చిన్నాన్నే హంతకుడు
- ఎనిమిదేళ్ల ఫ్రాన్సిస్కో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
- కుటుంబ తగాదాలే హత్యకు కారణం
సాక్షి, ముంబై: గత సోమవారం బడికెళ్లి అదృశ్యమైన ఎనిమిదేళ్ల బాలిక శుక్రవారం శవమై తేలింది. హంతకుడు ఆ బాలిక చిన్నమ్మ భర్త కావడంతో ఇన్ని రోజులు ఎవరికి అనుమానం రాలేదు. గత నాలుగైదు రోజులుగా నాటకీయంగా మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. నవీ ముంబై ఐరోలి సెక్టర్ నంబరు-8, ఏకవీర దర్శన్ సొసైటీలో నివాసముంటున్న ఫ్రాన్షేలా సోఫియా ఫ్రాన్సిస్కో (8), న్యూ హోరైజన్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం బడికెళ్లిన ఫ్రాన్షేలా సాయంత్రం ఏడు గంటలైనా ఇంటికి రాలేదు. సొసైటీ బయట స్కూల్ బస్సు దిగిన ఫ్రాన్షేలా అక్కడే ఆగిన కారులో ఉన్న వ్యక్తితో చాలా సేపు మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాని కారులో ఉన్నది ఎవరనేది తెలియకపోవడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంట్లో పనిచేసి మానేసిన పనిమనిషిపై అనుమానం వ చ్చి, ఆమెపై దృష్టి సారించినా ఆధారాలు రాబట్టలేకపోయారు. తర్వాత సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. అపహరణకు గురైన రోజు సాయంత్రం ఓ వ్యక్తి 2 నిమిషాల్లో అపార్టుమెంట్లోకి వచ్చి వెళ్లినట్లు కనిపించింది. ఆయన నా చెల్లెలు భర్త క్లారెన్స్ అని ఫ్రాన్షేలా తల్లి చెప్పింది.
దీంతో అతనిపై పోలీసులకు అనుమానం రాలేదు. కాని అతని ఫోన్ లొకేషన్ గుర్తించగా సోమవారం సాయంత్రం మీరారోడ్-ఘోడ్‌బందర్ నిర్మాణుష్య ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. అతడు నిర్మాణుష్య ప్రాంతానికి ఎందుకెళ్లినట్లు, 2 నిమిషాల కోసం అపార్టుమెంట్లోకి ఎందుకు వచ్చి వెళ్లినట్లు.. అని పోలీసులు అనుమానించారు. దీంతో పోలీసులు క్లారెన్స్‌ను పిలిపించి విచారించగా, కుటుంబ తగాదాల వల్ల తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. సోమవారం రాత్రే గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పాడు. శుక్రవారం ఉదయం పోలీసులు ఘోడ్‌బందర్ పరిసరాల్లోంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు. బాలిక ఒంటిపై గాయాలైన గుర్తులున్నాయి. హత్యాచారం జరిగిందా? అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కూతురు అపహరణకు గుైరె నట్లు తెలియగానే విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రాన్షేలా తండ్రి, తన కూతురుని తోడళ్లుడే హతమారుస్తాడని కలలో కూడా ఊహించుకోలేదని కంటతడి పెడుతూ అన్నాడు.