breaking news
first cm
-
కీలక రాష్ట్రానికి తొలి మహిళా సీఎం
శ్రీనగర్: శాంతిభద్రతలు, రక్షణ అంశాల పరంగా దేశంలోనే అత్యంత కీలకమైన రాష్ట్రమది. పలు దేశాలతో సరిహద్దులు పంచుకుంటూ, మరే రాష్టరంలోనూ లేని విధంగా 370 ఆర్టికల్ అమలవుతున్న జమ్ము కశ్మీర్ కు మొదటిసారి ఓ మహిళ ముఖ్యమంత్రి కానుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో జయలలిత, రాజస్థాన్ లో వసుంధరా రాజే, పశ్చిమ బెంగాల్ లో మమతల మాదిరి జమ్ముకశ్మీర్ లోనూ మొదటిసారి సీఎం పీఠాన్ని మహిళామని అధిష్ఠించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహమూద్ సయీద్ గురువారం అనారోగ్యంతో అకాలమరణం చెందడంతో పీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న ఆయన తనయ, ప్రస్తుత ఎంపీ మెహబూబా ముఫ్థీ(56) అత్యున్నత పదవిని అలంకరించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. జమ్ములోని షేర్ ఇ కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా కార్యక్రమం జరుగుతుందని, అయితే ముఫ్తీ కుటుంబం విషాదంలో ఉన్నందున కొద్ది రోజుల తర్వాతే ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 80 ఏళ్ల వయసులో తాను చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేక పోతున్నానని, తన వారసురాలిగా మెహబూబాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని దివంగత మహమూద్ గతంలోనే పార్టీకి సూచించారు. పీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవించడంతో మోహబూబా పదవీస్వీకారానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఆమెను సీఎంగా ఆమోదిస్తూ ఎమ్మెల్యేలు గురువారమే రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోరాకు ఒక లేఖను సమర్పించారు. అటు బీజేపీ కూడా మెహబూబా ఎన్నికపై సానుకూలంగా స్పందించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేతలు ముజఫర్ హుస్సేన్ బేగ్, అల్తాఫ్ బుఖార్ గవర్నర్కు లేఖను అందించారు. ముఖ్యమంత్రిగా మెహబూబ్ సరైన వ్యక్తిగా తాము భావిస్తున్నామని ఆమె ఎన్నిక పట్ల తమకు అభ్యంతరం లేదని బీజేపే తేల్చిచెప్పింది. మోహబూబా పర్సనల్ టచ్.. పూర్తిపేరు: మోహబూబా ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ పుట్టిన తేది: 22-05-1959 (ప్రస్తుతం 56 ఏళ్లు) చదువు: ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ నుంచి బీఏ, ఎల్ఎల్ బి వైవాహిక స్థితి: పూర్తి కాలాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలనుకున్న మోహబూబా.. చాలా కాలం కిందటే భర్త జావేద్ ఇఖ్బాల్ కు విడాకులిచ్చారు. సంతానం: ఇద్దరు కూతుళ్లు. ఇర్తికా ఇఖ్బాల్, ఇల్తిజా ఇఖ్బాల్. పార్టీలో ప్రస్తుత స్థానం: జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు -
తాత్కాలింగా గవర్నర్ రూల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(56) బాధ్యతలను స్వీకరించే కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది. గురువారం కన్నుమూసిన ముఖ్యమంత్రి, ఆమె తండ్రి మొహమ్మద్ సయీద్ నాలుగవ రోజు కర్మకాండ (చౌహరం) కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు జనవరి 10 ఆదివారం నిర్వహించునున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అప్పటివరకు అధికారిక వ్యవహారాల్లో పాల్గొనడానికి ఆమె విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోరా అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ప్రస్తుతం ముఫ్తీ కుటుంబం ఉందని, ఇపుడు ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడలేమని పీడీపీ పార్టీ సీనియర్ నేత తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను తాత్కాలికంగా గవర్నర్ ఎన్ ఎన్ వోరా నిర్వహిస్తారని చెప్పారు. రాజ్యాంగ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను మెహబూబా ముఫ్తీ దృష్టికి తీసుకెళ్లినపుడు వాటిని కూడా ఆమె తోసి పుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పెద్దలు ఆమెకు సూచించారు. కాగా రాష్ట్ర సీఎం ముప్తీ మహమ్మద్ సయూద్ నిన్న అనారోగ్యంతో కన్నమూయడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన కుమార్తె, అనంతనాగ్ ఎంపీ, మెహబూబా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు బీజేపీ- పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.