breaking news
e-tailers
-
భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి స్టార్టప్ సంస్థలు డెలివరీ విభాగాన్ని విస్తరించటంపై దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరుకునేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నాయి. మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో కస్టమర్లను సొంతం చేసుకునేందుకు సరఫరా వ్యవస్థపై ఇవి దృష్టి పెట్టాయి. స్విగ్గీ, గ్రోఫర్స్, మిల్క్‌బాస్కెట్, షాడోఫాక్స్ తమ డెలివరీ ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు చేసుకోనున్నాయి. ఇక అమెజాన్, బిగ్‌బాస్కెట్ ఈ విషయంలో ఇంకా దూకుడు కనబరుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 51,500 డెలివరీ ఏజెంట్ల అవసరం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా. ఏడాది చివరికి ఇది 1,21,600కు పెరుగుతుందని టీమ్‌లీజ్ సహ వ్యవస్థాపకుడు రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. మరో హెచ్ఆర్ సంస్థ రాండ్‌స్టాండ్ ఇండియా సైతం తొలి ఆరునెలల కాలంలో 50వేల వరకు డెలివరీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. విస్తరణపై భారీగానే ఖర్చు ప్రముఖ డెలివరీ సంస్థలు పెద్ద ఎత్తున నిధులను ఇప్పటికే సమీకరించగా, ఇందులో గణనీయమైన వాటాను డెలివరీ సామర్థ్యాల విస్తరణకే ఖర్చు చేయనున్నట్లు రాండ్‌స్టాండ్ ఇండియా ఎండీ పౌల్ డుపియస్ చెప్పారు. ‘‘మెట్రోల వెలుపలికీ విస్తరించాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కార్యకలాపాల విస్తరణే ఉద్యోగుల నియామకాల పెరుగుదలకు కారణం’’ అని డుపియస్ వివరించారు. గ్రోసరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్... సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ ద్వారా గత నెలలో 60 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ నిధులతో ప్రస్తుత 3,000 డెలివరీ బృందాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఈ సంస్థ హెచ్ఆర్ విభాగం హెడ్ అంకుష్ అరోరా చెప్పారు. బిగ్‌బాస్కెట్ కూడా మరో 150 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా 4,000–5,000 మంది డెలివరీ సిబ్బందిని నియమించుకోనుంది. ప్రస్తుత వ్యాపారంలో వృద్ధితోపాటు నూతన వ్యాపార అవకాశాల ఫలితమే ఇదని గ్రోఫర్స్ హెచ్ఆర్ జీఎం తనుజా తివారి చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ డెలివరీ విభాగం విస్తరణపై పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ సైతం స్పష్టం చేసింది. అండమాన్స్‌లోని హావ్లాక్ ఐలాండ్, అసోంలోని మజూలి ఐలాండ్‌కు సైతం తాము డెలివరీ చేస్తున్నట్టు పేర్కొంది. జోమాటో జోరు... ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు గతేడాది సెప్టెంబర్ నాటికి 38 పట్టణాల్లో 74,000 మంది డెలివరీ భాగస్వాములుండగా, వీరి సంఖ్యను 213 పట్టణాల్లో 1,80,000కు పెంచుకుంది. మరో ఫుడ్ డెలివరీ స్విగ్గీ సైతం వచ్చే ఏడాదికి డెలివరీ భాగస్వాముల సంఖ్యను 1,25,000కు పెంచుకోనున్నట్టు తెలిపింది. షాడోఫాక్స్‌కు ప్రస్తుతం 12,000 మంది డెలివరీ ఏజెంట్లుండగా, వచ్చే ఏడాది ఇదే సమయానికి 25,000కు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో అభిషేక్ బన్సాల్ తెలిపారు. మిల్క్ బాస్కెట్‌కు 1,500 మంది డెలివరీ బృందం ఉండగా, ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసుకోవాలనుకుంటోంది. -
లాబీయింగ్ చేస్తున్నఫ్లిప్ కార్ట్ !
బెంగళూరు: ఈ-కామర్స్ సంస్థలకు ఇప్పుడిప్పుడే తత్త్వం బోధపడుతోందిట. తమ మధ్య కోల్పోయిన సఖ్యతను మెరుగు పరుచుకునేందుకు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ చైర్మన్ సచిన్ బన్సాల్ ఓ మెట్టు దిగొచ్చారట. ఈ-కామర్స్ సంస్థల మధ్య కరువైన సఖ్యతను పెంచి, రిటైలర్లకు చెక్ పెట్టాలని ఫ్లిప్ కార్ట్ చైర్మన్ సచిన్ బన్సాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారట. రిటైలర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) వంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేస్తున్న ఆదిత్య బిర్లా గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలకు కౌంటర్ గా తాము ఓ లాబీ గ్రూప్ ను ఏర్పాటుచేసుకోవాలని ఈ-కామర్స్ సంస్థలకు సచిన్ బన్సాల్ పిలుపునిస్తున్నారట. బన్సాల్ తో పాటు ఇతర ఈ-కామర్స్ , ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలు ఇటీవలే ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హాను కలిసి తమ ఆన్ లైన్ రంగ ఆందోళనలను ఆయనతో వెల్లబుచ్చుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బాధ్యతగా బన్సాలే నిర్వర్తించారని, అన్ని ఈ-కామర్స్ ప్లాంట్ ఫామ్ లకు తానే స్వయానా ఆహ్వానం పంపి, సిన్హాతో భేటీ అయినట్టు పేర్కొంటున్నాయి. తమ మధ్యనున్న ఈ తేడాను అడ్వన్ టేజ్ గా తీసుకున్న రిటైల్ సంస్థలు వారి లాబీ గ్రూప్ ఆర్ఏఐతో మొత్తం ఎకో సిస్టమ్ పై ప్రభావం చూపుతున్నాయని ఇప్పటికీ ఈ-కామర్స్ సంస్థలకు బోధపడిందని, ఆన్ లైన్ సంస్థలు సఖ్యతకు బన్సాల్ చొరవ తీసుకుంటున్నారని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మధ్య వ్యూహాలు, మార్గాలు వేరువేరుగా ఉంటాయని, కాని కొన్ని సమస్యలను మాత్రం కామన్ గా ఎదుర్కోవల్సి ఉంటుందని ఈ మీటింగ్ లో పాల్గొన్న ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈ కామెంట్లపై స్పందించడానికి ఫ్లిప్ కార్ట్ తిరస్కరించింది. అయితే తమను మాత్రం సిన్హాతో భేటికి ఆహ్వనించలేదని అమెజాన్ కంపెనీ అధికార ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇష్టారీతిలో డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తూ భారీగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఈ-టైలర్స్ కు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం ఏప్రిల్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోర్టల్ లో ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దని ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల పన్నులనూ ఈ-టైలర్స్ భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. విదేశీ ఫండెడ్ వెంచర్లను సైతం మార్కెట్ ప్లేస్ కార్యకలాపాలకే వాడాలని, డిస్క్కౌంట్లు గుప్పించడానికి వాడుకోకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది.