breaking news
ellampally
-
నీటమునగనున్న రాయపట్నం వంతెన
కొత్త వంతెనపై రాకపోకలు ప్రారంభం భారీ వాహనాలను అనుమతించని పోలీసులు ధర్మపురి : ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో రాయపట్నం లో లెవల్ వంతెన మునిగిపోనుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ రాయపట్నం వద్ద గోదావరినదిపై లో లెవల్ వంతెనను ఆరవై ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ వంతెన పలుమార్లు గోదావరినదికి వరదలు వచ్చినప్పుడు నీటమునుగుతోంది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయడం వల్ల రెండు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. అయితే ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యం మేరకు 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ధర్మపురి వరకు చేరుకుని వంతెన నీట మునుగుతుందని గుర్తించిన ప్రభుత్వం గోదావరినదిపై కొత్త హైలెవల్ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. కొత్త బ్రిడ్జి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. గత పదిహేను రోజులుగా గోదావరినదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ధర్మపురి వరకు చేరింది. దీంతో ఆదివారం సాయంత్రానికి పాత వంతెన స్లాబ్ వరకు నీటిమట్టం చేరింది. సోమవారం వరకు వంతెన స్లాబ్ నీటమునిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో గత పదిహేను రోజులుగా వంతెన పై నుంచి భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను, కార్లను మాత్రమే అనుమతిస్తుండగా, ఆదివారం సాయంత్రం నుంచి వాటిని కూడా నిలిపివేశారు. పాతవంతెన మార్గాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు, కొత్త వంతెన మీదుగా వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నందున భారీ వాహనాలను నియంత్రించారు. -
ఎల్లంపల్లికి పెరిగిన ఇన్‌ఫ్లో
రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఆదివారం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 143.72 మీటర్లకు చేరింది. 10.193 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,886 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో సిటీస్‌కు 158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.