నగల దుకాణంలో చోరీకి విఫలయత్నం
జగిత్యాల అర్బన్ : పట్టణంలోని నడిబొడ్డున టవర్ ఏరియాలోని బాలాజీ జువెల్లరీ షాపులో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. లాకర్ తెరవకపోవడంతో ఎలాంటి సొమ్ము పోలేదు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బాలాజీ జువెల్లర్స్ యజమాని తిమ్మరాజు వెంకటస్వామి బుధవారం రాత్రి రోజూ లాగానే ఇంటికి వెళ్లే సమయంలో బంగారం తదితర వస్తువులు లాకర్లో పెట్టి షాపు మూసివేసి వెళ్లాడు.
దొంగలు షాపు పైకి ఎక్కి చెక్కలు ఊడదీసి లోపలికి వెళ్లారు. అందులో ఉన్న సామగ్రిని చెల్లాచెదరు చేశారు. లాకర్‌ను పగులగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. వెంకటస్వామి గురువారం ఉదయం షాపుకు వచి తెరిచి చూసేసరికి వస్తువులన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున దొంగలు చోరీకి యత్నించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.