ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఐదారేళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దందా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–ఎన్ఈడబ్ల్యూ) రట్టు చేసింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తంగా రూ. 1.4 కోట్ల విలువైన 1.38 కిలోల ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా (ఓజీ) పిలిచే హైడ్రోపోనిక్ గంజాయి, 44 ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథిలమైడ్) బ్లాట్లు, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్ (సైలోసైబిన్ డ్రగ్), మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.కస్టమర్ నుంచి పెడ్లర్‌గా మారి... సికింద్రాబాద్‌కు చెందిన అభిషేక్ ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ ఐఐఐటీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. రాయ్‌పూర్‌లో ఉండగా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన అతను.. తేలిగ్గా డబ్బు సంపాదన కోసం పెడ్లర్గానూ మారాడు. అభిషేక్‌కు డార్క్ వెబ్‌లో ఉన్న డ్రెడ్ మార్కెట్ అనే కమ్యూనిటీ ద్వారా ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన ఓజీ, ఎల్ఎస్డీ కోసం సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఆర్డర్ ఇచ్చేవాడు.జబల్పూర్కు చెందిన హర్షవర్థన్ శ్రీవాస్తవ బీ–ఆర్క్ పూర్తి చేసినప్పటికీ ఆ రంగంపై ఆసక్తిలేక ఓ స్టార్టప్ కంపెనీ తెరవడానికి డబ్బు కోసం డ్రగ్ పెడ్లర్ అవతారం ఎత్తాడు. డ్రెడ్ మార్కెట్ ద్వారానే ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కి లోకల్ ఏజెంట్‌గా మారాడు. అయితే అతనికి డ్రగ్స్ అలవాటు లేకపోవడం గమనార్హం. సికింద్రాబాద్‌కు చెందిన మరో ఆర్కిటెక్ట్ ధావల్ కూడా హర్షవర్థన్‌కు మరో పెడ్లర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే డ్రగ్స్ సప్లయిర్ అయిన చెన్నైవాసి బి. శ్రీనివాస రాహుల్‌ను కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకున్న అభిషేక్ అతన్నుంచి డ్రగ్స్ కొని విక్రయిస్తున్నాడు. ఈ దందాపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు, నల్లకుంట ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్‌రావు తమ బృందాలతో వలపన్ని హర్షవర్థన్, రాహుల్, ధావల్, అభిషేక్‌లను నగరంలో పట్టుకున్నారు. రాహుల్ చెన్నైతోపాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా సరఫరా... థాయ్‌లాండ్ నుంచి ఓడల ద్వారా డ్రగ్స్ భారత్‌లోకి.. అక్కడి నుంచి జబల్పూర్లో ఉంటున్న హర్షవర్థన్ వద్దకు చేరుతున్నాయి. అతను వినియోగదారుడికి కొరియర్ సంస్థల ద్వారా పంపుతున్నాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పార్శిల్ బుక్ చేసేటప్పుడు చిరునామా, ఫోన్ నంబర్ ఇచ్చి ట్రాకింగ్ ఐడీని మాత్రం అభిõÙక్ వంటి వినియోగదారులకు పంపుతున్నాడు. ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరగానే అక్కడకు వెళ్లి వారు తీసుకొనేవారు. హ్యాండ్లర్ నుంచి డ్రగ్స్‌ను ఔన్స్ (28.34 గ్రాములు)కు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించి తెప్పించుకొని వినియోగదారులకు ఔన్స్‌కు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల మధ్య విక్రయిస్తున్నారు.