breaking news
Family courts
-
ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటంపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనతాదళ్ (యు)కు చెందిన కౌశలేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం ప్రస్తుతం 11.4 లక్షలకు పెరిగిందని, ఈ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 715 కుటుంబ న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి తీసుకునే చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని బిజూ జనతాదళ్‌కు చెందిన మహ్తాబ్ కోరారు. చర్చను ప్రారంభిస్తూ బీజేపీకి చెందిన సునితా దుగ్గల్.. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కుటుంబ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కుటుంబం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి కేంద్రం 1984లో ఫ్యామిలీ కోర్టుల చట్టం ద్వారా ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 2008లో నాగాలాండ్‌లో రెండు, 2019లో హిమాచల్ ప్రదేశ్‌లో మూడు కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది హిమాచల్ హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులకు అధికార పరిధి లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని హిమాచల్‌కు పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని హిమాచల్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పేర్కొంది. నాగాలాండ్‌లోని ఫ్యామిలీ కోర్టులు కూడా 2008 నుంచి ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టంలో తాజాగా చేపట్టిన సవరణల ద్వారా ప్రభుత్వం ఇటువంటి లోపాలను సవరించే ప్రయత్నం చేసింది. కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు, వాటి పరిధిపై సంబంధిత హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపింది. -
రెండో శని, ఆదివారాల్లో ఫ్యామిలీ కోర్టు విధులు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ వివాదాలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 ఫ్యామిలీ కోర్టులు ప్రతి నెలా రెండో శని, ఆదివారాలు పనిచేయనున్నాయి. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ కోర్టులు పనిచేస్తాయని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ప్రతిపాదనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.