ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా?
♦ డైరెక్ట్, రెగ్యులర్ అంటూ రెండు రకాల ప్లాన్స్
♦ పెట్టుబడులు పెట్టే తీరు రెండింట్లోనూ ఒకటే
♦ పథకం నిర్వహణ వ్యయాలు రెండింటిలో వేరు
♦ రాబడుల తీరును నిర్ణయించేవి ఇవే
♦ డైరెక్ట్ ప్లాన్స్‌లో కమీషన్లుండవు; వ్యయం తక్కువ
♦ రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో అధిక రాబడులు
♦ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవే అనువైనవి
ఇటీవల దేశీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వెలిగిపోతోంది. సాధారణ మధ్య తరగతి ప్రజలు సైతం మెరుగైన రాబడులకు మ్యూచువల్ ఫండ్స్ బాట పడుతున్నారు. సంప్రదాయ బ్యాంకు డిపాజిట్లు, బాండ్లపై రాబడులు కనిష్ట స్థాయిలకు చేరిన తరుణంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే రాబడులకు చుక్కానిలా కనిపిస్తున్నాయి. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులక్కూడా కొంత విషయ పరిజ్ఞానం కావాలి. ఫండ్స్ నుంచి గణనీయమైన రాబడులను అందుకోవాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలివీ...
ఫండ్స్‌లో రెండు రకాలు
మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్స్, డైరెక్ట్ ప్లాన్స్ అని రెండు రకాలుంటాయి. డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేస్తే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో (ఏఎంసీ) నేరుగా మీరు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు. కంపెనీకి, మీకు మధ్య మరెవరూ ఉండరు. రెగ్యులర్ ప్లాన్లలో మాత్రం పెట్టుబడులను డిస్ట్రిబ్యూటర్ లేదా అడ్వైజర్ ద్వారా చేస్తున్నట్టు. మ్యూచువల్ ఫండ్స్ తమ సేవలు అందించినందుకు గాను మధ్యవర్తులకు అప్‌ఫ్రంట్ ఫీజులు చెల్లిస్తుంటాయి. వీటిని ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లోంచే సర్దుబాటు చేస్తాయి. డైరెక్ట్ ప్లాన్లలో ఈ విధమైన వ్యయాల భారం తగ్గడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. 2012 సెప్టెంబర్ ముందు వరకూ కేవలం రెగ్యులర్ పథకాలే అందుబాటులో ఉండేవి. సంస్కరణల్లో భాగంగా డైరెక్ట్ ప్లాన్ల ప్రవేశానికి అనుకూలంగా సెబీ చర్యలు తీసుకుంది. అన్ని రకాల ఏఎంఎసీలు (మ్యూచువల్ ఫండ్ కంపెనీలు) ప్రతి పథకాన్నీ డైరెక్ట్, రెగ్యులర్ పేరిట రెండు రకాలుగా విడుదల చేస్తున్నాయి.
చార్జీలు/ ఫీజులు
మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన ఓ నిధి. దీన్ని నిపుణులైన మేనేజర్లు పెట్టుబడులుగా మలుస్తారు. ఎప్పటికప్పుడు సరైన స్టాక్స్, సెక్యూరిటీలను ఎంచుకొంటూ ఇన్వెస్ట్ చేయడం, పెట్టుబడులు మారుస్తుండడం చేస్తుంటారు. ఈ విధమైన నిర్వహణకు గాను ఏఎంసీలు ఫీజులను వసూలు చేస్తుంటాయి. దీనికి తోడు ఇతర వ్యయాలు కలుపుకుంటే ఆ మొత్తాన్ని ఎక్స్పెన్స్ రేషియోగా పేర్కొంటారు. లేదా టోటల్ ఎక్స్పెన్స్ రేషియోగా చెబుతారు. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా రెండు రకాల వ్యయాలను ఎదుర్కొంటాయి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓ పథకాన్ని ఆవిష్కరించేందుకు అయ్యే వ్యయాలు ఇవి. దీన్ని ఇన్వెస్టర్ల నుంచి కాకుండా ఏఎంసీయే భరిస్తుంది. రెండోది రికరింగ్ ఎక్స్పెన్సెస్. పథకం నిర్వహించేందుకు అయ్యే వ్యయాలు. వీటిని ఇన్వెస్టర్లే భరించాల్సి ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణ, సలహాదారుల రుసుం, ట్రస్టీ ఫీజు, మార్కెటింగ్, విక్రయాల వ్యయాలు ఇవన్నీ ఇందులో భాగం. రోజువారీ ఫండ్ ఆస్తుల విలువ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఏ రోజుకారోజు ఫండ్ ఎన్ఏవీలోంచి తగ్గించడం జరుగుతుంది.
వ్యయాలకు నిబంధనలూ ఉన్నాయి..
ప్రస్తుత నిబంధనల మేరకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకంలో రికరింగ్ ఎక్స్పెన్సెస్ అన్నవి ఏడాదికి ఆ ఫండ్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువలో 2.5 శాతం మించకూడదు. ఇది ఈక్విటీ పథకాలకు. డెట్ పథకాల్లో ఇది 2.25 శాతం, ఇండెక్స్ పథకాల్లో 1.5 శాతం గరిష్ట పరిమితిగా ఉంది. వీటికి అదనంగా అదనపు వ్యయాల రూపేణా మరో 0.20 శాతం చార్జీలు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో విధించే ఎగ్జిట్ లోడ్ కూడా ఒకటి.
ఎక్స్పెన్స్ రేషియో (ఖర్చుల నిష్పత్తి)
డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియోను ఒక్కసారి గమనిస్తే... రెగ్యులర్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉండడాన్ని గుర్తించొచ్చు. డైరెక్ట్ ప్లాన్లలో ఏఎంసీకి, ఇన్వెస్టర్‌కు మధ్య మధ్యవర్తులు ఎవరూ ఉండరు కనుక కమీషన్లు చెల్లించక్కర్లేదు. దీంతో డైరెక్ట్ ప్లాన్ల ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల ప్లాన్ల మధ్య రాబడుల్లో ఈక్విటీ పథకాలైతే వ్యత్యాసం 0.50 శాతం నుంచి 1.50 శాతం వరకూ ఉంటుంది. డెట్ పథకాల్లో ఇది 0.50 శాతం వరకూ ఉంటుంది. వీటిలో ఎది ఎంచుకున్నా... ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మాత్రం రెండింటికీ ఒకటే ఉంటుంది. రెండింటికీ వేర్వేరుగా పెట్టుబడులు పెట్టడం ఉండదు. అలాగే పథకం విధివిధానాలు, లక్ష్యాలు, పెట్టుబడుల కేటాయింపులు, ఎగ్జిట్ లోడ్, రిస్క్ ఫ్యాక్టర్, సౌకర్యాలు, నియమ నిబంధనలు కూడా ఒకటే. కాకపోతే కమీషన్లు, వ్యయాలు అన్నవి రెగ్యులర్ ప్లాన్లలో ఎక్కువగా చార్జ్ చేస్తారు. వాటి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉండడానికి కారణం అదే.
తేడా కొంచెమే... కానీ
రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియోలో వ్యత్యాసం కొంచెమే కదా అనుకుంటే పొరబడినట్టే. ఈ కొంచెమే దీర్ఘకాలంలో పెట్టుబడులపై రాబడుల్లో ఎక్కువ వ్యత్యాసానికి కారణం అవుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఇక్కడ పలు ఉదాహరణలు చూద్దాం. 2013 జనవరిలో బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్‌లో కామన్ ఎన్ఏవీ (ఒక్కో యూనిట్ విలువ) రూ.100.24 ఉంది. 2016 మార్చి 31న ఈ ఫండ్‌లో డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ రూ.159.9గా ఉంటే, రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ రూ.155.50 ఉంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ 15.45 శాతం రాబడులను ఇస్తే... రెగ్యులర్ ప్లాన్‌లో రాబడులు 14.45 శాతంగా ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియోలో వ్యత్యాసం 1.14 శాతంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో రెగ్యులర్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో 1.95 శాతంగా ఉంటే, డైరెక్ట్ ప్లాన్‌లో 0.85 శాతమే ఉంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌లో రెండు ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో వ్యత్యాసం 1.88 – 0.86 శాతంగా ఉంది. పన్ను ఆదా చేసే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో 1.98 – 1.27 శాతంగా ఉంది. డెట్ ఫండ్ విభాగంలోని బిర్లా సన్‌లైఫ్ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ పథకంలో రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 0.29 శాతంగా ఉంటే, డైరెక్ట్ ప్లాన్‌లో ఇది 0.19 శాతంగా ఉంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏఎంసీని బట్టి, పథకాన్ని బట్టి మారుతుంది. రెండు కంపెనీలు నిర్వహించే ఒకే తరహా లార్జ్ క్యాప్ ఫండ్లలో ఎక్స్పెన్స్ రేషియో ఒకే మాదిరిగా ఉండదు. ఎందుకంటే ఆ పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తులు, కంపెనీ పెట్టుబడుల విధివిధానాలు, వ్యయాలు ఇలా ఎన్నో అంశాల్లో తేడా ఉండొచ్చు.
వ్యత్యాసం విలువెంతంటే...
పైన చెప్పుకున్న పథకాల్లోనే డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడుల మధ్య వ్యత్యాసం చూస్తే... బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్‌లో 2013 జనవరి నుంచి ప్రతీ నెలా రూ.10వేల చొప్పున 2016 మార్చి వరకు మొత్తం రూ.3.9 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టయితే... రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు 4.81 లక్షలకు, డైరెక్ట్ ప్లాన్‌లో 4.89 లక్షలకు వృద్ధి చెంది ఉండేవి. వ్యత్యాసం రూ.8వేలు. ఇక 15 ఏళ్ల పాటు ఇదే పథకంలో సిప్ చేస్తూ వెళితే రాబడులు ఇదే విధంగా ఉంటాయనుకుంటే... రెగ్యులర్ ప్లాన్‌లో రూ.51,54,144, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.56,52,071 అవుతుంది. రెండింటి మధ్య తేడా దాదాపు రూ.5 లక్షలు. రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఇంత మేర నష్టపోయినట్టే కదా.
అదే ఐసీఐసీఐ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌లో 2013 జనవరి నుంచి 2016 జనవరి వరకు ప్రతీ నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళితే రెగ్యులర్ ప్లాన్‌లో రూ.5.49లక్షలు, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.5.60లక్షలు అయి ఉండేవి. తేడా రూ.11వేలు. ఇదే పథకంలో రూ.10వేల చొప్పున నెలనెలా సిప్ చేస్తూ వెళితే 15 ఏళ్ల కాలానికి రూ.18 లక్షల పెట్టుబడులు కాస్తా రెగ్యులర్ పథకంలో 1,09,97,467, డైరెక్ట్ పథకంలో రూ.1,22,97,185 అవుతాయి. రెండు పథకాల మధ్య వ్యత్యాసం రూ.13 లక్షలు. ఈక్విటీ పథకాల్లోనే ఇంత భారీ వ్యత్యాసం ఉంటుంది. డెట్ పథకాల్లో ఈ తేడా చాలా తక్కువగా ఉంటుంది.
దాదాపు అన్ని పథకాల్లోనూ అంతే
2013 జనవరి నుంచి చూస్తే 632 పథకాల్లో (ఈక్విటీ, డెట్, హైబ్రిడ్) డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య సగటున ఎక్స్పెన్స్ రేషియో వ్యత్యాసం 0.80 శాతంగా కనిపిస్తోంది. దీంతో ఈక్విటీ ఆధారిత పథకాల్లో (రూ.4,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్న ఫండ్లను చూస్తే) రాబడుల మధ్య వ్యత్యాసం గత నాలుగేళ్ల కాలానికి 6 శాతంగా ఉంది. ఇక, ఇన్కమ్, గిల్ట్ లాంగ్‌టర్మ్ ఫండ్లలో డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియో వ్యత్యాసం 0.71 శాతం, 0.60 శాతంగా ఉంది. లిక్విడ్ ఫండ్స్‌లో మాత్రం అతి స్వల్పంగా తేడా 0.12 శాతమే ఉంది.మరీ ముఖ్యంగా డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం.
ఎందుకంటే ఈ పథకాల్లో రాబడులు చాలా తక్కువగా ఉంటాయి గనుక. ఉదాహరణకు బిర్లా సన్ లైఫ్ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ప్రతీ నెలా రూ.10వేల చొప్పున 39 నెలల పాటు ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్ ప్లాన్‌లో రూ.4.55 లక్షలు, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.4.56 లక్షలు అవుతాయి. 15 ఏళ్ల కాలం పాటు ఇదే విధంగా ప్రతి నెలా రూ.10వేలు సిప్ చేస్తూ వెళితే రెగ్యులర్ ప్లాన్‌లో రూ.38,50,799, డైరెక్ట్ ప్లాన్‌లో రూ.38,86,541 అవుతాయి. 15 ఏళ్ల కాలంలో వ్యత్యాసం రూ.35వేలు. తేడా తక్కువగా ఉండడానికి కారణం ఈ పథకంలో రెండు ప్లాన్ల మధ్య ఎక్స్పెన్స్ రేషియో తేడా 0.10శాతమే ఉండడం. ఈ వ్యత్యాసం మరో 0.10 శాతం పెరిగితే రాబడుల్లో ఒకటిన్నర రెట్ల తేడా కనిపిస్తుంది.
ఎంత కాలానికి పెట్టొచ్చు!
దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు మరో ఆలోచన లేకుండా డైరెక్ట్ ప్లాన్స్ ఎంచుకోవడమే నయం. ఎందుకంటే పై ఉదాహరణలు చూస్తే దీర్ఘకాలంలో రాబడుల్లో భారీ వ్యత్యాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల కాలానికి అయితే తేడా స్వల్పమే. ముఖ్యంగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడుల లక్ష్యాలకు డైరెక్ట్ ప్లాన్స్ తగినవి. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనంతో పెట్టుబడుల విలువలో చెప్పుకోతగ్గ తేడా కనిపిస్తుంది. ఇక ఎంచుకునే ఫండ్ పథకం కూడా ఆ విభాగంలో మిగిలిన పథకాల కంటే మెరుగైన రాబడులను ఇచ్చేది అయి ఉండాలి. ఆ విధమైన ఎంపికే రాబడులను నిర్ణయిస్తుంది.