శాఖ రోజూ ప్రకటిస్తున్న మోడల్ ధరను చూసి మోసపోతున్నామని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇక్కడికి మిర్చిని తీసుకొస్తే ధరలకు పొంతన ఉండడం లేదని పేర్కొంటున్నారు. మరో వైపు రైతుల వద్ద ఉన్న సరుకు నెలాఖరులోగా క్లియర్ కావడం గగనమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డుకు సరుకు తక్కువగా వస్తున్నా..నాణ్యత సాకుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. దీంతో మిర్చి రైతులు అన్ని విధాలా మునిగిపోతున్నారు. నెలాఖరు వరకు కోల్డ్స్టోరేజీల్లోనే.. ఈ నెల 30వ తేదీ వరకు కోల్డ్స్టోరేజీల్లో నిల్వ ఉన్న మిర్చిని బయటకు తీయొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీల్లో సరుకు తీసి పెట్టుబడులకు ఉపయోగించుకుందామనుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలాఖరు వరకు ఆగాల్సి రావడంతో పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు.