breaking news
endocrinologist
-
ఈ వ్యాధి అంత ప్రాణాంతకమా? లక్షణాలేంటి?.. వస్తే ఏం చేయాలి?
సాధారణంగా ఏ చిన్న నొప్పి వచ్చినా.. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే గూగుల్ చేస్తాం. దొరికిన సమాచారం ఆధారంగా ఏమీ కాదులే అని ఊరుకుంటాం. లేదంటే తెలిసిన డాక్టరు దగ్గరికి పరిగెడతాం. కానీ మనం అంత తేలిగ్గా గుర్తించలేని, అంతుబట్టని, అసలు పెద్దగా అవగాహనలేని రోగం ఒకటి ఉంది. అదే కుషింగ్స్ సిండ్రోమ్(సీఎస్). ఏప్రిల్ 8న కుషింగ్స్ అవేర్నెస్ డే సందర్బంగా కొన్ని వివరాలు మీకోసం.. 1912లో "పాలీగ్లాండులర్ సిండ్రోమ్"ని అమెరికన్ న్యూరో సర్జన్ డాక్టర్ హార్వే కుషింగ్ని ఈ వ్యాధిని గుర్తించారు. ఏప్రిల్ 8 ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతీ ఏడాది ఏప్రిల్ 8న, కుషింగ్స్ అవేర్నెస్ డే జరుపుకుంటారు. కుషింగ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. కుషింగ్స్ సపోర్ట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (CSRF) దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది కుషింగ్స్ సిండ్రోమ్ అంటే ఏంటి? మనందరికీ కొన్ని స్టాండర్డ్ వ్యాధులు తెలుసు. ఉదాహరణకి రక్తపోటు, చక్కెర వ్యాధి, కాన్సర్, థైరాయిడ్ మొదలైనవి. వీటితోపాటు, ఇంకా పలు సమస్యలు అన్నీ ఒకేసారి మన శరీరంపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? అంతా అయోమయం, గందరగోళంగా ఉంటుంది. నిజానికి ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తించి, చికిత్స తీసుకోవడం చాలా అసవరం. సంక్లిష్టమైన ఈ ఎండోక్రైన్ రుగ్మతకు తగిన చికిత్స చేయకపోతే తీవ్రమైన పరిణామాలు కూడా సంభవించే అవకాశం ఉంది. హార్మోనల్ ఇంబాలన్స్తో వచ్చే వ్యాధి పేరే కుషింగ్స్ సిండ్రోమ్. కార్టిసాల్ అనే హార్మోన్ సాధారణ స్థాయిల కంటే ఎక్కువైతే ఇది సంభవిస్తుంది.స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నా, శరీరంలో ఉత్పత్తి అయినా ఈ వ్యాధి మన శరీరంపై దాడిచేస్తుంది. ముఖంపై చర్మం బాగా నల్లగా మారిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, ఎక్కువగా పింపుల్స్ లాంటివి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు వీటితోపాటు మహిళల్లో అయితే గైనిక్ సమస్యలు మరింత వేధిస్తాయి. అలాగే విపరీతమైన మతిమరుపు మరో ప్రధాన లక్షణం. అయితే సమస్య ఇదీ అని తెలియక సంవత్సరాల తరబడి ఏవో మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. కుషింగ్స్ సిండ్రోమ్ లక్షణాలు ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ మెల్లిటస్, బోలు ఎముకల వ్యాధి, ఇన్ఫెక్షన్లు ,న్యూరోకాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయి. మొటిమలు, ముఖం విపరీతమైన నల్లగా మారి పోవడం బఫెలో హంప్ (మెడ వెనుక అదనపు కొవ్వు చేరి గూని లాగా ఏర్పడటం) పొత్తికడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు చేరడం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం లేదా హైపర్ గ్లూసేమియా అధిక దాహం, అలసట, అతి మూత్రవిసర్జన, తలనొప్పి, విపరీతమైన మతిమరుపు అధిక రక్త పోటు, అవాంఛిత రోమాలు, మహిళల్లో ఋతుక్రమంలో మార్పులతో పాటు మానసిక అస్థిరత, నిరాశ, తీవ్ర భయాందోళన. పురుషుల్లో వ్యంధ్యత్వం లాంటివి కూడా సంభవిస్తాయి. మరి ఈ వ్యాధి నిర్దారణ ఎలా? చికిత్స ఏంటి? పిట్యూటరీ గ్రంధిపై ట్యూమర్, అడ్రినల్ అడెనోమా (మూత్రపిండాలపై ట్యూమర్) అది విడుదల చేసే కార్టిసాల్ ఎక్కువ కావడమే ఇన్ని విపరీతాలకు కారణం. అయితే ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రం, రక్తం, హార్మోన్ల పరీక్ష ద్వారా కుషింగ్స్ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ కణితిని పూర్తిగా గుర్తించేందుకు సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలు అవసరం. పిట్యూటరీ రేడియో థెరపీ, స్టెరియాడ్ ఉత్పత్తిని నిరోధించడం, ఒక వేళ కణితి పెద్దదిగా ఉంటే ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకుంటూ, చిన్న చిన్న వ్యాయమాల ద్వారా స్వీయ రక్షణ పద్ధతులను పాటించాలి. కుషింగ్స్ వ్యాధి బారిన పడి కోలుకుంటున్న విశాఖ జిల్లా పాయకరావు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని విజయ భాను కోటె అనుభవం... “I” అనే సినిమా హీరో విక్రమ్ ఏదో కెమికల్ వలన హీరో వికారంగా మారిపోయినట్టే నేను కూడా దారుణంగా తయారయ్యా. అసలు నన్ను నేను గుర్తుపట్టుకోలేనంతగా ఎందుకు మారిపోయానో అర్థం అయ్యేది కాదు. దీనకి తోడు శారీరకంగా ఎన్నో సమస్యలు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగి తిరిగి, ఎన్ని రకాలుగా చికిత్సలు తీసుకున్నా లాభం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థ అయ్యేదికాదు. ఈ డిప్రెషన్‌కు గెలవాలనే పట్టుదలతో విపరీతమైన పనికి అలవాటు పడిపోయాను. రోజుకు వంద పనులు కల్పించుకున్నాను. అసలు నొప్పి లేని రోజంటూ లేని నా జీవితంలో నొప్పినే నేస్తంగా భావించాను. 2021 జూన్ లో విపరీతంగా పెరిగిన రక్తపోటు వల్ల డాక్టర్ MRI ద్వారా నాదొక రేర్ డిసీజ్ అని తేలింది. దీన్ని నమ్మాలో వద్దో అర్థం కాలేదు. పదేళ్లు నరకం చూశా.. ఇప్పటికీ భరించలేని నొప్పులు కానీ పదేళ్ల నరకం తరువాత నా బాధలకు కారణం ఏంటో ఎట్టకేలకు తెలిసిందన్న ఒక్కటే సంతోషం. చాలా ప్రయత్నాల తరువాత చివరికి సర్జరీ జరిగింది. అలా నా వ్యాధిని కనిపెట్టిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ వంశీ కృష్ణ, నాకు సర్జరీ చేసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ బి ఎస్ వి రాజు, ఇలా నాకు చికిత్స చేసిన వైద్యులందరూ నా పాలిట దేవుళ్ళు. సర్జరీ జరిగిన రెండో నెలలకి బరువు తగ్గి, నల్లటిముఖంలో కాస్త మార్పు వచ్చినా ముక్కలుగా విరిగిపోయిన పళ్ళు ఇక బాగు కావనేది అర్థం అయిపోయింది. ఇప్పటికీ ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే..ఇక ఆ బాధలు చెప్పలేను..చిన్న ఇంజెక్షన్‌కు కూడా నానా యాతన అనుభవించాలి. కదుములు కట్టేస్తాయి. అసలు నా జీవితంలో కోలుకోవడం అంటే ఏమిటో అర్థం కావడంలేదు. ఒక విధంగా నేను బ్రతికి ఉండడం గొప్ప. స్టెరాయిడ్స్ లేకుండా లేవలేను. ఏ పనీ చేయలేను. నా లాంటి కష్టాలు మరెవ్వరికీ రాకూడదనేది నా తాపత్రయం అందుకే దీనికి గురించి అందరికీ తెలియాలని ఆరాటపడుతున్నా. ఇన్ని నష్టాలు జరగకుండా ముందే వ్యాధి నిర్ధారణ కావడం చాలా ముఖ్యం. కుషింగ్స్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా ముందు ఎండోక్రినాలజిస్ట్‌ను కలవాలి. హార్మోన్ టెస్ట్స్ చేయించుకోవడం చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా కుషింగ్స్పై పరిశోధనలు జరుగు తున్నాయి. అదే మాదిరిగా ఇండియాలో కుషింగ్స్ సిండ్రోమ్ రోగులపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని.. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన రావాలి, దీనిపై విస్తృతంగా ప్రచార జరగాలి అంటారు విజయభాను. -
అవగాహనే అసలు మందు
- థైరాయిడ్ బాధితుల్లో ఆడవారే అధికం - అవగాహనతో వ్యాధి నియంత్రణ - నేడు వరల్డ్ థైరాయిడ్ డే న్యూస్‌లైన్, గుంటూరు మెడికల్, ఎంత తిన్నా లావుగా కాకపోవడం, కొందరు అధికంగా బరువు పెరగడం, అలసట, చర్మం ఎండిపోవడం.. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించడం మంచిదని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎండ్రోకైనాలజిస్ట్ డాక్టర్ పతకమూరి పద్మలత తెలిపారు. థైరాయిడ్ గ్రంథిపై చాలామందికి సరైన అవగాహన లేకపోవటంతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోలేక పోతున్నట్లు చెప్పారు. నేడు వరల్డ్ థైరాయిడ్ డే. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు ‘న్యూస్‌లైన్’కు వివరించారు. థైరాయిడ్ గ్రంథి అంటే.. గొంతు ముందు భాగంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా గులాబీ రంగులో ఇంచుమించు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఇది 20గ్రాముల బరువు ఉండి శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. శరరీం, ఎముకల పెరుగుదలను, ఉష్ణోగ్రతను, మానసిక వికాసాన్ని అదుపుచేస్తుంది. వివిధ కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ హార్మోను ఉత్పత్తికి మన శరీరంలో తగినంత అయోడిన్ అవసరం. థైరాయిడ్ లోపం వల్ల.. - థెరాయిడ్ లోపంతో హుషా రు తగ్గుతుంది. విపరీతమైన అలసట వస్తుంది. నడవాలన్నా , పనిచేయాలన్నా ఓపిక ఉండదు. చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. - కండరాలు ఉబ్బుతాయి. మలబద్ధకం, కండరాలు పట్టివేసినట్లు ఉండటం, చర్మం కింద కొవ్వు చేరి బరువు పెరుగుతారు. గొంతు బొంగురుగా మారటంతో పాటు ముఖం గుండ్రంగా కనపడుతుంది. - జీవక్రియ స్థాయి విపరీతంగా పెరిగి శరీరంలోని అన్ని శక్తి వనరులు ఖాళీ అవుతాయి. ఎముకల్లో క్యాల్షియం తక్కువై ఎముకలు పెలుసు బారతాయి. తలమీద వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. ముఖ్యంగా కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. - పిల్లలో పెరుగుదల ఉండదు. స్త్రీల రుతుచక్రంలో మార్పులు రావటం, గర్భం రావటం ఆలస్యం అవ్వటం, తరచుగా గర్భస్రావాలు జరగటం తదితర లక్షణాలు ఉంటాయి. వందలో పదిమందికి.. - ఈ వ్యాధి అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి వస్తుంది. - జీజీహెచ్‌కు వైద్యం కోసం వచ్చే వారిలో 100 మందిలో పదిమంది ఈ వ్యాధి బాధితులే. - మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా థైరాయిడ్ గ్రంథి సమస్య వస్తోంది. ఆడవారిలో 80శాతం మందికి ఉంటే మగవారిలో - - 20శాతం మందికి వస్తుంది. దీనికి జీవితాంతం మందులు వాడాలి. - వ్యాధి సోకిన వారికి ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా లక్షణాలు ఉంటాయి. - ఆహారంలో అయోడిన్ లోపం లేకుండా చూసుకోవటం వల్ల కొంతవరకు థైరాయిడ్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. - జన్యుపరలోపాల వల్ల, తల్లికి ఉంటే బిడ్డకు, వంశ పారంపర్యంగా ఈ వ్యాధి వస్తుంది. - అప్పుడే పుట్టిన బిడ్డకు థైరాయిడ్ ఉందో లేదో నిర్ధారణ పరీక్ష చేయించటం చాలా ఉత్తమం. డాక్టర్ పద్మలత, ఎండ్రోకైనాలజిస్ట్