తెలంగాణ-ఒడిశా జాయింట్ ఆపరేషన్‌లో ఉగ్రవాదుల అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ-ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో సిమీ(స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదుల ఆటకట్టించారు. ఒడిశాలోని రూర్కెలాలో నలుగురి ఉగ్రవాదులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిమీకు చెందిన అమ్జాద్, జకీర్, మోహబూబ్, సాలిఖ్ లుగా గుర్తించారు.
బుధవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. దాడులను గుర్తించిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. అలర్ట్ అయిన పోలీసులు వారి దాడిని తిప్పికొట్టారు. వారి నుంచి 5 తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల అరెస్ట్‌ను ఒడిశా డీజీపీ కన్వర్ బ్రజేష్ సింగ్ నిర్థారించారు. గత ఐదు నెలలుగా రూర్కెలా స్టీట్ సిటీలో ఉగ్రవాదులు నివాసం ఉంటున్నట్లు చెప్పారు.
మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి 2013 అక్టోబర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు పరారయ్యారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారు. తెలంగాణ-ఒడిశా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులు ఎజాజుద్దీన్, అస్లాంలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. తాజా ఘటనతో స్థానికులు తీవ్ర భయందోళనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రాంతంలో విచారించేందుకు తరలించారు. జాయింట్ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందించారు.