breaking news
earth extinction
-
ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..!
భూతాపం సెగలకు అంతర్జాతీయ వేదికలు వేడెక్కుతున్నాయి. శిలాజ ఇంధనాలకు వీలైనంత తొందరగా తిలోదకలాచ్చేసి, శరవేగంగా ఎలక్ట్రిక్ శకాన్ని ప్రారంభించడానికి ప్రపంచ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. భూతాపం దూకుడును కట్టడి చేయడానికి కలసికట్టుగా నడుంబిగిస్తున్నామని బల్లలుగుద్ది మరీ బలంగా చెబుతున్నారు. ఇవన్నీ సరే, టీవీలూ మొబైల్ ఫోన్లూ ఇంటింటి వస్తువులుగా మారిన హైటెక్కుటమారాల యుగంలో రోజూ పోగుపడుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు– అదేనండీ– ఈ–చెత్త! దీనికి సరైన విరుగుడు ఎప్పటికి దొరుకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. భూతాపం పెరుగుదలలో ఈ–చెత్త ఇతోధిక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఎక్కడెక్కడ ఎంతెంతగా తయారవుతోందో, ఎక్కడెక్కడ ఎంతెంతగా పోగుపడుతోందో, ఇది పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ స్థాయిలో చేటు కలిగిస్తోందో ఆ కథా కమామిషూ తెలుసుకుందాం. తాజా అంచనాల ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పోగుపడిన ఈ–చెత్త 53.6 మిలియన్ టన్నులు. ఏడాదికేడాది ఈ–చెత్త కొండలా పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అంటే, ప్రపంచంలో ప్రతి మనిషి సగటున దాదాపు ఏడు కిలోల ఈ–చెత్త పోగు చేస్తున్నట్లు లెక్క! అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాని స్థితికి చేరుకున్నాక, ఇవి తుక్కు తుక్కుగా చెత్త చెత్తగా మిగులుతున్నాయి. ఈ–చెత్త విలువలేనిదేమీ కాదు, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.75 వేల కోట్లు) విలువ చేసే ప్లాటినమ్, బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఈ–చెత్తతో పాటే డంపింగ్ యార్డులకు చేరుతున్నాయి. మన భారత్ నుంచి ఏటా 3 మిలియన్ టన్నులకు పైగా ఈ–చెత్త పోగవుతోంది. ఎడాపెడా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడి పడేసే అభివృద్ధి చెందిన దేశాలు, తమ దేశాల్లో పోగుపడిన ఈ–చెత్తను పారబోయడానికి నిరుపేద దేశాలను డంపింగ్ యార్డుల్లా వాడుకుంటున్నాయి. మరో నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఏటా 33 శాతం మేరకు పెరుగుతుందని, ఈ పరిమాణం ఎనిమిది గ్రేట్ ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే ఎక్కువని ఐక్యరాజ్య సమితి ‘స్టెప్ ఇనీషియేటివ్’ (సాల్వింగ్ ఈ–వేస్ట్ ప్రాబ్లెమ్ ఇనీషియేటివ్) హెచ్చరిస్తోందంటే, ఈ–చెత్త సమస్య ప్రపంచానికి ఏ స్థాయిలో ముప్పుగా పరిణమిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త సమస్యగా పరిణమించిన ఈ–చెత్త సమస్య పరిష్కారం కోసమే ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం 2007లో ‘స్టెప్ ఇనీషియేటివ్’ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ట్యాబ్‌లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు తదితర వస్తువులు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలు ప్రతిఏటా పెద్దసంఖ్యలో తయారవుతున్నాయి. కొత్తగా ఎన్ని తయారవుతున్నాయో, అందుకు తగ్గట్లే పాతబడినవి, పనికిరాకుండా పోయినవి చెత్తగుట్టలకు చేరుకుంటున్నాయి. ఇళ్లలో పేరుకునే రోజువారీ తడిచెత్త, పొడిచెత్తలతో పోల్చి చూస్తే, ఈ–చెత్త పర్యావరణానికి మరింతగా హాని కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్లాటినమ్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు, సీసం, తగరం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, లిథియం, బేరియం వంటి ప్రమాదకరమైన భారలోహాలు కూడా ఉంటాయి. ఒక సాదాసీదా మొబైల్ లేదా లాప్టాప్ సర్క్యూట్బోర్డులో పదహారు వేర్వేరు లోహాలు ఉంటాయి. ఇవి నేలలోకి చేరుకుంటే, భూసారం క్షీణిస్తుంది. జలాశయాల్లోకి చేరుకుంటే, తాగునీటి కాలుష్యం తప్పదు. చివరకు సముద్రాల్లోకి చేరినా, సముద్రాల్లో జీవించే జలచరాల మనుగడకు ముప్పు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం ప్లాస్టిక్. చెత్తకుప్పల్లోకి చేరిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించేందుకు వీటిని ఇష్టానుసారం తగులబెడుతుండటం మామూలే. ఫలితంగా ఈ–చెత్త వల్ల వాయుకాలుష్యం కూడా ఏర్పడుతోంది. ‘సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎప్పటికప్పుడు అధునాతనమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా, కొనుగోలు చేసిన కొద్దికాలానికే మొబైల్ ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు వంటివి మూలపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల జీవితకాలం బొత్తిగా తక్కువవుతోంది. ఫలితంగా ఈ–చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది’ అని స్టెప్ ఇనీషియేటివ్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ర్యూడిగర్ క్వెహర్ చెబుతున్నారు. ‘ఈ–చెత్త వల్ల కలిగే అనర్థాలను కొన్నిదేశాలు మాత్రమే అర్థం చేసుకుని, చర్యలు ప్రారంభించాయి. చాలా దేశాల్లో ఏటా పోగుపడే ఈ–చెత్తపై కచ్చితమైన లెక్కలు సేకరించే పరిస్థితి కూడా లేదు’ అని యూరోపియన్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ దేశాల నుంచి ఏటా దాదాపు 1.3 మిలియన్ టన్నుల ఈ–చెత్త వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఓడల్లో తరలుతోందని కూడా ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ–చెత్తకు డంపింగ్ యార్డులుగా మారిన ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఏటా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు ఇరవై శాతానికి పైగా మరణాలు ఈ–చెత్త కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవేనని, ఇక దీని ఫలితంగా రకరకాల వ్యాధులకు లోనవుతున్న వారి సంఖ్య ఊహించుకోవాల్సిందేనని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ–చెత్తలో మనది మూడోస్థానం మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 మిలియన్ టన్నుల ఈ–చెత్త పేరుకోవచ్చని ‘స్టెప్ ఇనీషియేటివ్’ అంచనా. ఈ–చెత్త పరిమాణంలో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 10.1 టన్నులు, అమెరికాలో 6.9 మిలియన్ టన్నులు, భారత్‌లో 3.2 మిలియన్ టన్నులు ఈ–చెత్త పోగుపడినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ దేశంలో పోగుపడిన ఈ–చెత్తను తమ దేశంలోనే రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేయకుండా, నిరుపేద దేశాలకు తరలిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, నిరుపేద ఆఫ్రికా దేశమైన ఘనాలో అగ్రరాజ్యాలు పోగేస్తున్న ఈ–చెత్తపై 2018లో ‘వెల్కమ్ టు సోడోమ్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. విషపూరితమైన ఈ–చెత్తకుప్పల మధ్యే అక్కడి పిల్లలు కాలం గడుపుతున్న దృశ్యాలు కలచివేస్తాయి. ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యే కార్మికులు తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, ఛాతీనొప్పి, నీరసం, మగత, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతున్నారు. ఈ–చెత్త కుప్పల మధ్యే ఎక్కువకాలం గడిపేవారిలో డీఎన్ఏ సైతం దెబ్బతింటున్నట్లు వైద్యపరిశోధకులు గుర్తించారు. ఏటా పోగవుతున్న ఈ–చెత్తను రీసైక్లింగ్ కోసం సేకరించే శ్రద్ధ కూడా మన దేశంలో బొత్తిగా కొరవడుతోంది. ఈ ఏడాది విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, 2018–19లో పోగైన ఈ–చెత్తలో 3.5 శాతం, 2019–20లో 10 శాతం మాత్రమే రీసైక్లింగ్ కోసం సేకరించారు. మిగిలిన ఈ–చెత్తంతా పర్యావరణంలోకే చేరుతోంది. మన దేశంలో స్థానిక సంస్థలు ఈ–చెత్త సేకరణ జరుపుతున్న దాఖలాలు దాదాపు కనిపించవు. దేశవ్యాప్తంగా కేవలం 312 అధికారిక కేంద్రాలు మాత్రమే ఈ–చెత్త సేకరణ అరకొరగా జరుపుతున్నాయి. ఇవికాకుండా, ఢిల్లీలోని సీలమ్పూర్, ముంబైలోని ధారవి, మీరట్, మొరాదాబాద్ వంటి చోట్ల అనధికారిక ఈ–చెత్త రీసైక్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇలాంటి అనధికారిక ఈ–చెత్త సేకర్తలను స్థానికంగా ‘కబాడీవాలా’లుగా పిలుచుకుంటారు. ఎలాంటి శిక్షణ లేని కార్మికులు, కనీసమైన వసతులు, జాగ్రత్తలు సైతం లేని ఈ కర్మాగారాల్లో ఈ–చెత్త రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి ఒరిగే మేలు కంటే జరిగే కీడే ఎక్కువగా ఉంటోంది. సేకరించిన ఈ–చెత్తకు వీరు చేసే రీసైక్లింగ్ అంతా, పాడైన పరికరాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించడమే! ఈ పనికోసం వారు సైనైడ్ కలిసిన యాసిడ్లను వాడుతుంటారు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరితమైన పొగవల్ల ఆ కేంద్రాల్లో పనిచేసే కార్మికులతో పాటు చుట్టుపక్కల ప్రజలకు కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి ద్వారా వెలువడే నీరు కొంత వీధుల్లోకి, కొంత మురుగు కాలువల్లోకి, వాటి ద్వారా సమీపంలోని జలాశయాల్లోకి, నదుల్లోకి చేరుతుండటంతో నీటి కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! చట్టాలూ నిబంధనలూ ఉన్నా... మన దేశంలో కాలుష్య నివారణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1974లో జల చట్టం కింద కాలుష్య నియంత్రణ మండలిని జాతీయస్థాయి సంస్థగా ఏర్పాటు చేసింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటైన కాలానికి ఈ–చెత్త బెడద అంతగా ఉండేది కాదు. కంప్యూటర్ల శకం మొదలైన తర్వాత ఈ–చెత్త తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇది ప్రపంచ సమస్యగా మారిన నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ వేదికల్లో జరిగిన చర్చల్లో దీనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి వివిధ దేశాలు సిద్ధపడ్డాయి. ఇందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్’ను 2016లో రూపొందించగా, ఈ నిబంధనలు 2017 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఈ–చెత్త రీసైక్లింగ్ చేయాలి. ఈ నిబంధనలు అమలులోకి వచ్చినా, దేశంలో అనుమతి పొందిన రీసైక్లింగ్ కేంద్రాల కంటే, కనీస సౌకర్యాలు లేని అనధికారిక రీసైక్లింగ్ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా పేరుకుపోతున్న ఈ–చెత్తతో పోల్చి చూసుకుంటే, రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతున్నది చాలా తక్కువ. మిగిలినదంతా ఖాళీస్థలాల్లోకి, నదులు, సముద్రాల్లోకి చేరుతూ పర్యావరణానికీ, ప్రజల ఆరోగ్యానికీ భారీ స్థాయిలో చేటు కలిగిస్తోంది. ఇవీ ఆరోగ్య నష్టాలు ఈ–చెత్త పర్యావరణంలోకి చేరిన పరిసరాల్లో జీవించే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ–చెత్త కారణంగా గాలి, నీరు, నేల కాలుష్యానికి లోనవుతాయి. ఈ–చెత్త వల్ల ఏర్పడే కాలుష్యానికి బహిర్గతమైన వారిలో ఎదుగుదల లోపాలు, బుద్ధిమాంద్యం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, వంధ్యత్వం, హార్మోన్ల అసమతుల్యతలు, కిడ్నీ, లివర్, గుండె వంటి కీలక అవయవాల పనితీరు దెబ్బతినడం, డీఎన్ఏ మార్పులు, కండరాల బలహీనత, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు అకాల మరణాలకు కారణమవుతాయి. ప్రమాద ఘంటికలపై ప్రపంచం ఆందోళన భూతాపం పెరుగుదలపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టే లక్ష్యంతో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ దేశాల సమావేశాలను (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–సీఓపీ–26) నిర్వహించింది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన సమావేశంలో సైతం పెరుగుతున్న భూతాపం కారణంగా పర్యావరణంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే మోగుతున్న ఈ ప్రమాద ఘంటికలను పట్టించుకోకుంటే, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాయి. భూతాపాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రపంచ దేశాలు కూలంకషంగా చర్చలు సాగించి, పలు ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయి. 2030 నాటికి కనీసం 30 శాతం నేలను, నీటిని పరిరక్షించుకోవాలని, ఈ మేరకు నేలపైనా, నీటిలోనూ జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ గడువులోగా దేశాలన్నీ అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని, 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలకు కారణమయ్యే శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా నడుం బిగించుకోవాలని తీర్మానించుకున్నాయి. గ్లాస్గోలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పాశ్చాత్యదేశాల్లో ఒత్తిళ్లకు భారత్ తల ఒగ్గబోదని స్పష్టం చేస్తూనే, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను అరికట్టడానికి సత్వర చర్యలను ముమ్మరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని అరికట్టడంపైనే దృష్టిసారించారు. పర్యావరణానికి చేటు కలిగిస్తున్న ఈ–చెత్త అంశానికి సీఓపీ–26 అజెండాలో చోటివ్వకపోవడం శోచనీయం. పర్యావరణ మార్పులపై చేపట్టే అంతర్జాతీయ సమావేశాల్లో ఈ–చెత్త అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, భూతాపాన్ని తగ్గించే లక్ష్యాలను చేరుకోవడం దుస్సాధ్యం. ఈ–చెత్తలో చేరుతున్నవివే! ఈ–చెత్తలో చేరుతున్న వస్తువులను యూరోపియన్ యూనియన్ పది రకాలుగా విభజించింది. అవి: ►భారీ గృహపరికరాలు (ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటివి) ►చిన్న గృహపరికరాలు (ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లు, డిజిటల్ వాచీలు వంటివి) ►ఐటీ–టెలికం పరికరాలు (లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు తదితరమైనవి) ►వినియోగదారుల వస్తువులు (డిజిటల్ కెమెరాలు, పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్ వంటివి) ►లైటింగ్ పరికరాలు (ట్యూబ్‌లైట్లు, ఎల్ఈడీ లైట్లు, వాటి హోల్డర్లు వంటివి) ►ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్ పనిముట్లు ►ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు ►వైద్య పరికరాలు (బీపీ యంత్రాలు, సుగర్ యంత్రాలు వంటివి) ►మానిటరింగ్ పరికరాలు (సీసీ కెమెరాలు వంటివి) ►ఆటోమేటిక్ డిస్పెన్సర్స్ (వెండింగ్ మెషిన్లు, వెయింగ్ మెషిన్లు తదితరమైనవి) కబాడీవాలాల కథ ‘కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇవ్వడం ఏమీ ఎరుగని పసిపిల్లవాడి చేతికి కత్తిని ఇవ్వడం ఒకటే! కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇస్తే తమకు తాము ప్రమాదంలో చిక్కుకోవడమే కాకుండా, ఇతరులనూ ప్రమాదంలోకి నెట్టేస్తారు’ అని గోవాకు చెందిన ఈ–చెత్త సేకరణ సంస్థ ‘గ్రూప్ టెన్ప్లస్’ వ్యవస్థాపకుడు ఆష్లే డెలానే వ్యాఖ్యానించారు. ‘గ్రూప్ టెన్ప్లస్’ ఈ–చెత్త సేకరణ కోసం ప్రారంభించిన లైసెన్స్డ్ సంస్థ. కబాడీవాలాలు నడిపే కేంద్రాల్లో ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను మాత్రమే వేరు చేసి, మిగిలిన వాటిని యథేచ్ఛగా పర్యావరణంలోకి వదిలేస్తుంటారని, దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని డెలానే చెబుతున్నారు. ఉదాహరణకు ట్యూబ్‌లైట్, సీఎఫ్ఎల్ బల్బులు, కాలంచెల్లిన బ్యాటరీలు వంటివాటిని మట్టిలో పడేస్తే, వాటిలోని పాదరసం, సీసం వంటి ప్రమాదకర భారలోహాలు మట్టిలోకి చేరి, వాటి ఫలితంగా ఆ ప్రదేశంలోని మట్టి ఎందుకూ పనికిరానంతగా నాశనమవుతుందని, అక్కడ భూసారం శాశ్వతంగా దెబ్బతింటుందని ఆయన వివరించారు. ఇష్టానుసారంగా ఈ–చెత్త వ్యవసాయ భూముల్లోకి చేరితే, భవిష్యత్తులో ప్రజల ఆహారభద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..
Biggest holocaust will come in the late century: యుగాంతం గురించి ఇప్పటికే పలుపుకార్లు పలుమార్లు చక్కర్లు కొట్టాయి. అవి కేవలం వదంతులని కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే భూమి అంతరించిపోయేంతగాకాకున్న ఎన్నడూ కనీవినీ ఎరుగని కొత్తకొత్త రోగాలు, వాతావరణ మార్పులు ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాం. ఐతే తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు మరో సంచలనాత్మక హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యాగజైన్ ‘నేచర్' నిర్వహించిన సర్వేలో భూమిపై వాతావరణ మార్పులకు సంబంధించి అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ శతాబ్ధి చివరి నాటికి భూమిపై తీవ్ర మార్పులు సంభవిస్తాయని, త్వరలో భూమి నాశనమౌతుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. అంటే 2100 నాటికి భూమిపై భయంకరమైన మార్పులు సంభవించి, ఘోర మారణహోమం జరగబోతుందని ఆ నివేదిక సారాంశం. ప్రపంచ నలుమూలల నుండి 233 మంది ప్రకృతి శాస్త్రవేత్తలు రూపొందించిన ఐపీసీసీ వాతావరణ నివేదికలోఇది. చదవండి: North Korea: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఈ శాస్త్రవేత్తల్లో కొలంబియాలోని యాంటికోయా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చర్ పావోలా అరియాస్ కూడా ఉన్నారు. ప్రపంచం తీరు మారుతుందని, వనరులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నాయని, కాలుష్యం, హీట్‌వేవ్ రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటి మధ్య బతకడమే కష్టంగా మారుతోంది. వర్షాల గతి మారడం వల్ల తీవ్ర నీటి సమస్య తలెత్తి, మున్ముందు భయంకరమైన గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. చదవండి: పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!! ఇక గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ నాయకులు నత్తనడకన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగేకొనసాగితే ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏకకాలంలో మృత్యువాత పడే అవకాశం ఉంది. భూమిని రక్షించుకోవడానికి మనకిప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నట్లు నివేదిక చూపుతుందని ఆయన అన్నారు. 2100 నాటికి అకాల వర్షాలు, మేఘావృతాలు, సునామీలు, కరువులు, వరదలు వంటి విపత్తులు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతాయి. ఫలితంగా సమస్త మానవజాతి కష్టాలపాలవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
భూ ప్రళయం వస్తుందా?
ఏనాటికై నా భూగోళంపై ప్రళయం సంభవిస్తుందని, సముద్రాలు ముంచెత్తి, దావానలం దహించివేసి భూమిపై మానవుల మనుగడ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని దాదాపు 200 ప్రాచీన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో వాస్తవం లేకపోలేదని, భూప్రళయం సంభవించే రోజులు మరెంతో దూరంలో లేవని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ గ్రాహం హాంకాక్ తెలియజేస్తున్నారు. 12,800 ఏళ్ల క్రితం భూమిపై జీవజాలం సర్వనాశనమైన తీరులోనే మరో 20 ఏళ్లలో భారీ తోక చుక్కొకటి భూమిని ఢీకొనడం వల్ల మానవ జాతి సమస్తం నశించిపోతుందని గ్రాహం హెచ్చరిస్తున్నారు. 12,800 ఏళ్ల ప్రాంతంలో ‘యంగర్ డ్రయాస్’ అనే భారీ తోకచుక్క భూమిని ఢీకొనడం వల్ల మంచు పర్వతాలు కరగిపోయి సముద్రాలు పొంగి పొర్లాయని, మరోపక్క అడవులు దావానలంతో దగ్ధమయ్యాయని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. ఫలితంగానే జడల ఏనుగులు, రాక్షస బల్లులు నశించిపోయాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. నాడు కోటి మెగాటన్నుల బరువు గల తోకచుక్క గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భూగోళాన్ని ఢీకొట్టిందని, అణ్వాయుధ శక్తికి 20 లక్షల ఎక్కువ రెట్ల శక్తి వెలువడిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పుడు కూడా అలాంటి తోక చుక్కొకటి సూర్య కుటుంబం నుంచి భూమివైపు దూసుకొస్తోందని ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు విక్టర్ క్లూబ్, ఖగోళ శాస్త్రవేత్త బిల్ నాపియర్ చెబుతున్నారు. అయితే ఆ ప్రళయం ఎప్పుడూ సంభవిస్తుందో చెప్పలేమని వారు అంటున్నారు. కచ్చితంగా ఈ ప్రళయం 20 ఏళ్లలో సంభవిస్తుందని, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయని ‘మెజీషియన్స్ ఆఫ్ ది గాడ్స్’ అనే తన తాజా పుస్తకంలో హాంకాక్ వెల్లడించారు. భూమి పుట్టుపూర్వోత్తరాలు, ప్రళయాలు, తరతరాల నాగరికత చరిత్రను అవగాహన చేసుకున్న కొంతమంది మానవులు మాత్రం ప్రళయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2012లోనే భూ ప్రళయం వస్తుందనే ‘డూమ్స్ డే’ లాంటి ప్రచారాలు గతంలో జరిగిన విషయం తెల్సిందే.