breaking news
endala lakshminarayana
-
ఊరి కోసం పండుగ... 75 ఏళ్లుగా ఉత్సాహంగా జరుపుకుంటున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 75 సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రారంభమైన ఊర పండుగ (పెద్ద పండుగ)కు నగర ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత ఏటేటా మరింతగా పెరుగుతోంది. నగరంలో 12 చోట్ల గ్రామ దేవతల గుడులను ఏర్పాటు చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వచ్చే నెల 9న నిజామాబాద్‌లో ఈ ఊర పండుగ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 54 కుల సంఘాలతో కూడిన సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనే ఈ పండుగ ఉత్సవాలు, ఊరేగింపులు భారీ ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నగరంలోని 12 ప్రాంతాల్లో.. నిజామాబాద్ నగరంలోని మూడు ఏరియాల్లోని 12 చోట్ల గ్రామ దేవతల గుడులు ఉన్నాయి. దుబ్బ లో రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడాలమ్మ గుడులు, వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ గుడులు, సిర్నాపల్లి గడి రోడ్డు లో కొండల్ రాయుడు, బోగస్వామిలు పేరిట నాలుగు గుడులు, సమ్మక్క సారక్క పేరిట ఒక గుడి ఉన్నాయి. ఈ 12 గ్రామ దేవతల గుడులకు సంబంధించిన ఊరేగింపు ఖిల్లా వద్ద ఉన్న గద్దె నుంచి వచ్చే నెల 9న ప్రారంభమవుతుంది. అంతకు ముందు 4వ తేదీన బండారి పోసి క్రతువును ప్రారంభించనున్నారు. ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్‌నగర్, సిర్నాపల్లి గడి రోడ్డు విభాగాలుగా విడిపోతుంది. తరువాత 12 గ్రామ దేవతల గుడులకు తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలో గాజుల్‌పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) కోసం ప్రజలు ఎగబడతారు. ఊరేగింపు రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు మొదలవుతుంది. మామిడి కర్రతో విగ్రహాలు.. 12 గ్రామ దేవతల గుడుల్లో ప్రతిష్ఠించడానికి ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మామిడి కర్రతో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. నగరంలోని నకాస్ గల్లీలో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. బండారు పోసిన తరువాత ఈ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. కర్ర విగ్రహాలను ధర్మరాజు, విఠల్ కుటుంబాలు వంశపారంపర్యంగా తయారు చేస్తూ వస్తున్నాయి. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. మరిన్ని సంఘాల భాగస్వామ్యం పెద్ద పండుగ ఉత్సవం, ఊరేగింపు కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు మరిన్ని సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తూ వస్తున్నాం. దీంతో ప్రజల్లో ఐకమత్యం పెరుగు తోంది. మరోవైపు రాజకీయాలకతీతంగా ఈ క్రతువును ముందుకు తీసుకెళుతూ విజయవంతంగా పయనిస్తున్నాం. – యెండల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు, సర్వసమాజ్ కమిటీ -
గెలిస్తే లోక్‌సభకు వెళ్లే వాడిని
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ ఎంపీగా గెలిచి ఉంటే పార్లమెంట్‌కు వెళ్లేవాడినని బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఓడిపోయినందున స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతానని, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలని కోరుకున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండేది కాదన్నారు. ఇప్పుడు మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విస్పష్టమైన తీర్పు ఇచ్చిన, బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లధనాన్ని వెలికి తీయడం, అవినీతి రహిత దేశాన్ని నిర్మించడం, ఉగ్రవాదాన్ని నియంత్రించడం, సమర్థ పాలన అందించడం మోడీతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, శుక్రవారం నాటి ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లాలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పునర్నిర్మాణంలో భాగమవుతాం తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపి, బిల్లు పాసవడానికి బీజేపీ ఎంతగానో కృషి చేసిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర పునర్నిర్మాణానికీ కృషి చేస్తామన్నారు. పార్టీకి ఓటేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో పార్టీ ఘన విజయం సాధించినందుకు మిఠాయిలు పంచా రు. సమావేశంలో పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు టక్కర్ హన్మంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ బాపురెడ్డి, నగర అధ్యక్షులు గజం ఎల్లప్ప, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కల్పన గణేశ్‌కుమార్, పార్టీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, న్యాలం రాజు, గణేశ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.