breaking news
the environment
-
వామ్మో.. చలి
= వణుకుతున్న జనం = చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి = ప్రబలుతున్న వ్యాధులు = కిటకిటలాడుతున్న ఆస్పత్రులు = అంతంతమాత్రంగా వైద్యసేవలు = ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వాతావరణంలో భారీ మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. చలితో వణికిపోతున్నారు. ఫలితంగా వేలాదిమంది రోగాలబారిన పడి ఆస్పత్రుల బాటపట్టారు. జిల్లాలో గత కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావటంతో చలితీవ్రత పెరిగింది. సాధారణంగా 32 డిగ్రీల నుంచి 28 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 24 నుంచి 22 డిగ్రీలు నమోదవుతోంది. దీంతో జిల్లా అంతటా ముసురేసుకున్నట్లు ఉదయం నుంచి చీకటి అలముకుంది. సన్నని తుంపర్లు, ఈదరుగాలులు వీయటం ప్రారంభించింది. ఫలితంగా జనం చలితీవ్రతకు అల్లాడిపోతున్నారు. పెరిగిన రోగులు ఒక్కసారిగా వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవటంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 74 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులతో పాటు నెల్లూరులో పెద్దాసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రుల్లో సాధారణ రోజుల్లో కంటే గత మూడు రోజులుగా రోగాల బారినపడిన వారు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 3 వేలమంది వివిధ రోగాలతో వస్తుండగా.. మూడురోజులుగా రోజుకు 5 వేల నుంచి 6 వేలకుపైనే వస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులతో కలుపుకుంటే 9వేల వరకు ఉంటుందని అంచనా. గూడూరులోని ఎగువవీరారెడ్డిపల్లికి చెందిన పుండ్ల తిరుపతమ్మ(75) చలిగాలులకు తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. విజృంభించిన వ్యాధులు చలితీవ్రతకు చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువమంది ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో దోమలు అధికమయ్యాయి. దోమకాటుతో మలేరియా జ్వరాలు కూడా విజృంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు వైద్యులకు కాసుల వర్షం కురుస్తోంది. ఎన్నడూ లేనివిధంగా.. తడ : గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఓ వైపు పొగమంచు కొండ ప్రాం తాలను తలపిస్తుంటే, ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జల్లులు వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. చలికి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. రహదారిపై వాహనాలు నడిపై డ్రైవర్లకు రోడ్డు సరిగా కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం ఉటీ, కొడె కెనాల్, మంచుతో కూడిన కొండ ప్రాంతాలను తలపిస్తున్నాయి. మంచు కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులే కాకుండా ఆరోగ్య వంతులు కూడా అనార్యోగం పాలవుతున్నారు. వృద్ధు లు, ఆస్త్మా వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో అవసరమైన పనులు ఉంటే తప్ప వీరు వీరితో పాటు చిన్న పిల్లలు సరైన రక్షణ పద్ధతులు పాటించకుండా బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీడని మంచు కావలి: ఆకాశం మేఘావృతం కావడంతో పాటు మధ్యాహ్నం 11 గంటల వరకు పట్టణంలో కురుస్తున్న మంచు సోమవారం వీడలేదు. దీంతో మధ్యాహ్నం వరకు జనసంచారం తక్కువగా కనిపించింది. 10 గంటల వరకు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టణంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షసూచన ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా మంచు కురుస్తూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అధికమైన చలి తీవ్రత అల్లూరు : బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా సోమవారం వేకువ నుంచి మండలంలో చిరుజల్లులు మొదలయ్యాయి. చలిగాలులు అధికంగా వీస్తుండటంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ముఖాలకు ధరించి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చలిగాలులు అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో వర్షాలు నెల్లూరు (రెవెన్యూ): బంగళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోవు 24 గంటల్లో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లల్లో నీరు నిలిచింది. దీంతో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 1.5 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సూళ్లూరుపేట లో 7.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరులో 4.2, విడవలూరు 3, కొడవలూరు 1.8, పొదలకూరు 1.2, నెల్లూరు 1.2, కోవూరు 3, ఇందుకూరుపేట 2, టీపీగూడూరు 4.4, మనుబోలు 1.8, గూడూరు 2.6, సైదాపురం 1.8, వెంకటగిరి 1.4, బాలాయపల్లి 1.2, ఓజిలి 1.6, చిల్లకూరు 2.6, కోట 3.2, వాకాడు 4.2, చిట్టమూరు 4.8, నాయుడుపేట 2.2, పెళ్లకూరు 2.4, డీవిసత్రం 6.2, తడ మండలంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జాగ్రత్తలు తీసుకోవాలి కాలుష్యంతో పర్యావరణం దెబ్బతిని రుతువులు మారిపోయాయి. మంచు కాలంలో విపరీతంగా మంచుకురువటం.. వానాకాలంలో అధికవర్షాలు పడటం.. ఎండాకాలంలో ఎక్కువ ఎండ లు కాయటం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎక్కువ మంచు. ఇది చాలా ప్రమాదకరమైంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. = వాకింగ్ చేసేవారు ఉదయం 7 గంటల పైన చేయాలి. = స్వెట్టర్లు, శాలువాలు, మంకీక్యాప్, చేతిక గ్లౌజులు వాడాలి. = కోల్డ్ క్రీమ్‌లు, గ్లిజరిన్ సోపులు వాడాలి. = నీటిని వేడిచేసుకుని తాగాలి. చల్లని ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిదికాదు. = రాత్రిపూట నివాసాల్లో హీటర్లు పెటుటకోవాలి. - ఈదూరు సుధాకర్, సీనియర్ పబ్లిక్‌హెల్త్ అధికారి. -
దేవుని మాట వినబడనివ్వని సైరన్లు!
దైవికం మాల్థస్ అనుకున్నట్లు మనిషినిక్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే. బిల్ వాటర్సన్ అమెరికన్ చిత్రకారుడు, కార్టూనిస్ట్. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘కాల్విన్ అండ్ హాబ్స్’ 1985 నుంచి 1995 వరకు పదేళ్ల పాటు ప్రతిరోజూ ప్రపంచ పత్రికల్ని అలరించింది. సున్నితమైన హాస్యం, సునిశితమైన సామాజిక స్పృహ కలగలిసిన సెటైర్లు అవి. రాజకీయాలు, ఒపీనియన్ పోల్స్, పర్యావరణం, ప్రజావిద్య, ఫిలాసఫీ... దేన్నీ వదిలిపెట్టకుండా అన్ని అంశాలపైనా కాల్విన్ (ఆరేళ్ల బాలుడు), హాబ్స్ (ఒళ్లంతా వెటకారం నిండిన పులి) అనే రెండు పాత్రలను అడ్డుపెట్టుకుని కార్టూన్లు గీశారాయన. వాటిల్లోని ఓ కార్టూన్లో ఒక పిల్లవాడు తన తండ్రిని ఇలా అడుగుతాడు: ‘‘డాడ్, సోల్జర్లు ఒకళ్లనొకళ్లని చంపుకోవడం ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఎలా అవుతుంది?’’ అని! యుద్ధం మీద వాటర్సన్ ప్రయోగించిన క్షిపణి అది. ప్రస్తుతం ప్రపంచమంతా రెండు యుద్ధాల గురించి మాట్లాడుకుంటోంది. మొదటిది: పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న ఏకపక్ష యుద్ధం. రెండోది: నూరేళ్లు నిండిన మొదటి ప్రపంచ యుద్ధం. మొ.ప్ర. యుద్ధంలో ముప్పై దేశాలు పాల్గొన్నాయి. దాదాపు కోటి మంది మరణించారు. అయినా ఆ యుద్ధం నుంచిగానీ, ఇంకే యుద్ధం నుంచి కానీ మనిషి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే, తర్వాతి యుద్ధానికి (నాలుగో ప్రపంచ యుద్ధానికి) మనుషుల దగ్గర కర్రలు, రాళ్లు తప్ప వేరేమీ ఉండవు’’ అని ఐన్‌స్టీన్ అన్నారు. మనిషి మళ్లీ ఆదిమ కాలానికి వెళ్లిపోతాడని దీని అర్థం. అసలు మనుషులు యుద్ధాలు ఎందుకు చేసుకుంటారు? పొరపాటు. మనుషులు యుద్ధాలు చేసుకోరు. దేశాలు చేసుకుంటాయి. అమెరికన్లకు భౌగోళిక శాస్త్రాన్ని నేర్పించడానికి దేవుడు యుద్ధాన్ని సృష్టించాడని మార్క్ టై్వన్ అంటారు, సరదాగా. నేర్పించడానికి దేవుడి దగ్గర చిన్న చిన్నవి చాలానే ఉంటాయి. అంత పెద్ద యుద్ధమే అక్కర్లేదు. అయినా అన్ని మతాలూ శాంతినే ప్రవచించాయి కనుక దేవుడు యుద్ధ వ్యతిరేకి అనుకోవాలి. అయినప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయంటే దైవభీతిని మించిన దేశభక్తి ఏదో సోల్జర్ తలపైన కూర్చుని ఉండాలి. బ్రిటన్ తత్వరచయిత జి.కె.ఛెస్టర్టన్ ఏమంటారంటే, నిజమైన సిపాయి తన కళ్లెదుట కనిపించే వాటిపై ద్వేషం కారణంగా పోరాడడట, తన వెనుక ఉన్నదానిపై (దేశం) ప్రేమతో కదనరంగంలోకి దూకుతాడట! బహుశా ఇప్పుడు పాలస్తీనాపై కురుస్తున్న బాంబుల వర్షంలో చిన్నారులు, స్త్రీలు, అమాయకులు మరణించడం వెనుక అలాంటి దేశభక్త సైనికులే ఉండి ఉండాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిందీ ఈ దేశభక్తులే కావచ్చు. ఏమైనా నాడు జరిగిన ఘోరాలు కానీ, నేడు జరుగుతున్న దారుణాలు గానీ దేవుడికి ప్రియమైనవని, దేవుని సంకల్పానుసారం జరుగుతున్నవనీ అనుకోలేం. అసలు దుష్టశక్తి అంశ ఉన్నది ఏదైనా దేవుడికి ఆమోదయోగ్యం ఎలా అవుతుంది? ప్రముఖ ఆర్థికవేత్త, జనాభా సిద్ధాంతకర్త థామస్ రాబర్ట్ మాల్థస్ ఒకచోట ఆలోచనలో పడతాడు. లోకంలోని ఈ పేదరికం, క్షుద్బాధ.. భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయా? అన్న సందేహం ఆయనకు కలుగుతుంది. కష్టం తెలియడానికి, కష్టపడి బతకడం ఎలాగో నేర్పించడానికి దేవుడు ఇంతమందిని పుట్టించి, ఆహారాన్ని అతి ప్రయాస మీద మాత్రమే సంపాదించుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాడా అనీ సందేహపడతాడు. కానీ... సర్వ శక్తి సంపన్నుడైన కారుణ్యమూర్తిలో ఇంతటి క్రౌర్యం ఉంటుందా? అనుకుంటాడు. అయినా క్రౌర్యమని, కాఠిన్యం అని ఎందుకనుకోవాలి? జీవన పోరాటంలో మానవజాతిని రాటు తేల్చడానికి అయివుండొచ్చు కదా అని తనకు తనే సమాధానం చెప్పుకుంటాడు. మాల్థస్ అనుకున్నట్లు మనిషిని క్రియాశీలం చేయడానికి దేవుడు అప్పుడప్పుడూ కరువును సృష్టిస్తాడేమో కానీ, యుద్ధాల సృష్టికర్త మాత్రం ముమ్మాటికీ మనిషే. 1995లో ‘కాల్విన్ అండ్ హాబ్స్’ని ఆపేసే ముందు దాని సృష్టికర్త బిల్ వాటర్సన్, వార్తాపత్రికల సంపాదకులకు, పాఠకులు చిన్న ప్రకటన విడుదల చేశారు ‘‘ఈ కార్టూన్ స్ట్రిప్’ని ఆపవలసిన తరుణం వచ్చేసింది. దీని ద్వారా నేను చెప్పదలచుకుంది చెప్పేశాను’’ అని. ఎక్కడ ఆపాలన్న స్పృహ మనుషులకు ఉంటుంది తప్ప ఎక్కడ ఆగిపోవాలన్న స్పృహ యుద్ధాలకు ఉండదు. స్పృహలేని యుద్ధాలు దేవుని మాట వినబడనివ్వని సైరన్లు. - మాధవ్ శింగరాజు