breaking news
G-sat
-
ఇస్రో ‘బిగ్ బర్డ్’ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహమైన జీశాట్–11 ప్రయోగం బుధవారం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌స్పేస్ సంస్థకు చెందిన ఏరియన్–5వీఏ246 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్–11ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బుధవారం తెల్లవారుజామున 2.07 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్ నింగికి దూసుకెళ్లగా 33 నిమిషాల్లో జీశాట్–11ను కక్ష్యలోకి చేర్చింది. 5,854 కిలోల బరువు ఉన్న జీశాట్–11, ఇప్పటివరకు ఇస్రో తయారు చేసిన అన్ని ఉపగ్రహాల్లోకెల్లా అత్యంత బరువైనది. అందుకే దీనిని ‘బిగ్ బర్డ్’ (పెద్ద పక్షి) అని పిలుస్తున్నారు. భారత్‌కు అత్యంత ధనిక అంతరిక్ష ఆస్తిగా జీశాట్–11 ఉంటుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. జీశాట్–11 కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం (ఎంసీఎప్) శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకుని అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. ఇస్రో చరిత్రలో జీశాట్ సిరీస్‌లో ఐదు టన్నుల పైబడి బరువు కలిగిన ఉపగ్రహాన్ని తయారు చేసి పంపించడం ఇదే మొదటి సారి. గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగలిగే సామర్థ్యం ఉన్న రాకెట్లే ప్రస్తుతం ఇస్రో వద్ద ఉన్నాయి. అందుకే జీశాట్–11ను ఫ్రాన్స్ నుంచి ప్రయోగించారు. జీశాట్ సిరీస్‌లో ఇది 34వ ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. కొరియాకు చెందిన మరో ఉపగ్రహాన్ని కూడా ఇదే రాకెట్ ద్వారా ఏరియన్‌స్పేస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ బెంగళూరులో యూఆర్‌రావు శాటిలైట్ స్పేస్ సెంటర్లో సుమారు రూ.600 కోట్లు వ్యయంతో జీశాట్–11ను తయారు చేశారు. తొలుత ఈ ఏడాది మే 25న ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేసినప్పటికీ ఉపగ్రహంలోని లోపాలను రెండ్రోజుల ముందు గుర్తించడంతో ప్రయోగం వాయిదా పడింది. దీనిపై అధ్యయనం చేయగా ఈ ఉపగ్రహంలో జీశాట్ 6ఏలో ఉపయోగించిన సిగ్నల్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థలు వాడారని తేలింది. జీశాట్–11లో 40 కేయూ, కేఏ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లును అమర్చారు. ఈ ప్రయోగంతో 14 జిగాబైట్స్ ఇంటర్నెట్ ప్రీక్వెన్సీ అందుబాటులోకి రావడమే కాకుండా 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుంది. కుగ్రామాలకూ 100 ఎంబీపీఎస్ స్పీడ్ 2019 చివరికల్లా కుగ్రామాలకూ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందుకోసం తాజా జీశాట్–11తో కలిపి మూడు ఉపగ్రహాలను ఇప్పటికే అంతరిక్షంలోకి పంపామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందించాలనే ఉద్దేశంతో నాలుగు అతి పెద్ద సమాచార ఉపగ్రహాల్లో జీశాట్–11 ప్రయోగంతో మూడు ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలోకి పంపించామన్నారు. ఇందులో గతేడాది జూన్ 5న జీఎస్‌ఎఎల్‌వీ మార్క్3డీ1 ద్వారా జీశాట్–19, ఈ ఏడాది గత నెల 14న జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 ద్వారా జీశాట్–29ను ప్రయోగాలను స్వదేశీ రాకెట్లు ద్వారా ప్రయోగించిన విషయం తెలిసిందే. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడు రావాలంటే జీశాట్–20 అనే ఉపగ్రహం అవసరం ఉందని, దీన్ని 2019 సెప్టెంబర్‌లో ప్రయోగిస్తామన్నారు. -
నేడు జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో కీలక ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు జీశాట్-14 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ(జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)-డీ5 రాకెట్ నింగికి దూసుకుపోనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగానికి 29 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 11.18 గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కౌంట్‌డౌన్ సమయంలో శనివారం జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ రెండో దశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. రాకెట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ప్రయోగానికి ఆరు గంటల ముందు అప్రమత్తం చేస్తారు. ఈ ప్రయోగాన్ని గతేడాది ఆగస్టు 19ననే చేపట్టాల్సి ఉండగా.. రాకెట్ రెండో దశలో ఇంధన లీకేజీ కారణంగా ఆఖరి గంటలో వాయిదా పడింది. ఇస్రో ఇంతవరకూ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టగా.. రెండే విజయవంతం అయ్యాయి. జీఎస్ఎల్వీ రాకెట్లో కీలక దశ అయిన అప్పర్ క్రయోజెనిక్ దశను ఇస్రో స్వదేశీయంగానే తయారుచేసింది. షార్‌లో కౌంట్‌డౌన్ ప్రక్రియను శనివారం సాయంత్రం ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ పరిశీలించారు. ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులు ఆదివారం చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు. ప్రత్యేకతలు ఇవే... జీఎస్ఎల్వీ డీ5 పొడవు: 49.13 మీటర్లు బరువు: 414.75 టన్నులు ప్రయోగం ఖర్చు: రూ.205 కోట్లు (రాకెట్‌కు రూ.160 కోట్లు, ఉపగ్రహానికి రూ.45 కోట్లు) జీశాట్-14 బరువు:1,982 కిలోలు పనిచేసే కాలం: 12 ఏళ్లు