వాతావరణ మార్పులు భూగోళానికే ముప్పు
యూఎన్ఈపీ మాజీ డెరైక్టర్ రాజేంద్ర షిండే
నిట్‌లో ఉత్సాహంగా కొనసాగుతున్న టెక్నోజియూన్-14
నిట్ క్యాంపస్ (వరంగల్) : గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు భూగోళానికే ముప్పుగా పరిణమించాయనీ, సహజ వనరులను ఉపయోగించుకుని ఇంధన వనరులుగా మార్చడం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకుని భూగోళాన్ని రక్షించుకోగలుగుతామని యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) మాజీ డెరైక్టర్ రాజేంద్ర షిండే అన్నారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సాంకేతిక ఉత్సవం టెక్నోజియూన్-14 ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండోరోజు శుక్రవారం జరిగిన కార్యక్రమానికి రాజేంద్ర షిండే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బొగ్గు, న్యూక్లియర్ విద్యుత్ వాడకం వల్ల భూమికి ముప్పు పొంచి ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా గాలి, సూర్యరశ్మిని ఉపయోగించుకున్నట్లయితే గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించవచ్చన్నారు.
ఎయిర్‌కండిషనర్లు, వాహనాలు, మీథేన్ గ్యాస్ వాడకం వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటుందన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. న్యూక్లియర్ ప్లాంట్లవల్ల పర్యావరణం బాగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. 2100 నాటికి భూగోళం ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో తుపాను, అమెరికాలో అధికవర్షాలు, సముద్రజలాలు పెరగడం వంటివి భూగోళం విపత్తుల్లోకి వెళ్లిందనే దానికి నిదర్శనాలన్నారు. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ వాడకం తగ్గిందని, కరెంట్‌ను పొదుపుగా వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. సహజవనరులను ఇంధన వనరులుగా మార్చుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా పరిశోధనలు చేయూలన్నారు.