breaking news
Global 2000
-
ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ‘గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిల్చింది. ఈ ఏడాది తొలినాళ్లలో రిలయన్స్ అధినేత సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లుగా లెక్కించాం. తద్వారా ఈ ఏడాది టాప్ బిలియనీర్ల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిల్చారు‘ అని వివరించింది. గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అగ్రస్థానంలో నిల్చింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది. సౌదీ ఆరామ్కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టులో చోటు దక్కించుకున్న ఇతర సంస్థలు.. ► ఓఎన్జీసీ (228 ర్యాంకు), హెచ్డీఎఫ్సీ (268), ఐఓసీ (357), టీసీఎస్ (384), టాటా స్టీల్ (407), యాక్సిస్ బ్యాంక్ (431) ఈ జాబితాలో ఉన్నాయి. ► అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు ఈసారి లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453 ర్యాంకు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570) అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ (1,746) వీటిలో ఉన్నాయి. అదానీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్‌ను అధిగమించి అయిదో స్థానం దక్కించుకున్నారు. ► చమురు, గ్యాస్, మెటల్స్ దిగ్గజం వేదాంత ఏకంగా 703 స్థానాలు ఎగబాకి 593వ ర్యాంకు దక్కించుకుంది. ► ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి. -
ఫోర్బ్స్ జాబితాలో మనవి 56 కంపెనీలు
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన, శక్తిమంతమైన 2,000 కంపెనీల జాబితాలో భారత్‌కి చెందిన 56 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. 2015 సంవత్సరానికి గాను ‘గ్లోబల్ 2000’ పేరిట ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ లిస్టును విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా, చైనా కంపెనీల ఆధిపత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఇది ఉంది. ఈ రెండు దేశాలకే చెందిన సంస్థలు వరుసగా రెండో ఏడాదీ టాప్ టెన్‌లో నిల్చాయి. మొత్తం 579 కంపెనీలతో అమెరికా, 232 భారీ సంస్థలతో చైనా వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. జపాన్ను చైనా అధిగమించడం ఇదే తొలిసారి. 218 కంపెనీలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే భారత్ లిస్టులో మరో రెండు కంపెనీలు కొత్తగా జతయ్యాయి. 42.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది 135వ స్థానంలో ఉండగా ఈసారి 142వ స్థానానికి తగ్గింది. 33 బిలియన్ డాలర్ల మార్కెట్ వేల్యూతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 152వ స్థానంలో ఉంది. ఓఎన్జీసీ (183), టాటా మోటార్స్ (263), ఐసీఐసీఐ బ్యాంక్ (283), ఇండియన్ ఆయిల్ (349) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.