breaking news
Gonglur panchayat
-
గొంగ్లూర్ టు జపాన్! గానుగ వంటనూనెల ఎగుమతికి సన్నాహాలు..
సాక్షి, సంగారెడ్డి: సంఘటితమై పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామ మహిళలు (స్వయం సహాయక బృందం) తయారు చేస్తున్న గానుగ (కోల్డ్ ప్రెస్డ్) వంటనూనెలను జపాన్‌కు ఎగుమతి చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గొంగ్లూర్ గ్రామానికి చెందిన 126 మంది మహిళలు నడుపుతున్న సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న గానుగ వంటనూనెల నమూనాలను ఇటీవల నాణ్యతా పరీక్షలకు తీసుకెళ్లిన జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) వాటి ఫలితాలపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయా నూనెల ఎగుమతికి వీలుగా సర్వోదయ సంస్థ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. నూనెలు.. చేతితో చేసిన సబ్బులు.. శుద్ధిచేసిన పప్పు దినుసులు ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు వైద్యుల సహకారంతో గ్రామంలో పలు రకాల కుటీర పరి శ్రమలను స్థాపించారు. అందులో ఒకటైన సర్వోదయ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాటేజ్ ఇండస్ట్రీస్... ‘సర్వోదయాస్ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన సబ్బులు, పప్పు దినుసుల ప్రాసెసింగ్‌తోపాటు సహజ పద్ధతుల్లో వంట నూనెలను తయారు చేస్తోంది. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనెలు, కుసుమ, కొబ్బరినూనెలను ఉత్పత్తి చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ సహకారం.. ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ తయారీ, నాణ్యతా పరీక్షలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని గొంగ్లూర్ మహిళలు గతంలో ఐఐటీ–హైదరాబాద్‌ను కోరారు. అందుకు అంగీకరించిన ఐఐటీ–హెచ్... భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంలో భాగంగా తమ క్యాంపస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీ) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఎస్ఐసీ ద్వారా ‘జెట్రో’ను సంప్రదించింది. ఐఐటీ–హెచ్, ఎస్ఐసీలు ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాయి. మరోవైపు పర్యావరణ అనుకూల పద్ధతుల్లో తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ తయారీకి తోడ్పాటు అందించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) హైదరాబాద్‌కు గొంగ్లూర్ మహిళలు విజ్ఞప్తి చేయగా ఆ సంస్థ సైతం అందుకు అంగీకారం తెలిపింది. కీలక ముందడుగు పడింది.. సర్వోదయ మంజీరా వంట నూనెల ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మేము పంపిన శాంపిల్‌ను పరిశీలించి దిగుమతి చేసుకోవాలని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సానుకూల నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎంవోయూ కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ప్రతినెలా 5 వేల లీటర్ల నూనెలను ఉత్పత్తి చేస్తున్నాం. ఎగుమతి ఆర్డర్ వస్తే ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌నాయక్, మంజీరా సర్వోదయ ఫౌండర్ తొలుత బెంగళూరుకు.. వంట నూనెల ఎగుమతులకు సంబంధించి జపాన్ సంస్థలు సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గొంగ్లూర్ మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ధర, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను ఆయా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన వంటనూనెలను తొలుత బెంగళూరులోని ‘జెట్రో’ గోదాములకు తరలించి అక్కడి నుంచి ఎగుమతి చేసే యోచనలో ఉన్నారు. జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు.. సర్వోదయ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థ ఇప్పటికే పలు జాతీయ సంస్థల నుంచి లైసెన్స్‌లు పొందింది. బహుళజాతి సంస్థలు తీసుకున్నట్లే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్), హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మెటిక్స్ ఉత్పత్తులకు ఆయూష్ విభాగం నుంచి కూడా లైసెన్స్ పొందింది. చదవండి: బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ కావాలా? చలో పోచారం.. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరండి.. -
రాజకీయ కుట్రలకు బలయ్యేది ఎవరు?
పుల్కల్: ఇక్కడ రాజకీయ కుట్రలు ఎవరిని బలి తీసుకుంటాయో తెలియడం లేదు. గ్రామాల్లో రాజకీయ కక్షల కారణంగా పరిస్థితులు ఆందోళనకరంగా తయారవుతున్నాయి. మండల పరిధిలోని గొంగ్లూర్ పంచాయతీకి సంబంధించిన బోర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడమే కాకుండా విద్యుత్ తీగలను స్టార్టర్ డబ్బాలకు తగిలిస్తున్నారు. ఈ దుశ్చర్యలతో పంచాయతీలో పని చేస్తున్న కార్మికుడు విద్యుత్‌షాక్ గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినా.. రాజకీయ కక్షలు చల్లారడం లేదు. దీంతో ఏకంగా విద్యార్థులు చదువుకునే పాఠశాల ఆవరణలోని బోరును టార్గెట్‌గా చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 25న గుర్తుతెలియని వ్యక్తులు గొంగ్లూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని విద్యుత్ బోర్‌మోటార్ స్టార్టర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. విద్యుత్ తీగలను కట్‌చేసి చిందరవందరగా చేశారు. బోర్ కేబుల్‌ను సైతం కత్తిరించి వదిలేశారు. దీన్ని గమనించిన విద్యార్థులు పరిస్థితిని ప్రధానోపాధ్యాయుడికి తెలిపారు. దీంతో ఆయన పాఠశాల ఆవరణలోని బోరును పరిశీలించారు. ఒకవేళ ఈ స్టార్టర్ డబ్బాను విద్యార్థులు ముట్టి ఉంటే పెనుప్రమాదం జరిగేంది. ఈ సంఘటనకు 5 రోజుల క్రితం గ్రామ పరిధిలోని మరో బోర్‌మోటార్‌కు సంబంధించిన స్టార్టర్ డబ్బాను ధ్వంసం చేశారు. విద్యుత్ స్తంభం నుంచి వచ్చే వైర్‌ను డబ్బాకు తగిలించారు. దీంతో వాటర్సప్లైలో పనిచేసే నర్సింలు అనే పంచాయతీ కార్మికుడు బోర్ను స్టాట్ చేసేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో స్థానికులు అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇలా గ్రామంలో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో పంచాయతీలో పనిచేసేందుకు కార్మికులు ఎవ్వరు ముందుకు రాలేకపోతున్నారు.