breaking news
ON FARMERS
-
‘గ్యారంటీలు’ అమలు చేస్తున్నాం
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంతోపాటు రైతన్నలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హామీల గురించి కేవలం మాటలు చెప్పడం లేదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో 17వ భారత సహకార సదస్సులో మోదీ మాట్లాడారు. సహకార సంఘాలు రాజకీయాలను పక్కనపెట్టి సామాజిక, జాతీయ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు నమూనాగా మారాలని సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్పారు. వంట నూనెలు, తృణధాన్యాలు, శుద్ధి చేసిన ఆహారం, చేపల దాణాను దిగుమతి చేసుకోవడానికి మనం ఏటా రూ.2.5 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని, ఈ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వంట నూనెల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో నూనె గింజలు, తృణ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సహకార సంఘాలు కృషి చేయాలని కోరారు. చేసిందే చెబుతున్నాం.. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని ప్రధాని మోదీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చౌక ధరలకే రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో భారీ మొత్తంలో పంటలను సేకరిస్తున్నామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత నాలుగేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. ప్రజలకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలపై మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ప్రతి రైతుకు ఏటా వివిధ రూపాల్లో రూ.50,000 లబ్ధి చేకూరుతోందని, ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. చేసిందే చెబుతున్నామని పేర్కొన్నారు. ఎంఎస్పీ ద్వారా గత తొమ్మిదేళ్లలో రైతులకు రూ.15 లక్షల కోట్లకుపైగా సొమ్ము అందజేశామని తెలియజేశారు. ఎరువుల రాయితీ కోసం ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంతకంటే పెద్ద గ్యారంటీ ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో రైతులకు ఒక్కో ఎరువు బస్తా కేవలం రూ.270కే లభిస్తోందని, అమెరికాలో దీని ధర రూ.3,000 పైగానే ఉందన్నారు. రైతుల జీవితాలను మార్చాలంటే చిన్న ప్రయత్నాలు సరిపోవు, భారీ ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. విపక్షాల ఐక్యత నిలిచేది కాదు షాదోల్: ప్రతిపక్షాలు ఐక్యంగా ఒక్క తాటిపైకి వస్తాయనడానికి ఎలాంటి గ్యారంటీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత గొడవలతో పార్టీలన్నీ మునిగిపోయినప్పుడు వారందరూ ఐక్యంగా ఉంటారని భావించలేమన్నారు. కాంగ్రెస్ ఇతర కుటుంబ పార్టీలన్నీ ప్రజలకి తప్పుడు హామీలిస్తున్నాయని ఇవన్నీ వారంతా ఐక్యంగా ఉండలేరనడానికి సంకేతాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడానికి అంగీకారానికొచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2047 నాటికి దేశం ఎనీమియా (రక్తహీనత)ను పారద్రోలే లక్ష్యంతో మధ్యప్రదేశ్లోని షాదోల్లో ఒక మిషన్ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలతో ఈ పార్టీలన్నీ తమ కుటుంబాల సంక్షేమమే చూస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం కాదని అన్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని బెయిల్పై బయటకు వచ్చిన వారు, కుంభకోణాల్లో దోషులుగా తేలి జైల్లో ఉండి వచ్చినవారే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారని నిందించారు. రాజకీయ పార్టీలిచ్చే హామీల్లో ఏమి అమలు చేయగలిగేవో ప్రజలే గుర్తించాలన్నారు. ఇలాంటి తప్పుడు హామీలిచ్చే వారంతా ఇప్పుడు ఒకే గూటికి వస్తామనడం విడ్డూరమేనని ఆయన ఎద్దేవా చేశారు. -
అడిగితే.. అంతే!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం తమ నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించా లని అడిగిన రైతులను ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కించింది. పరిహారం ఇవ్వకుండా కాలువ తవ్వడానికి వీల్లేదన్న అన్నదాతలు గురువారం చింతలపూడిలోని కోర్టుకు హాజరుకావా ల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే గత ఏడాది జూలైలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం రైతుల పొలాల్లోంచి కాలువ తవ్వేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. తమకు సొమ్ములు చెల్లించకుండా కాలువ ఎలా తవ్వుతారంటూ అక్కడి రైతులంతా అధికారులను నిలదీశారు. భూములను సేకరించి.. పూర్తి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టిం చుకోకపోవడంతో రైతులంతా కలిసి యర్రగుంటపల్లి వద్ద కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. ఆ రైతులపై డీఈతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. చింతలపూడి జెడ్పీటీసీ రాధారాణి, యర్రగుంటపల్లి సర్పంచ్ సదరబోయిన వరలక్షి్మతోపాటు పిండపర్తి ముత్తారెడ్డి, పుల్లూరి సోమశేఖరాచార్యులు, అలవాల ఖాదర్బాబురెడ్డి, చిట్టూరి అంజిబాబు, మావూరి సత్యనారాయణరెడ్డి, జంగా రామచంద్రారెడ్డి, గుంటక రాఘవ, చిల్లూరి వెంకట లక్ష్మణరావు, గోలి శాంతరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వారందరికీ నోటీసులు రావడంతో గురువారం చింతలపూడి కోర్టుకు హాజరయ్యారు. కేసు ఈనెల 29వ తేదీకి వాయి దా పడింది. న్యాయం చేయకపోగా.. ఏడాది క్రితం రైతులు కాలువ పనులను అడ్డుకోగా.. ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. యర్రగుంటపల్లిలోని రైతులకు ఒక్కపైసా కూడా పరిహారం అందలేదు. పరి హారం ఇవ్వకుండా పనులు చేయాలని ప్రయత్నించడమే కాకుండా తమపై అక్రమ కేసులు బనాయించి కోర్టుకు లాగడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబం ధించి ప్రభుత్వం ఇచ్చిన అవార్డును వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించడం, దానిపై స్టే రావడం తెలిసిందే. భూసేకరణ మొత్తం అవినీతిమయంగా మారడం, లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటంతో భూసేకరణ ప్రక్రియ ఎంత అడ్డగోలుగా సాగుతోందో స్పష్టమవుతోంది. రైతులపై కేసులు పెట్టడాన్ని చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులను భయపెట్టి పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.