breaking news
governmenthospital
-
ఆస్పత్రి ప్రైవేటుపరంలో ఆంతర్యమేమిటి?
- అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్న చిత్తూరు (అగ్రికల్చర్) : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ఎవరి ప్రయోజనం కోసం ప్రైవేటు(అపోలో ఆస్పత్రి)పరం చేస్తున్నారని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు ఆస్పత్రిని ప్రైవేటు పరం చేయడంపై శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో అఖిల పక్షం పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, దళిత, బీసీ, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రులను ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే మొదట చిత్తూరు ఆస్పత్రిని ధారాదత్తం చేస్తున్నారన్నారు. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించే చిత్తూరు ఆస్పత్రిని ప్రైవేటు పరం చేసి వైద్యాన్ని సామన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి మాట్లాడుతూ నిరుపేదలకు నిర్విరామంగా వైద్యసేవలు అందిస్తున్న చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. జిల్లావాసి అయిన చంద్రబాబు నిరుపేదలకు అన్ని విధాల అన్యాయం చేస్తున్నారన్నారు. విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి పాడి రైతులకు, చెరకు రైతులకు అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. నిరుపేదలకు ఏకైక దిక్కైన చిత్తూరు ఆస్పత్రిని కూడా ప్రైవే టు యాజమాన్యానికి ధారాదత్తం చేసి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు నాగరాజన్, చైతన్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు వాటిని నెరవేర్చకపోగా, ఉన్న ఆస్తులను సైతం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం బాధాకరమన్నారు. చంద్రబాబు నియంతృత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్పి మనుగడ లేకుండా చేయడం ఖాయమని హెచ్చరించారు. చిత్తూరు ఆస్పత్రిని ప్రైవేటుపరం చేసే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ నాయకులు కె.మణి, బి.ఆరుముగం, వైఎస్సార్సీపీ నాయకుడు జ్ఞాన జగదీష్, ఎస్టీయూ నాయకుడు గంటా మోహన్, ఆటో యూనియన్ నాయకుడు విజయకుమార్, జర్నలిస్టుల యూని యన్ నాయకుడు జయరాజ్, బీసీల సంఘం నాయకుడు మురగయ్య, సీఐటీయూ నాయకులు సురేంద్రన్, గంగాధరన్, మాలమహానాడు నాయకుడు కేకే రవి తదితరులు పాల్గొన్నారు. -
బిడ్డను చంపేయమంటున్నాడు..
పుట్టి పట్టుమని నాలుగు రోజులూ నిండలేదు.. పేగు పుండు ఆరనూ లేదు.. మమకారంతో పెంచాల్సిన తండ్రే వద్దనుకున్నాడు.. ఆ..డ బిడ్డ అని తెలిసి.. పురిటిలోనే తుంచేయాలని భార్యను ఆజ్ఞాపించాడు.. లేకుంటే ఇంటికే రావద్దని ఆదేశించాడు.. భర్త మాట జవదాటలేక.. పేగుబంధాన్ని తెంచేయలేక.. పుట్టెడు దుఃఖంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ బాలింత.. ఈ ఘటన శనివారం మదనపల్లెలో సంచలనం రేపింది. మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మాయాబజార్లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సలీమ్ గురుకుల పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రమణమ్మ కుమార్తె దేవదానమ్మ(23)ను ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దేవదానమ్మ నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న భర్త సలీమ్ ఆడబిడ్డ అని మండిపడ్డాడు. ఆ బిడ్డను ఇంటికి తీసుకురావద్దు... చంపేసి ఇంటికిరా అంటూ హుకుం జారీచేశాడు. భయాందోళనకు గురైన దేవదానమ్మ స్థానిక టూటౌన్‌లోని మహిళా జ్యువినల్వింగ్ కోఆర్డినేటర్ రమాదేవిని ఆశ్రయించింది. స్పందించిన ఆమె తల్లీబిడ్డకు రక్షణ కల్పిస్తూ సలీమ్‌పై తదుపరి చర్యలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం షీటీమ్ పోలీసుల సంరక్షణలో తల్లీబిడ్డ ఉన్నారు.