breaking news
essay competetions
-
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్‌లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్‌లోని ఒక ఎన్‌క్లోజర్‌కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్‌కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్‌లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్‌కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్‌కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్‌కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్‌గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు) -
భారత తపాలా శాఖ వినూత్న ప్రయత్నం
సాక్షి, జ్యోతినగర్ (కరీంనగర్) : ప్రస్తుతం అంతా ఆధునిక పోకడ.. సమాచారం పంపించాలన్నా.. తీసుకోవాలన్నా.. ప్రతీ ఒక్కరు ‘ఆన్లైన్’ సేవలపై ఆధారపడి ఉన్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మారుమూలలో ఉన్న పల్లె ప్రజల చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాలు రాయడం అనే మాట కనిపించదు.. వినిపించదు.. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానికి, చిన్నారులకు టెలీగ్రాం, పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ కవర్లు, రిజిష్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. ఈ క్రమంలో చిన్నారుల్లో ఉత్తరాలు రాసే అభిరుచితో పాటు జాతీయభావం పెంపొందించేందుకు భారత తపాలా శాఖ ఒక చిన్న ప్రయత్నం ప్రారంభించింది. మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఉత్తరాల పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. చిన్నారుల్లో జాతీయభావం, సృజనాత్మకతను వెలికితీసేందుకు తోడ్పడే జాతీయ ఉత్తరాల పోటీలో పాల్గొనేవారు పలు భారతీయ భాషల్లో ఉత్తరాలను రాయొచ్చు. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో భావాలను వ్యక్తీకరించేందుకు వీలు కల్పించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ‘దాయ్ ఆఖర్’ అని పేరు పెట్టారు. నవంబర్ నెలాఖరు వరకు ఉత్తరాలు రాసేందుకు అవకాశం ఉంది. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే శీర్షికతో గాంధీ మహాత్ముడిని ఉద్దేశించి ఉత్తరాలు రాయాలి. ప్రధానంగా విద్యార్థి లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోటీల నిర్వహణకు కార్యాచరణ రూపకల్పన చేశారు. ఇందులో అన్ని వయసుల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయసు వారు ఒక కేటగిరీగా, 18 ఏళ్లు దాటినవారు మరో కేటగిరీగా విభజించారు. విజేతలకు నగదు పురస్కారాలు.. ► జాతీయస్థాయి ఉత్తరాల పోటీలో విజేతగా నిలిచేవారికి రూ.59 వేల నగదు. ద్వితీయ స్థానానికి రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు అందజేయడం జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10వేలు, తృతీయ స్థానానికి రూ.5వేలు ఇస్తారు. ► ఈ విధంగా రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారి ఉత్తరాలు జాతీయస్థాయి పోటీలకు నామినెట్ అవుతాయి. ఉత్తరాలు చేరడానికి ఈనెల చివరి వరకు గడువు ఉంది. రాష్ట్రస్థాయి ఫలితాలను 31 జనవరి, 2020న వెల్లడిస్తారు. జాతీయస్థాయి ఫలితాలను 2020 మార్చి31న విడుదల చేస్తారు. వ్యాసరచన పోటీ కాదు.. ► వ్యాసరచన పోటీ ఎంతమాత్రం కాదు. ఎందుకంటే మహాత్మాగాంధీని ఉద్దేశించి రాసిన ఉత్తరం మాదిరిగా ఉండాలి. రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచే వ్యక్తికి(రూ.25వేలు), జాతీయ స్థాయిలో విజేతకు రూ.50వేలు, రెండు పోటీల్లో విజేతగా నిలిస్తే గరిష్టంగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. తపాలా శాఖ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. బాపూ ఎందుకు అమరులయ్యారనే విషయంపై అవగాహన, ఆలోచన, భావ వ్యక్తీకరణ తదితర అంశాలపై గెలుపు ఆధారపడి ఉంటుందని గమనించాలి. చేతిరాతతోనే రాయాలి.. మీరు రాసే ఉత్తరంలో వయసుకు సంబంధించిన వివరాలను తప్పక రాయాలి. గెలుపొందాక మీ వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతోంది. పాల్గొనదలిచిన వారు ‘దాయ్ ఆఖర్ జాతీయ ఉత్తరాల రాత పోటీ’ శీర్షికన ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలు మించకుండా, ఎన్వలప్ కవర్లో అయితే ఏ–4 సైజు పేపర్‌పై 1000 పదాలకు మించకుండా రాయాలి. టైపు చేసి పంపితే తిరస్కరించబడతాయి. సొంత చేతిరాతతో రాసి పంపినవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పూర్తి వివరాలకు సమీపంలోని పోస్ట్ ఆఫీసులలో సంప్రదించవచ్చు. ‘నేను పాల్గొంటున్నా’.. మీరు కూడా.. భారత తపాలా శాఖ తలపెట్టిన ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే ఉత్తరాల పోటీలో నేనూ పాల్గొంటున్నా.. మీరందరు కూడా పాల్గొనాలి.. అని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్‌షిప్‌కు చెందిన చిన్నారి అరిగెల అనుశ్వి కోరుతోంది. మహాత్మాగాందీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ తపాల శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో పాల్గొనాలని ఉపాధ్యాయురాలితో కలిసి విజయసంకేతం చూపిస్తోంది. ఉత్తరాలు పంపించాల్సిన అడ్రస్.. చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ తెలంగాణ సర్కిల్ ఆబిడ్స్, హైదరాబాద్. -
రేపు మండల స్థాయి పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఈనెల 21 మండలస్థాయి పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన 12 అంశాలపై ఈ పోటీలు నిర్వహించాలని, ప్రతి అంశం నుంచి ముగ్గురు చొప్పున తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో వేర్వేరుగా విజేతలను ఎంపిక చేయాలని సూచించారు. 23న జిల్లాస్థాయిలో అనంతపురంలోని సైన్స్ సెంటర్లో నిర్వహించే పోటీలకు పంపాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో పై అంశాలతో పాటు ‘కృష్ణా పుష్కరాలు’ అనే అంశంపై ప్రత్యేకంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయని వెల్లడించారు.


