నూతన కార్యాలయాలకు ఫర్నిచర్ కొనుగోలు
ఫైల్స్ అప్లోడింగ్ పూర్తి చేయండి
కలెక్టర్ నీతూప్రసాద్
ముకరంపుర : కొత్త జిల్లాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన ఫర్నిచర్, ఏసీ తదితర పరికరాలను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ కొనుగోలు చేస్తుందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షించారు. వివిధ శాఖలు జగిత్యాల, పెద్దపల్లిలో తమకు కేటాయించిన కార్యాలయ భవనాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ప్రతి శాఖ కొత్త జిల్లాకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్స్ తదితర వివరాలను ఇవ్వాలని కోరారు. తమ వద్దనున్న ఫర్నిచర్‌ను జగిత్యాల, పెద్దపల్లిలకు కేటాయించాలని తెలిపారు. నిధులు ఉన్న శాఖలు నూతన కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్‌ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కామన్ ఫైల్స్ స్కానింగ్ వేగవంతం చేయాలన్నారు. అన్ని శాఖలు తమ కార్యాలయంలోని ఫైల్స్‌ను వెంటనే అప్లోడింగ్ పూర్తి చేయాలన్నారు. జగిత్యాల కలెక్టరేట్ భవన మరమ్మతులకు ఇతర సదుపాయాలకు రూ.45 లక్షలు, పెద్దపల్లి భవన మరమ్మత్తు పనులకు రూ.41 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రెండు ప్రాంతాలలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపడతారన్నారు. సంబంధిత సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. నూతన భవనాల కేటాయింపు ప్రొసీడింగు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. కొత్త జిల్లాలో నూతన బ్యాంకు ఖాతాలు అక్టోబర్ 5లోగా తెరవాలని అధికారులను ఆదేశించారు. ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, జిల్లా అధికారులున్నారు.