breaking news
dull back
-
ఎన్పీఏ సమస్య సత్వర పరిష్కారం కష్టమే!!
న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఇండియన్ బ్యాంకులు అతిపెద్ద మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యకు త్వరితగతిన పరిష్కారాన్ని చూడలేవని బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ తెలిపారు. దేశం పెట్టుబడుల కొరతను ఎదుర్కొంటోందని, జీడీపీలో ప్రస్తుత స్థూల పెట్టుబడుల వాటా 7.5–8 శాతం స్థిర వృద్ధికి సరిపోదని పేర్కొన్నారు. ఈయన 2017–18 వార్షిక నివేదికలో సంస్థ వాటాదారులకు రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ల కొరత, బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి అనే రెండు ప్రధాన అంశాల కారణంగా దేశ జీడీపీ వృద్ధి నెమ్మదించిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వార్షిక ప్రాతిపదికన 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో (6.7 శాతం) వృద్ధి చెందింది. 2016–17 ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.1 శాతం. 2013–14లో వృద్ధి కనిష్టంగా 6.4 శాతంగా నమోదయ్యింది. కొండలా భారీగా పేరుకుపోయిన ఎన్పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను నాశనం చేశాయని, లాభాలను హరించేశాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త దివాలా చట్టం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనివల్ల ఎన్పీఏల సమస్య సత్వర పరిష్కారాన్ని చూడలేదని తెలిపారు. జీడీపీపై పెట్టుబడుల కొరత ప్రభావాన్ని వివరిస్తూ.. ‘జీడీపీలో స్థూల స్థిర పెట్టుబడుల వాటా గత ఆరేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 7.5–8 శాతం స్థిర వృద్ధికి ఇది సరిపోదు’ అని పేర్కొన్నారు. దేశీ మోటార్‌సైకిల్ విక్రయాల తగ్గుదల సంస్థపై ప్రభావం చూపదని, మరింత మంచి పనితీరును ప్రదర్శిస్తుందని రాహుల్ బజాజ్ తెలిపారు. -
అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తి
♦ ఇది అతిపెద్ద ఎన్పీఏ పరిష్కారం ♦ ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ముంబై: జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంటు టేకోవర్ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. జైప్రకాష్ అసోసియేట్స్ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్) ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్ చరిత్రాత్మకమైనదని, భవిష్యత్తులో ఇటువంటి పరిష్కారాలకు ఇది బాట వేస్తుందని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ వ్యాఖ్యానించారు. జేపీ అసోసియేట్స్‌కు, జేపీ సిమెంట్స్‌కు చెందిన సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్‌కు విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు బ్యాంక్ తెలిపింది. అయితే ఈ డీల్ కారణంగా రుణదాతలైన బ్యాంకులకు ఎంత ఒనగూడుతుందో బ్యాంకు వెల్లడించలేదు. మార్కెట్ అంచనాల ప్రకారం రూ. 4,000 కోట్లు బ్యాంకులకు రావొచ్చు. ఈ విక్రయ ప్రక్రియలో కన్సార్షియం లీడ్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ కీలకపాత్ర వహించి, విజయవంతంగా పూర్తిచేసినట్లు కొచర్ వివరించారు. 9.1 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల జేపీ సిమెంటు వ్యాపారాన్ని బిర్లా గ్రూప్ రూ. 16,189 కోట్లకు టేకోవర్ చేసింది. తాజా విక్రయం తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 1.06 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యంగల సిమెంటు వ్యాపారం ఇంకా జేపీ గ్రూప్‌వద్ద వుంటుంది. అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తికాకపోవడంతో 2017 జనవరి–మార్చి క్వార్టర్లో ఆ రుణాలకు పలు బ్యాంకులు కేటాయింపులు చేయాల్సివచ్చింది. తాజాగా విక్రయ ప్రక్రియ పూర్తికావడంతో ఆ బ్యాంకులు ఖాతాల్లోంచి ఆ కేటాయింపుల్ని తొలగించుకునే వెసులుబాటు ఏర్పడింది.