టీచర్స్ డేటా నమోదులో జిల్లా ఫస్ట్
చిత్తూరు: ప్రభుత్వ పాఠశాలల టీచర్ల వివరాలు ఆన్లైన్ నమోదులో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ జూలైలో ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించినా పలుసార్లు సంబంధిత సర్వర్ మొరాయించడంతో ఆలస్యమైంది. జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో టీచర్ల వివరాలు ఆన్లైన్ నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచారు. చివరి స్థానంలో విశాఖ జిల్లా నిలిచింది.
డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ నిర్వహించేందుకే..
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సర్వీసు రిజిస్టర్లను డిజిటల్ విధానంలో రూపొందించడానికే రాష్ట్ర విద్యాశాఖ ఈ వివరాలు సేకరించింది. టీచర్ల విద్యార్హతలు.. ఇప్పటివరకు ఎన్ని పాఠశాలల్లో పనిచేశారు..వ్యక్తిగత వివరాలను సేకరించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 15,888 మంది టీచర్లు పనిచేస్తుండగా 15,877 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 11 మంది వ్యక్తిగత సెలవుల్లో విదేశాల్లో ఉండడంతో సాధ్యపడలేదని వెల్లడించారు.