breaking news
Expulsion of Village
-
కులబహిష్కరణ: మాట్లాడితే రూ. 30 వేలు జరిమానా
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వెంకటాపూర్‌లో కులసంఘ స్థలం రిజిస్ట్రేషన్ వివాదంలో ఓ కుటుంబాన్ని కులపెద్దలు కులబహిష్కరణ చేశారు. గ్రామంలోని ముదిరాజ్ కులసంఘం స్థలాన్ని దుండిగాల శంకరయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలాన్ని ప్రస్తుత కులసంఘం అధ్యక్షుడు పాండావుల రవి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వ్యక్తిపేరున కాకుండా సంఘం పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని శంకరయ్య తెలిపాడు. నిరాకరించిన కులపెద్దలు.. ఆర్నెల్లుగా గ్రామంలో పంచాయితీలు నిర్వహిస్తున్నారు. సమస్య కొలిక్కి రాలేదు. శంకరయ్యను కులబహిష్కరణ చేశారు. ఆయనతో మాట్లాడినందుకు గ్రామస్తుడు దుండిగాల రాజుకు రూ.30వేల జరిమానా విధించారు. రాజుకు జరిమానా విధించడం, తనను కులబహిష్కరణ చేయడంతో విసిగిపోయిన శంకరయ్య బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై వెంకటకృష్ణ విచారణ జరిపి బాధ్యుతలైన కులపెద్దలు పాండావుల రవి, కంకనాల కిషన్, కంకనాల పర్శయ్య, కంకనాల బాలయ్య, కంకనాల రమేశ్‌పై కేసు నమోదు చేశారు. -
ఆరేళ్ల తర్వాత ఊరిలోకి లింగుబాయి
జన్నారం : కుష్టువ్యాధి కారణంగా గ్రామ బహిష్కరణకు గురైన మహిళ ఆరేళ్ల తర్వాత గ్రామంలోకి చేరింది. మానవహక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగరావు, లీగల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకుడు మదాసు మధుకర్ శ్రమ ఫలించి ఇల్లు చేరింది. మురిమడుగు గ్రామ పంచాయతీ పరిధి కొమ్ముగూడెంకు చెందిన పెంద్రం లింగుబాయి(40) ఆరేళ్ల క్రితం కుష్టుబ్యాధి బారిన పడింది. ఈ విషయం గ్రామస్తులకు వ్యాధి తమకూ అంటుకుంటుదనే అపోహాతో లింగుబాయిని గ్రామం నుంచి పంపించారు. గ్రామ శివారులోని ఓ పాకలో ఉంచారు. అప్పటి నుంచి ఆమె ఒక్కరే అక్కడ ఉంటోంది. కొడుకు తీసుకొచ్చిన అన్నం తిని అక్కడ నివసిస్తోంది. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న భుజంగరావు, మధుకర్ ఆ గ్రామానికి వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకున్నారు. వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విషయూన్ని అధికారుల దృష్టికీ తీసుకెళ్లారు. బుధవారం వారితోపాటు లెప్రా సొసైటీ సభ్యులు, సర్పంచ్ రాంచందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు శోభ, వైద్యాధికారి శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి లింగుబాయికి వైద్య పరీక్షలు చేశారు. కుష్టువ్యాధి అంటువ్యాధి కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. గ్రామస్తులు అంగీకరించడంతో లింగుబాయి తన సొంత ఇంటికి చేరింది. అధికారులు స్వయంగా ఆమెను గ్రామంలోకి తీసుకొచ్చారు. కాగా, ఇందన్పల్లి గొండుగూడలో కూడా మడావి మారుబాయి అనే వృద్ధురాలికి కుష్టువ్యాధి సోకింది. ఆమెనూ గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామస్తులు నిర్ణయించినట్లు తెలుసుకుని వారు వెళ్లి నచ్చజెప్పారు. కార్యక్రమంలో లిప్రా సొసైటీ ప్రాజెక్ట్ అధికారి రామనుజాచారి, సభ్యులు కిషన్రావ్, పోతన, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.