breaking news
Fisheries Federation
-
క్షమాపణలు చెప్పేందుకు మంత్రి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తన మాటలతో గంగపుత్రుల మనసు బాధించి ఉంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గంగపుత్రులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో మంత్రి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న కోకాపేటలో ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముదిరాజ్‌లను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడానే తప్ప ఎవరినీ బాధ పెట్టే విధంగా ప్రసంగించలేదని సంఘం ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి చర్య లు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. -
చేప ప్రసాదం సర్వం సిద్ధం
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ మైదానం సిద్ధమైంది. నేడు, రేపు(8,9 తేదీల్లో) జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు పూర్తి చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ ముఖేశ్ కుమార్ మీనా ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చేపప్రసాదం కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లక్ష చేప పిల్లలు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగనున్న చేప ప్రసాదం పంపిణీకి లక్ష చేప పిల్లలను అందుబాటులో ఉంచనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అవసరమయితే మరిన్ని చేపపిల్లలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చేప పిల్లలను ఆదివారం ఉదయంలోపు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలించేం దుకు ఏర్పాట్లు చేశామన్నారు. ‘ప్రసాదం’ పంపిణీ కోసం 32 కౌంటర్లను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఫిషరీస్ ఫెడరేషన్ ద్వారా ఒక్కో చేప పిల్లను రూ.15లకు విక్రయించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా... చేప ప్రసాదం స్వీకరించేందుకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆస్తమా వ్యాధిగ్రస్తులు శుక్రవారం రాత్రే నగరానికి చేరుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బస చేస్తున్న వీరికి స్థానిక స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మూడు లక్షల మందికి ప్రసాదం : హరినాథ్‌గౌడ్ గతేడాది రెండు లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశాం. ఈ సంవత్సరం మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో చేప ప్రసాదం సిద్ధం చేస్తున్నాం. 8వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు చేప ప్రసాద పంపిణీ ప్రారంభమవుతుంది. 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. అప్పటికీ చేప ప్రసాదం అందలేని వారికి కవాడిగూడలోని మా స్వగృహంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తాం. వెయ్యిమందితో బందోబస్తు చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అబిడ్స్ ఏసీపీ జైపాల్ తెలిపారు. సుమారు వెయ్యి మంది సిబ్బందితో కలిసి ఎగ్జిబిషన్ మైదానంలో బందోబస్తును పర్యవేక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రసాదం తయారీ షురూ..! చార్మినార్, న్యూస్‌లైన్: చేప ప్రసాదం పంపిణీలో భాగంగా శనివారం బత్తిని కుటుంబ సభ్యులు పాతబస్తీ దూద్‌బౌలీలోని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామివ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వ్రతం పూర్తి చేశారు. అనంతరం 2.30 గంటలకు బావిపూజ చేశారు. పూజా కార్యక్రమాల్లో బత్తిని హరినాథ్‌గౌడ్, విశ్వనాథ్‌గౌడ్, దుర్గాశంకర్ గౌడ్, గౌరీశంకర్‌గౌడ్, శివానంద్ గౌడ్, నందుగౌడ్, సంతోష్‌గౌడ్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రసాదం తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద వితరణ సాయంత్రం 4.30కి దూద్‌బౌలీలో మొదటగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 5.20 గంటలకు ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ మైదానానికి తరలిస్తారు. నేడు ఉచిత ఆహార పదార్థాల పంపిణీ... ఏపీ బసవ కేంద్రం, హైదరాబాద్, ఏపీ రాష్ట్రీయ బసవ దళ్ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం తీసుకోవడానికి వ చ్చే వారందరికి ఉచితంగా ఆహార పదార్థాలను అందిస్తున్నామని ఏపీ బసవ కేంద్రం అధ్యక్షులు నాగ్నాథ్ మాశెట్టి, బసవ దళ్ అధ్యక్షులు ధన్‌రాజ్ జీర్గే తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టీ, బిస్కెట్లు, 11 గంటల నుంచి పూరీ, పులి హోర తదితర ఆహార పదార్థాలను ఉచితంగా అందిస్తామన్నారు.