breaking news
first polling
-
నాలుగు నెలలు... 68 దశలు
2019 లోక్సభ ఎన్నికలు రెండు నెలల పాటు ఏడు దశల్లో జరుగుతున్నాయంటేనే ..అబ్బో..అంత టైమా...అనుకుంటున్నాం. అయితే, మన దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఏకంగా 68 దశల్లో నాలుగు నెలల పాటు జరిగాయి. 1951 అక్టోబరు నుంచి 1952,ఫిబ్రవరి వరకు ఆ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3000 సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజలకు చెప్పారు. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశంలో 85శాతం ప్రజలు నిరక్షరాస్యులు. అప్పుడున్న 40కోట్ల జనాభాలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వచ్చు. దాంతో ఓటర్లు రాజకీయ పార్టీల పేర్లను, అభ్యర్థ్ధుల పేర్లను చదవడం, గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించిన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించాలని నిర్ణయించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి నాగలి దున్నుతున్న జోడెద్దుల గుర్తు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ చిహ్నమైన హస్తం మొదటి ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్( నేతాజీ సుభాష్ చంద్రబోస్పార్టీ) పార్టీకి దక్కింది. ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేయడానికి 16వేల మందికిపైగా సిబ్బంది ఆరు నెలల పాటు ఇల్లిల్లూ తిరిగారు. తీరా ఓటర్ల జాబితా తయారయ్యాక పేరు లేని కారణంగా 28 లక్షల ఓటర్ల పేర్లను తొలగించాల్సి వచ్చింది. అప్పట్లో మహిళలు బయటివారికి తమ పేరు చెప్పేవారు కాదు. ఫలానా వారి భార్యననో, కూతురిననో, చెల్లెలిననో చెప్పడంతో సిబ్బంది అలాగే రాసుకోక తప్పలేదు. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు,అభ్యర్థులకు ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. నెహ్రూ వంటి నేతలు బహిరంగ సభలు పెట్టి ఓట్లు అడిగేవారు.కొందరు ఇళ్లకు వెళ్లి అభ్యర్థించేవారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ రోడ్లమీద తిరిగే ఆవుల ఒంటిపై ‘కాంగ్రెస్కు ఓటెయ్యండి’అని రాసేవారు. ఆ ఆవుల్ని ప్రజలు ఆసక్తిగా ఉత్సుకతతో చూసేవారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖుల్లో అంబేడ్కర్ ఒకరు. ఎస్సిలకు కేటాయించిన ఉత్తర మధ్య బొంబాయి నియోజకవర్గం నుంచి అంబేడ్కర్ పోటీ చేసి ఓడిపోయారు. -
తొలి మజిలీ మేడారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘మేడారంతో నాకు గొప్ప అనుబంధముంది. నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడే. 2012 జాతర సమయంలో ములుగులో సబ్ కలెక్టర్గా ఉన్నాను. అందుకే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. వరుసగా రెండోసారి జాతరలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది. ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా డిసెంబర్ వరకు వరంగల్లోనే ఉన్నాను. మేడారం యాక్షన్ ప్లాన్ అప్పుడే సిద్ధమైంది. ఈసారి జాతర ఏర్పాట్లు, అవసరమైన ప్రతిపాదనలన్నీ నేను సిద్ధం చేశాను. గతంతో పోలిస్తే భక్తులు ఇబ్బంది పడకుండా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు నావంతు ప్రయత్నం చేశాను. వరుసగా రెండుసార్లు జాతర నిర్వహణలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది. బుధవారం ఉదయమే అక్కడికి వెళ్లాను. ఈ రోజు సాయంత్రమే తిరిగి వచ్చాను...’ అంటూ జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మేడారం గిరిజన మేళా విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘ఇంత పెద్ద జాతర నేనెప్పుడూ చూడలేదు. దేశంలో కుంభమేళా తర్వాత ఇదే పెద్ద జాతర. అలహాబాద్ సిటీ కావటంతో కుంభమేళాకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు కల్పించటం ఇబ్బందేమీ కాదు. కానీ.. అటవీ ప్రాంతంలో మారుమూలన ఉన్న మేడారంకు తరలివచ్చే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించటం అధికారులందరికీ పెద్ద టాస్క్. వన దేవతలకు మొక్కులు చెల్లించేందుకు ఎడ్ల బండ్లు, బస్సులు, ఇతరత్రా వాహనాల్లో వివిధ ప్రాంతాల నుంచే వచ్చే భక్తులు తరలిరావటం గొప్ప అనుభూతి. వారందరికి ఇంట్లో ఉన్నట్లుగా సదుపాయాలు కల్పించకలేకపోయాని... కనీసం సాఫీగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తే ఎంతో మేలు చేసినట్లే. అదే కర్తవ్యంతో పని చేశాను. గత జాతరతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీలో పెద్ద తేడా కనిపించలేదు. గత జాతర అనుభవాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయటంతో ఈసారి బడ్జెట్టు కూడా ఎక్కువగానే వచ్చింది. గత జాతరకు రూ.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.100 కోట్లు విడుదల చేసింది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. జాతర ఏర్పాట్లు దగ్గరుండీ పర్యవేక్షించే అవకాశం రావటం ఆనందంగా భావించాను..’