breaking news
explosives factory
-
చెన్నైలో భారీగా అమ్మోనియం నైట్రేట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: లెబనాన్ దేశ రాజధాని నగరం బీరుట్లో అత్యంత భారీ పేలుడు ఘటన నేపథ్యంలో చెన్నై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై హార్బర్ గిడ్డంగిలో అయిదేళ్లుగా 700 టన్నుల ప్రమాదకర అమోనియం నైట్రేట్ నిల్వలు ఉండటమే ఇందుకు కారణం. 2015లో చెన్నైకి చెందిన ఓ సంస్థ రూ.1.80 కోట్ల విలువైన 700 టన్నుల అమోనియం నైట్రేట్‌ను దక్షిణ కొరియా నుంచి తెప్పించింది. అయితే, ఎరువుల తయారీ గ్రేడ్ రసాయనం పేరుతో పేలుడు పదార్థాలకు వాడే గ్రేడ్ అమోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంది. దీంతో ప్రమాదకరమైన ఆ కెమికల్‌ను అధికారులు సీజ్ చేసి, 37 కంటైనర్లలో హార్బర్లోని గిడ్డంగిలో ఉంచారు. అయిదేళ్లయినా ఆ కంటైనర్లు అక్కడే ఉన్నాయి. బీరుట్ హార్బర్లో సంభవించిన పేలుడు.. అమ్మోనియం నైట్రేట్‌ను ఏళ్లపాటు ఒకే చోట ఉంచిన కారణంగానే సంభవించడం తెలిసిందే. చెన్నై హార్బర్లో సైతం 2015 నుంచి అమ్మోనియం నైట్రేట్ గిడ్డంగికే పరిమితం కావడం వల్ల అదే తీరులో పేలుళ్లకు దారితీస్తే చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, కస్టమ్స్ అధికారులు గురువారం చెన్నై హార్బర్లో అమోనియం నైట్రేట్ నిల్వలు, భద్రతా చర్యలపై తనిఖీలు చేపట్టారు. ఇక్కడి నిల్వలతో ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 2015లో చెన్నై వరదల సమయంలో సుమారు 7 టన్నుల అమోనియం నైట్రేట్ పాడైపోగా మిగతా 690 టన్నులను త్వరలోనే ఈ–వేలం ద్వారా విక్రయిస్తామని వెల్లడించారు. -
బాంబుల ఫ్యాక్టరీలో పేలుళ్లు..
బీజింగ్: చైనాలోని ఓ పేలుడు పదార్ధాల తయారీ ఫ్యాక్టరీలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు షడాంగ్ ప్రావిన్స్‌లోని టియాన్ బావో కెమికల్ ఇండస్ట్రీలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు దాటికి మొత్తం 401 వర్క్ షాపులు ధ్వంసమయ్యాయి. గుర్తుపట్టలేనంత చిద్రంగా చనిపోయి తొమ్మిదిమంది మృతదేహాలు పడిఉన్నాయి. వారంతా 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించడం కోసం ముందు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పేలుడు ఎంత తీవ్రతతో సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల చైనాలో ఎక్కువగా పేలుడు పదార్ధాల ఫ్యాక్టరీలో, రసాయనిక కర్మాగారాల్లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆగస్టులో రెండు భారీ పేలుళ్లు సంభవించి దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.