breaking news
girijamma
-
సిగ్గుసిగ్గు..
అనంతపురం న్యూసిటీ: స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ మహిళాధ్యక్షురాలు బోయ గిరిజమ్మ విమర్శించారు. కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్వాడీ కార్యకర్తపై శనివారం జరిగిన దాడిని ఆమె ఖండించారు. అనంత సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె ఆదివారం కలిసి పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో దౌర్జన్యాలు, అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. పట్టపగలే అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచారయత్నానికి తెగబడడం సిగ్గు చేటన్నారు. ఘటనకు కారకుడైన టీడీపీ కార్యకర్తపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేకూరేవరకూ వైఎస్సార్ సీపీ తరుఫున పోరాటం సాగిస్తామని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు లక్ష్మి, పద్మ, రత్న, మణి, రామాంజినమ్మ, తదితరులున్నారు. కామాంధుడిపై చర్యలకు ఐద్వా డిమాండ్ అనంతపురం న్యూసిటీ: కనగానపల్లి మండలం తూంచర్ల గ్రామ అంగన్వాడీ కార్యకర్తపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఎస్పీకు ఆమె వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. గ్రామాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై బలమైన సెక్షన్లు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, నాయకురాలు వనజ, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్రయాదవ్ తదితరులున్నారు. అంతకు ముందు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలను వారు పరామర్శించి, జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఎస్సీని కలిసిన సీఐటీయూ నేతలు అనంతపురం రూరల్: కనగానపల్లి మండలం తూంచర్ల అంగన్వాడీ కార్యకర్తపై లైంగిక దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్త నాగరాజుపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్పీని వారు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తపై లైంగిక దాడికి ప్రయత్నించిన నాగరాజుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గోపాల్, కదిరప్ప, అంగన్వాడీ హెల్పర్ యూనియన్ నాయకురాళ్లు జమునా, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ బలవన్మరణం
కుందుర్పి (కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో గిరిజమ్మ(36) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు... మృతురాలి భర్త శ్రీనివాసులు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో చీటికీ మాటికి భార్యతో తరచూ గొడవపెట్టుకునేవాడు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ సోమవారం రాత్రి గొడవపడ్డాడు. దీంతో ఆమె ఇక భరించలేకపోయింది. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వంటగదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి, వెంటనే ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వివరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. గిరిజమ్మ మృతికి కారణమైన భర్త శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రీ బాధితురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
తవ్వేకొద్దీ నాణేలే
► కొట్టూరులో 90 కేజీలకు చేరిన పురాతన నాణేలు ► జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వైనం బళ్లారి: ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపీలో అమూల్యమైన మణులు-వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. హంపీకి దగ్గరలోనే ఉన్న కొట్టూరు పట్టణంలో పాతకాలం నాణేలు కుప్పలు కుప్పలుగా బయటపడుతుండడం అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 24న శ్రీకొట్టూరేశ్వరస్వామి మఠం సమీపంలోని గిరిజమ్మ అనే మహిళకు చెందిన పురాతన ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా సుమారు 25 కేజీల పురాతన నాణేలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాలు కూడా పాత ఇంటిని కూల్చుతుండగా పెద్ద సంఖ్యలో పురాతన నాణేల నిధి వెలుగుచూసింది. ప్రస్తుతం 90 కేజీల వరకు పురాతన నాణేలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్, సీఐ తనిఖీ తహసీల్దార్ కృష్ణమూర్తి, కొట్టూరు సీఐ రాజానాయక్ ఘటనాస్థలంలో పురాతన నాణేలను పరిశీలిస్తున్నారు. నాణేలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 1915–20వ సంవత్సరానికి చెందిన కాలంలో బ్రిటిషప్రభుత్వం ముద్రించినవిగా అధికారులు తెలిపారు. నాణేలపైన కింగ్ జార్జ్- ఫోర్త్ అనే అక్షరాలతో పాటు బ్రిటన్ రాజు చిత్రం ఉంది. వాటిపై అణా పైసలు, దమ్మిడీలు అనే పదాలు కన్పిస్తున్నాయి. ఆ ఇంటి పూర్వీకులే గోడలు, పునాదుల్లో దాచి ఉంటారని భావిస్తున్నారు. తవ్వకాలు జరిగేకొద్దీ మరిన్ని నాణేలు బయటపడవచ్చని చెబుతుననారు. -
ప్రేమపాఠం
తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాల్సొస్తున్న రోజులివి. పెళ్లయిన తర్వాత కూడా అమ్మానాన్నలను... మీ దగ్గరే ఉంచుకోండి అని నివేదించవలసి వస్తున్న రోజులివి. మనకోసం చేసుకున్నది వాళ్లకు పెట్టడం కాకుండా, ప్రత్యేకంగా వాళ్ల కోసమే వండిపెట్టమని అభ్యర్థించాల్సి వస్తున్న రోజులివి. మన పిల్లల్ని చూసుకోవడానికి కాకుండా, మనం వాళ్లని పిల్లలుగా ప్రేమించాలని ప్రాధేయపడాల్సి వస్తున్న రోజులివి. ఇంతగా... ఇన్నిసార్లు... ఇన్ని రకాలుగా... పెద్దలను చూసుకోమని చెప్పే బదులు ఈ అమ్మ కథ మీకు చూపిస్తే బాగుంటుందనిపించింది. చూశారా! 65 ఏళ్ల గిరిజమ్మ... 75 ఏళ్ల భర్తను, 25 ఏళ్ల కూతుర్ని, 35 ఏళ్ల కొడుకును ఇంకా పసిపిల్లల్లా సాకుతూ ఉంది! అయినా ఒక్కసారైనా ఇది కష్టమని చెప్పుకోవడం లేదు. అదృష్టంగానే భావిస్తోంది. ఏదో మీలాంటి మారాజులెవరైనా ఆ పిల్లలకు వచ్చిన జబ్బు నయం చేసే సాయం ఏమైనా చేస్తారేమో అని ఎదురుచూస్తోంది. అంతే... వాళ్లని పెంచడం కష్టమని మాత్రం చెప్పుకోవడం లేదు. మీ తల్లిదండ్రులు ఈ తల్లి కంటే ఏమాత్రం తక్కువ కాదు. వాళ్ల గుండెల్లో కూడా మీ పట్ల అంతే ప్రేమ ఉంటుంది. గిరిజమ్మ తన పిల్లల్ని చూసుకున్నట్లు... మన అమ్మని మనం అలా చూసుకుంటే... జన్మ ధన్యం. వృద్ధులైన తల్లిదండ్రులను వీధుల పాలు చేసే బిడ్డలున్న ఈ లోకంలోనే.. బిడ్డలకు ఎంత వయసొచ్చినా తల్లికి భారం కాదని చాటి చెబుతున్న ఓ అమ్మ... గిరిజమ్మ కథ ఇది. అనంతపురం జిల్లా అగళి మండలంలోని ఓ మారుమూల గ్రామం ముత్తేపల్లి. ఈ గ్రామానికి చెందిన గిరిజమ్మ ఓ నిరుపేద. వయసు 65 దాటింది. ఆమెకన్నా పదేళ్లు పెద్దవాడైన ఆమె భర్త పేరు దాసప్ప. వీరి కుటుంబాన్ని ఓ వింత వ్యాధి ఏళ్లకేళ్లుగా నరకయాతన పెడుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు సంతానానికీ నరకయాతన చూపించింది. ఇప్పటికే నల్గురిని మింగేసిన ఆ జబ్బు, మరో ఇద్దరిని జీవచ్ఛవాలుగా మిగిల్చింది. యాభై ఏళ్ల క్రితం... ముత్తేపల్లి గ్రామంలో దాసప్ప, గిరిజమ్మలు ఉన్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. వారికి తొలి సంతానంగా మగపిల్లవాడు, ఆ తర్వాత ఆడపిల్ల పుట్టారు. పుట్టిన పిల్లలు చక్కగా ఎదుగుతుంటే తమ జీవితాలకు ఏ ఢోకాలేదనుకున్నారు. కానీ, కక్షకట్టినట్టుగా విధి వారి జీవితాలను ఓ అగాధంలోకి తోసేసింది. ‘‘పెళ్లయిన రెండేళ్లకే మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత ఆడిపిల్ల పుట్టింది. ఎనిమిదేళ్ల వయసు వరకు అందరిలాగే బుడి బుడి నడకలతో సంతోషంగా ఆరోగ్యంగానే ఉన్నారు. తొమ్మిదేళ్లు వచ్చేసరికి అదేం రోగమో.. కాళ్లూ చేతులు చచ్చుబడి పోయాయి. తుమ్కూరు తీసుకెళ్లాం. బెంగుళూరు ఆసుపత్రిలో చూపించాం. ఏవో మందులు రాశారు.. అయినా ప్రయోజనం లేదు. మాయదారి రోగం వారిని గడపదాటనివ్వలేదు. ఎముకలగూడులై ఆ పిల్లలు కన్నుమూశారు. ఆ తర్వాత ఆరేళ్లలో మరో నలుగురు పిల్లలు కలిగారు. మిగిలిన పిల్లలైనా బాగుంటే అంతే చాలని, మొక్కని దేవుడు లేడు. కానీ, ఏ దేవుడూ కనికరించలేదు. ఎనిమిదేళ్లు నిండుతాయనగా వారూ వరుసగా మంచం పట్టారు. శరీరాలు ఎముకల గూళ్ళల్లా మారాయి. ఏళ్లు వచ్చినా అందరికీ మంచమ్మీదే అన్ని పనులూ చేసేదాన్ని. ఎందుకీ కష్టం అని ఏడ్వని రోజు లేదు. కానీ, దేవుడిచ్చిన కష్టం.. ఏం చేయను. అందరు పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే.. నా పిల్లలే ఇలా...’’ అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఏడ్చేసింది గిరిజమ్మ. ‘‘ఆస్తులు లేకపోయినా, రెక్కల కష్టమ్మీద బతికే మేం పిల్లలకు వచ్చిన ఈ రోగాన్ని నయం చేయించడానికి చేతనైనన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లాం. వెళ్లిన చోటల్లా డాక్టర్లు మందులు రాసిచ్చారు. చెప్పిన ట్టల్లా వాడాం. ఉన్న కాస్త పొలం ఎప్పుడో కరిగిపోయింది. కానీ, ఆరోగ్యం మాత్రం బాగుకాలేదు. రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ తలో ముద్ద తినలేం. అలాంటిది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఎక్కడ చూపించేది?! ఈ అమ్మకు భారమనుకున్నారో, దేవుడే కరుణించాడో తెలియదు (కన్నీటిని తుడుచుకుంటూ...) మరో ఇద్దరు పిల్లలు ఈ మాయదారి రోగంతోనే చనిపోయారు’’ అని గిరిజమ్మ వివరించింది. గడపదాటలేదు... ‘‘కెంచమ్మ (ఇప్పుడున్న బిడ్డ. చేత్తో ఆమె తలనిమురుతూ) కు పాతికేళ్లు దాటాయి. ఓబులప్ప(కుమారుడు) కు 35కు పైనే ఉన్నాయి. ఇంకా పసిపిల్లలల్లాగే.. ఒంటేలుకు తీసుకుపోవాలి. స్నానం చేయించాలి. ఒంటిమీద ఎక్కడైనా చీమ కుట్టినా రుద్దుకోలేరు. అంత పసిపిల్లలు. అందుకే, కళ్లలో పెట్టి చూసుకుంటున్నా.. దాదాపు 50 ఏళ్లుగా ఈ ఇంట్లోనే.. పిల్లలతో పాటు నేనూ మా ఆయన. మంచైనా చెడైనా బంధువుల ఇళ్లకు వెళ్లింది లేదు. పిల్లలకు ఏ అవసరమొస్తదో తెలియదు. పిల్లలే కాదు నేనూ పదేళ్ల క్రిందటి దాకా ఈ ఇంటి గడపదాటలేదయ్యా! మా తర్వాత ఎవరు... కడుపున పుట్టిన పిల్లలకు ఎన్నేళ్లు వచ్చినా తల్లికి భారం కారయ్యా! దేముడికి సేవ చేస్తున్నట్టుగా చేస్తున్నా, అది నా అదృష్టమే. కానీ, మా ఆయన (దాసప్ప) ముసలోడయ్యాడు. కూలికి వెళ్లేటంత సత్తువ ఆయనలో లేదు. అందుకే, పిల్లలను చూసుకోవటానికి మా ముసలాయన్ను ఉంచి నేనే కూలి పనులకు పోతున్నా. పొద్దున్నే లేచి, ఇంటి పనులు చూసుకొని, పిల్లలకు ముఖాలు కడిగి, స్నానాలు చేయించి, ఇంత తినిపించి కూలికి వెళతా! పింఛన్ డబ్బులతో, కూలి చేసి ఈ సంసారాన్ని నెట్టుకొస్తున్నా. కానీ, వయసు మీద పడటం వల్లనేమో ఈ మధ్య నడుం నొప్పి విపరీతంగా బాధిస్తోందయ్యా! నా పిల్లలకు బుక్కెడు తిండి పెట్టడానికి ఈ వయసులో పడరాని పాట్లు పడుతున్నాను. నా బాధల్లా ఒక్కటే! మా ముసలోడు, నేను సచ్చిపోతే మా పిల్లలకు దిక్కెవరయ్యా! ఆళ్లనెవరు చూసుకుంటారు? ఇప్పుడే పిల్లలకు ఏదైనా దారి దొరికితే అంతే చాలని కనపడని దేవుళ్లకల్లా మొక్కుతున్నానయ్యా!’’ అంటూ పొంగుకు వస్తున్న దుఃఖం ఆపుకోలేక వలవల ఏడ్చేసింది గిరిజమ్మ. వీరి ఆవేదన వింటున్నంతసేపు, వారి పిల్లలను చూస్తున్నంతసేపూ ఎవరి కళ్లయినా చెమర్చుతూనే ఉంటాయి. తన తర్వాత పిల్లల గతి ఏమిటని గిరిజమ్మ ఆవేదన. తన కష్టాన్నే అదృష్టంగా భావిస్తూ పిల్లలకు సేవ చేస్తున్న ఈ వృద్ధురాలి భారం దిగేదెన్నడు. ఆ భారాన్ని దించేదెవరు? ఈ పెద్దపిల్లల కష్టాన్ని పెద్ద మనసుతో తీర్చేదెవ్వరు? మనసున్న మారాజులు తమ పిల్లలకు వైద్యం చేయించి ఆదుకుంటే జన్మజన్మలకు రుణపడి ఉంటాం అని రెండుచేతులూ ఎత్తి మొక్కుతోంది గిరిజమ్మ. - గుంటి మురళీకృష్ణ, సాక్షి, అనంతపురం