breaking news
emoloyees
-
వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు వేతనం
సాక్షి, హైదరాబాద్: విపత్కర సమయంలో చెమటోడ్చి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి వేతనం/గౌరవవేతనంలో 10 శాతం ప్రోత్సాహకం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వీరితో పాటు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజి బోర్డులోని రెగ్యులర్, ఔట్సోర్సింగ్ వాటర్ సప్లై లైన్మన్లు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500, జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.5,000, రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్లకు రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మార్చి నెలలో విధులు నిర్వహించిన సిబ్బందికి మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని, వివిధ కారణాల వల్ల ఆయా శాఖల్లో సస్పెండ్ అయిన ఉద్యోగులు, అధికారిక, అనధికారిక సెలవుల్లో ఉన్న వారికి ఈ ప్రోత్సాహకాలు వర్తించబోవని స్పష్టం చేశారు. వేతనాల్లో కోత ‘కట్’: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూఎస్ ఉద్యోగులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బందికి మార్చి నెల వేతనంలో 10 శాతం వాయిదా వేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గతంలో విడుదల చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఆరోగ్య శాఖలో అక్రమార్కులపై వేటు
హైదరాబాద్: ఆరోగ్య శాఖలో అక్రమార్కులపై వేటు పడింది. డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న సాంబశివరావుతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపైనా వేటు పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గత జనవరిలో ఆ శాఖా మంత్రినే తప్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆదే శాఖలో ముగ్గురిపై సస్పెన్షన్ విధించడంతో ఒక్కసారిగా ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద సుమారు 1,500 మంది పారామెడికల్ సిబ్బంది, 1,000 మంది వైద్యుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం గత నవంబర్‌లో నిర్ణయించింది. వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో నియమించాల్సి ఉండగా అధికారులు ఔట్ సోర్సింగ్‌లో భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. వైద్యుల నియామకానికి సుమారు రూ.5 లక్షలు, పారామెడికల్ సిబ్బందికి రూ.2 లక్షలకు బేరం పెట్టినట్లు ఇంటెలిజెన్స్ విభాగం ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించింది. దీంతో వీరి వ్యవహారం బయటపడింది. వెంటనే అందుకు బాధ్యులుగా ఉన్న చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌లను బాధ్యతల నుంచి తప్పించింది. దీనిపై కమిషనర్ బుద్ధప్రకాశ్ విచారణ నిర్వహించి తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో మరో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.